Friday, February 26, 2010

తెలుగుకు ఆలనాపాలన

తెలుగుకు ఆలనాపాలన
'తోటలో వదంతి పుట్టింది పూలన్నీ వాడిపోయాయని... పూలు అదృశ్యమయ్యాయిరా ఫలాలై తిరిగి రావడానికి'- కొన్నేళ్ల క్రితం, భారతీయ భాషల అభివృద్ధి మండలి సదస్సులో డాక్టర్‌ సినారె ఆలపించిన ఆశావహ గేయమది. జనం నాల్కలపై నడయాడే భాష చిరంజీవి అవుతుందని, అది రాజపూజ్యమైతే మరింత రాణకెక్కుతుందనీ ఎవరూ కొత్తగా కనిపెట్టి చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో అధికార భాషగా తెలుగు అమలు అధ్వానంగా అఘోరిస్తుంటే, మమ్మీ డాడీ చదువుల మోజు అసలుకే ఎసరుపెడుతోందన్నది ఆలోచనాపరుల గోడు! 'ఐ నెవర్‌ స్పీక్‌ తెలుగు' అని రాసి ఉన్న బోర్డులను మైదుకూరులో ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల మెడలో వేలాడదీసినప్పుడు గగ్గోలు పుట్టింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు కావాల్సిందేనని రేగిన ఆందోళన పాలపొంగులా చల్లారిపోగా, తెలుగులో మాట్లాడిన ఓ చిన్నారి దుస్తులు విప్పించిన ఘోరం విజయవాడలో తాజాగా నమోదైంది. దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌లో అధికార భాషకు జరుగుతున్న 'సత్కారమిది'! పరభాషా వ్యామోహంలో దశాబ్దాలుగా రాష్ట్రప్రభుత్వమే కొట్టుకుపోతున్నప్పుడు- బతుకు తెరువుకు భరోసా ఇవ్వని మాతృభాషకు బ్రహ్మరథం పట్టేదెవ్వరు? నిరుడు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని- తెలుగుకు ప్రాచీన హోదా దక్కి ఏడాది అయ్యిందంటూ రాష్ట్రప్రభుత్వం సందడి చేసింది. చారిత్రక గతానికి గుర్తింపు సరే- వర్తమానంలో తెలుగు వెలుగు కోల్పోతోందన్న ఆందోళనలను ప్రభుత్వం ఇంతకాలం నిర్లక్ష్యం చేసింది. వచ్చే సంవత్సరాది నుంచి రాష్ట్ర పరిపాలన భాషగా తెలుగును అన్నిస్థాయుల్లో అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి రోశయ్య హామీ కారుచీకట్లో కాంతిరేఖ. తేటతెలుగు వాడకంతో పాలన యంత్రాంగం ప్రజలకు సన్నిహితమైన రోజే ఆంధ్రావనికి ఉగాది!

'ప్రతి రాష్ట్రానికీ అక్కడి భాషే అధికార భాషగా ఉండాలి... పరిపాలన క్రతువంతా రాష్ట్రభాషలోనే జరగాలి... ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ మార్గదర్శి కావాలి' అని రాష్ట్రావతరణ సందర్భంగా ప్రధాని నెహ్రూ అభిలషించారు. ఆ మంచి మాటల్ని చెవిన పెట్టిన నాథుడు లేడు! 'రాజ్యాంగ నిబంధనలకు అసంగతం లేనంతవరకు, ప్రభుత్వ వ్యవహారాలను తెలుగులోనే నిర్వహించా'లన్న వావిలాలవారి తీర్మానం- 'సాధ్యమైనంత త్వరలో' అనే సవరణతో 1955 సెప్టెంబరు 29నే ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. శాసనసభాపతిగా అయ్యదేవర కాళేశ్వరరావు 'తెలుగు పారిభాషిక పదకోశం' తయారుచేయించి, అధికార భాష అమలుకు ప్రాతిపదికలు సిద్ధంచేసినా- తెలుగును రాష్ట్రభాషగా గౌరవించడానికి పదేళ్లు పట్టింది. కర్ణాటక, మహారాష్ట్రల్లోకన్నా ముందే భాషా ఉద్యమాలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌- పరిపాలన భాషగా తెలుగును తీర్చిదిద్దుకోవడంలో వాటితో పోలిస్తే నేటికీ ఎంతో వెనకబడి ఉంది! 27 ప్రభుత్వ శాఖల్లో తెలుగును అమలుచేయాలని, రాత కోతలన్నీ తెలుగులోనే ఉండాలనీ అప్పట్లోనే నిర్ణయించారు. శాసనసభలో బిల్లుల్ని తెలుగులోనే రూపొందించి, అవసరమైతే వాటిని ఆంగ్లంలో తర్జుమా చేసుకోవాలని పీవీ మన్నికైన సూచనలు చేశారు. పాలకుల్లో మాతృభాషాభిమానం కొరవడి, అధికార శ్రేణుల్లో తెలుగుపై చిన్నచూపు జతపడి- రాష్ట్రంలో దశాబ్దాలుగా ఆంగ్లపాలనను సువ్యవస్థితం చేశాయి. అధికార భాషగా తెలుగును ప్రకటిస్తూ 1966లో చేసిన శాసనం అమల్లోకొచ్చేలా చట్టబద్ధ ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వ యంత్రాంగానికి 39 సంవత్సరాలు పట్టింది! 'జీతభత్యాలను ప్రజల డబ్బుతో పొందుతున్నందున, ప్రజల తెలుగు భాషనందు మన కార్య వ్యవహారాలు నిర్వహించడం మన ఉద్యోగ ధర్మం' అని రాష్ట్ర ఆర్థికశాఖ 2007లో ఉత్తర్వులిచ్చింది. ఆ ఉద్యోగ ధర్మాన్ని అన్ని స్థాయుల్లో అమలుచేయడమే ఇక మిగిలింది!

భాష అనేది జాతికి తల్లివేరు, భావితరం ఆరోగ్యకర ఎదుగుదలకు తల్లిపాలు! అన్నాదురై మాటల్లో- మాతృభాష వ్యక్తికి కళ్లుకాగా, పరాయిభాష కేవలం కళ్లజోడు! సుదూర లక్ష్యాలకు గురిపెట్టి కళ్లజోడు వినియోగించడంలో తప్పు లేదంటూనే, ఎప్పటికప్పుడు భాషకు మెరుగులద్ది కళ్లు మసకబారకుండా చూసుకోవడంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు గణనీయ ప్రగతి సాధిస్తున్నాయిప్పుడు! 1957 జనవరి నుంచి అధికార భాష అమలుకు సమకట్టిన తమిళనాడు మాతృభాషను జీవనదిలా మలచేందుకు ఎంతో కృషి చేస్తోంది. ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన సమాచార విప్లవ శకంలో కొత్తగా పుట్టుకొచ్చే పదాలకు సొంత భాష సొబగులద్దడంలోనూ ఎంతో ముందుంది. అందుకు పూర్తి భిన్నంగా, అధికార భాషగా తెలుగును విష కషాయంలా మార్చి ఆంగ్లమే నయమనిపించేలా 'తీర్చిదిద్దిన' ఘనచరిత ఇక్కడ పోగుపడి ఉంది. 'రాజ్య శాసనసభ అప్పట్లో అధివేశనావసానమైనందువల్ల' లాంటి పదబంధాల వాడకం ఏ తరహా పైత్య ప్రకోపం? తేట తెనుగును పరిపాలన మాధ్యమంగా ప్రజలకు చేరువ చెయ్యాలన్న స్థిర సంకల్పంలో తిరుగు లేదన్న సంకేతం అందితేగాని బుర్ర తిరుగుడు బ్యూరోక్రసీ గాడిన పడదు. తెలుగు భాష వినియోగంలో ప్రోత్సాహకరమైన పనితీరు కనబరచినవారి వెన్ను తడుతూ, పాత(క)పంథా వదలనివాళ్లపై కఠిన చర్యలుండేలా సర్కారు వ్యూహం పదునుతేలాలి. పాలన యంత్రాంగంతో ఓనమాలు దిద్దించడం తొలి అంకం. దాంతో మొదలుపెట్టి తెలుగు భాష ఉన్నతికి బహువిధ కార్యాచరణ ప్రణాళికతో చొరవ చూపడం రోశయ్య సర్కారు విధ్యుక్త ధర్మం!