Saturday, February 27, 2010

ఇచ్చినట్టే ఇచ్చి..బడ్జెట్‌పై వివిధ పారిశ్రామిక వర్గాల స్పందన

ఇచ్చినట్టే ఇచ్చి..
బడ్జెట్‌పై వివిధ పారిశ్రామిక వర్గాల స్పందన
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెటు సమతూకంగా, వృద్ధి ప్రధానంగా ఉందని ఇండియా కార్పొరేట్‌ ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. అయితే అదే సమయంలో కంపెనీలపై కనీస ప్రత్యామ్నాయ పన్నును (మ్యాట్‌) 15 శాతం నుంచి 18 శాతానికి పెంచడం విచారకరమని పేర్కొన్నారు. మరో పక్క వాహన కంపెనీలు, గృహోపకరణాల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఉద్దీపన పథకాలను క్రమంగా ఉపసంహరించడాన్ని చాలా వరకు పరిశ్రమ ప్రముఖులు స్వాగతించగా, ఎక్సైజ్‌ సుంకం పెంపు వంటి అనేక ప్రతిపాదనలు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయగలవని మరికొందరు ఆందోళన వెలిబుచ్చారు.
సంచి లాభం చిల్లు తీసింది
'ఆర్థిక మంత్రి చక్కని సమతూకమైన పని చేశారు.. ఆయన ఆర్థిక లోటును 6.9 శాతానికి కుదించడానికి కృషి చేస్తామన్నారు. ఇది ఎంతో బాగుంది. అయితే ఒక పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి కూడా లేకపోలేదు; అది.. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌). సర్‌ఛార్జి తగ్గింపు సంచి లాభాన్ని మ్యాట్‌ రేటు పెంపు అనే చిల్లు తీసేసింది'.
- హర్ష్‌పతి సింఘానియా, ఫిక్కీ అధ్యక్షుడు
మంత్రికి అభినందనలు
'ఈ బడ్జెట్‌తో వృద్ధి కొనసాగుతుంది. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు స్వాగతించదగ్గవి. ఉద్దీపనలను క్రమంగా ఉపసంహరించే ప్రక్రియను చేపట్టినందుకు మంత్రి ముఖర్జీకి అభినందనలు తెలుపుతున్నా. ఎంఏటీ పెంపు ఒక్కటే బాధిస్తోంది.'
- వి.శ్రీనివాసన్‌, సీఐఐ అధ్యక్షుడు
ఆ ఒక్కటీ లేకపోతే..
'మ్యాట్‌ను పెంచకపోయి ఉంటే మేం మరింత ఆనందించే వాళ్లం. సర్‌ఛార్జి తగ్గింపు భేషైందే కానీ, మ్యాట్‌ పెంపుదలే నిరుత్సాహం కలిగిస్తోంది. ఏమైనా ఇది వృద్ధి ప్రధానమైన బడ్జెట్‌. వస్తు, సేవల పన్ను స్వరూపం గురించిన రూపురేఖలు వెల్లడించటం బాగుంది.'
- రాజన్‌ మిట్టల్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ఛైర్మన్‌
ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాగేసుకొని..
'విత్త మంత్రి మధ్య తరగతి వర్గాలకు ఆదాయపు పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించివేశారు.. మౌలిక సదుపాయాల కల్పన బాండ్లలో పెట్టుబడికి అదనపు తగ్గింపును కూడా ప్రవేశపెట్టారు. అయితే వస్తువులపై, పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం పెంపు వల్ల అన్ని తయారీ వస్తువులు ప్రియమైపోతాయి.. అంటే, ఒక చేత్తో ఇచ్చింది మరో చేత్తో తీసేసుకొంటారన్న మాట. కానీ ఎక్కువ మందికి ఈ బడ్జెట్‌ నికరంగా మేలే చేస్తుంది. చమురు, ఎరువుల బాండ్లు జారీ చేయకుండా లోటు విషయంలో పారదర్శకతకు తావు ఇవ్వటం అభినందనీయం'.
- జి.వి.నాగేశ్వర రావు, ఐడీబీఐ ఫోర్టిస్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ అండ్‌ సీఈఓ
ఉన్నత విద్యపై ఏదీ శ్రద్ధ
'మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబులు పెంచటం, ఇ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యం బాగున్నాయి. ఉన్నత విద్యపై శ్రద్ధ తీసుకోలేదు. మ్యాట్‌ పెంపు ప్రభావం ఇన్ఫోసిస్‌పై ఉండదు'.
- ఎస్‌.గోపాలకృష్ణన్‌, ఇన్ఫోసిస్‌ సీఈఓ