
ప్రధాన బాధ్యతలివి..
1. నికర పన్ను ఆదాయాల్లో కేంద్రం-రాష్ట్రాల మధ్య పంపిణీ వాటాలను సూచించటం.
2. రాష్ట్రాలకు సహాయ నిధి (గ్రాంట్స్-ఇన్-ఎయిడ్) మంజూరుకు అనుసరించాల్సిన సూత్రాలను నిర్ణయించటం.
3. రాష్ట్రాల ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు వనరుల సమీకరణ కోసం రాష్ట్రాల సంఘటిత నిధి వృద్ధికి సూచనలు చేయటం. (73,74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ బాధ్యతలు చేర్చారు).
*ఈ విధులన్నిటినీ రాజ్యాంగ అధికరణలు 268-270,273, 275,282, 293లకు లోబడి ఆర్థిక సంఘం నిర్వర్తిస్తుంది.
*కేంద్ర ఆర్థిక సంఘం దేశ వ్యాప్తంగా పర్యటించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతోనూ సంప్రతించి తన తుది నివేదికను ఖరారు చేస్తుంది.
పన్నుల పంపిణీకి ప్రాతిపదిక?
ప్రతి ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తుంది. వివిధ పన్నుల ద్వారా కేంద్రం వద్ద జమయ్యే ఆదాయాన్ని ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు పంపిణీ చేయాలో ఆర్థిక సంఘం చూస్తుంది. ఈ ప్రాతిపదిక స్థిరమైనదేమీ కాదు. ప్రతి ఆర్థిక సంఘం తనదైన విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. తొలినాళ్లలో జనాభాకు 90 శాతం, మిగిలిన అంశాలకు 10 శాతం పాధాన్యం(వెయిటేజీ) ఇస్తూ పన్నుల వసూళ్లలో వాటాలను నిర్ణయించే వారు. క్రమంగా అది మారుతూ వస్తోంది. 12 ఆర్థిక సంఘం జనాభాకు 25 శాతం, రాష్ట్రాల తలసరి ఆదాయానికి 50 శాతం, ప్రాంతానికి 10 శాతం, పన్ను వసూళ్ల సామర్థ్యానికి 7.5 శాతం, ద్రవ్య క్రమశిక్షణకు 7.5 శాతం ప్రాధాన్యం ఇచ్చింది.
రాష్ట్రాల వాటా ఇలా..: 11 వ ఆర్థిక సంఘం మొత్తం పన్నుల రాబడిలో రాష్ట్రాలకు 29 శాతం వాటా సిఫార్సు చేసింది. 12వ ఆర్థిక సంఘం కాలంలో 30.5 శాతానికి పెరిగింది. 13 ఆర్థిక సంఘం 32 శాతం వాటా సూచించింది.
సిఫార్సులన్నీ అమలు చేయాల్సిందేనా..
ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులన్నీ కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలనే నిబంధనేదీ లేదు. కానీ, ఇప్పటి వరకూ ఒక్క మూడో ఆర్థిక సంఘం సిఫార్సులు మినహా మిగిలిన అన్ని సంఘాల నివేదికలు అమలు జరిగాయి. కేంద్ర పన్నులు, సుంకాల రాబడి, సంఘటిత నిధుల పంపిణీకి సంబంధించి రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఆచరణలోకి తీసుకురావచ్చు.