Friday, February 26, 2010

ఆంధ్ర ఆశలు గల్లంతు

ఆంధ్ర ఆశలు గల్లంతు
కేంద్రపన్నుల్లో తగ్గిన రాష్ట్ర వాటా
భారీ రుణాలకు ససేమిరా
తక్షణం ఇక రాష్ట్ర ఆర్థికసంఘం ఏర్పాటు
ఫలితం ఇవ్వని రాష్ట్ర ప్రతిపాదనలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటా 50% ఉండాలన్న ఆంధ్రప్రదేశ్‌ వాదనకు ఆర్థికసంఘం ఆమోదం లభించలేదు. ప్రస్తుతం ఉన్న 30.5% వాటాను 32 శాతానికి మాత్రమే పెంచారు. మరో వైపు కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా తగ్గిపోనున్నది. ఇప్పటి కంటే 0.419% మేర కోతపడనున్నది. రెవెన్యూ రాబడి ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కావాల్సినంత అప్పు తెచ్చుకునే అధికారం ఉండాలన్న రాష్ట్ర పోరాటమూ ఫలించలేదు. పైగా అప్పుల్ని రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ఇక 25శాతానికి పరిమితం చేసుకోక తప్పదు. స్థానిక సంస్థలకు నిధుల్ని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏ మాత్రం జాప్యం చేయకుండా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఫలితాలు. వీటిని కేంద్రం యథాతథంగా ఆమోదించింది.

తగ్గిన వాటా
సేవాపన్ను మినహా మిగతా పన్ను మొత్తంలో మన రాష్ట్రానికి 6.937% అందుతుంది. ప్రస్తుతం ఇది 7.356% ఉండగా 0.419% మేర తగ్గింది. సేవాపన్ను మొత్తంలోనూ తగ్గుదల (0.406% మేర) ఉంది. పన్నుల్లో వాటాలు, గ్రాంట్లు తదితరాలన్నీ కలిపి రాష్ట్రాలకు అందే మొత్తాన్ని 39.5శాతానికి ఆర్థికసంఘం పరిమితం చేసింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల ద్వారా రాష్ట్రానికిరూ. 14,505 కోట్లు రానున్నట్టు రోశయ్య బడ్జెట్లో పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రాల వాటా 32 శాతానికి పెంచడం వల్ల ఈ అంచనాల్లో కొంత పెరుగుదల ఉంటుంది. రాష్ట్ర వాటా 0.419% తగ్గకుండా ఉంటే ఈ పెంపు మరికొంత ఎక్కువ ఉండేది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల నుంచి వరుసగా ఇప్పటి వరకూ రాష్ట్ర వాటా తగ్గిపోతూ వస్తోంది.

అదనపు అప్పుపై ఆంక్షలు
ప్రస్తుతం ఉన్నట్లే రాష్ట్రం అప్పుల్ని స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి పరిమితం చేసుకోవాలి. అంతకు మించి అప్పు అవసరమైతే కేంద్రాన్ని కోరాలి. అప్పుడు కేంద్రమే కొంత మొత్తాన్ని అప్పుగా తెచ్చి పన్నుల్లో వాటా ఇస్తున్న తరహాలోనే రాష్ట్రాలకు విభజించి ఇస్తుంది. రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 31% పైగా ఉండగా వాటిని 2014-15నాటికి 25% కంటే తక్కువకు కుదించుకోవాలని ఆర్థిక సంఘం నిర్దేశించింది. రాష్ట్రాలు అప్పులకు వెళ్లేముందు తొలుత తమ వద్ద ఉన్న భారీ నగదు నిల్వలను వినియోగించుకోవాలి.

కేంద్ర సౌజన్య పథకాల తగ్గింపు
కేంద్ర సౌజన్య పథకాల సంఖ్యను తగ్గించుకోవాలనే సిఫార్సు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనకు అనుగుణంగా ఉంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా సమకూర్చవలసి రావడంతోరాష్ట్ర పథకాలకు ఇబ్బందిగా ఉందని ప్రభుత్వం వాదించింది. కొత్తగా రానున్న వస్తు,సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంపై కేంద్ర, రాష్ట్రాలు బేరసారాలతోనే ఒప్పందాలకు రావాల్సి ఉంటుంది.

రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు అనివార్యం
రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి ఐదేళ్లకోసారి క్రమం తప్పకుండా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సిఫార్సులను అమలు చేయాల్సి ఉంటుంది. దీని ఏర్పాటులో ఇక జాప్యానికి వీలుండదు.ఇందుకు సంబంధించిన వివరాల్ని శాసనసభ ముందు పెట్టాలి. స్థానిక సంస్థల నిధులను ఆడిట్‌ చేసే విభాగాలను రాష్ట్రాలు పటిష్ఠం చేసుకోవాలి. నగర పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించాలి.

విపత్తుల సాయం రూ. 683 కోట్లు పెంపు
విపత్తుల సాయం కింద రానున్న ఐదేళ్లకు కేంద్ర వాటా (75శాతం) కింద రూ.2,108 కోట్లు అందుతుంది. ఇది 2005-10లో వచ్చిన మొత్తానికంటే రూ. 683 కోట్లు ఎక్కువ. ఇక మనుషుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తులకు కూడా కేంద్ర సాయం అందనున్నది. మార్గదర్శకాల్లో ఇది కూడా చేర్చారు.