Thursday, February 25, 2010

ద్రవ్యోల్బణం ఆందోళనకరమే: దువ్యూరి

ద్రవ్యోల్బణం ఆందోళనకరమే: దువ్యూరి

ముంబై : ఆహార వస్తువుల ధరలు నానాటికీ పెరుగుతూ ఉన్న ప్రస్తుత వాతావరణంలో ద్రవ్యోల్బణం అదుపు చేయడం ఒక సవాలుగానే తాము భావిస్తున్నట్టు ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. బుధవారం ముంబైలో ఎల్.కె.ఝా స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆహూతులకు స్వాగత వచనాలు పలుకుతూ ద్రవ్యోల్బణం ఇప్పటికీ, ఎప్పటికీ తమకు ఆందోళన కలిగించే అంశమేనని అన్నారు. ఫిబ్రవరి ఆరో తేదీతో ముగిసిన వారంలో ఆహార ద్రవ్యోల్బణం 17.97 శాతానికి చేరి దీని ప్రభావం టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణంపై కూడా పడవచ్చునన్న భయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్‌బిఐ గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి చివరి నాటికి 8.5 శాతం వరకు ఉండవచ్చునన్న ఆర్‌బిఐ అంచనాలను ఇప్పటికే దాటిపోి 8.56 శాతానికి చేరింది. ఇటీవల ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో ఆర్‌బిఐ అనుసరించిన విధానం గురించి సుబ్బారావు వివరిస్తూ పాశ్చాత్య దేశాల్లో వలె కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థలను ఆదుకునే ధోరణి కన్నా ఆర్థిక వృద్ధిరేటులో పతనాన్ని నిరోధించడానికే తాము ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.