Saturday, February 27, 2010

కార్ల ధరలు ప్రియం

కార్ల ధరలు ప్రియం
ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు ఉపసంహరణ ఫలితం
న్యూఢిల్లీ: విక్రయాల సందడితో కళకళలాడుతున్న వాహన రంగానికి ప్రణబ్‌ బడ్జెట్‌ పగ్గం వేయనే వేసింది. ఈ రంగం వూహించినట్లుగా ఎక్సైజ్‌ సుంకంలో 2 శాతం మంత్రి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా గత బడ్జెట్‌లో పెద్ద కార్లకు ఇచ్చిన రాయితీని పాక్షికంగా వెనుకకు తీసుకొంటున్నట్లు కూడా ప్రతిపాదించారు. దీనిపై వాహన పరిశ్రమ ప్రతినిధులు పెదవివిరిచారు. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని విభాగాల కార్లు ధరలు రెక్కలు తొడుక్కోవడం ఖాయమని సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోలియమ్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ లెవీని లీటర్‌ ఒక్కింటికి రూపాయి మేరకు పెంచినట్లు విత్త మంత్రి ప్రకటన చేయడం వాహన రంగానికి గోరు చుట్టుపై రోకటిపోటులా పరిణమించింది.

రూ.3,000 - 41,000 వరకుపెరగనున్న ధరలు: వాహన పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ సాయంత్రం ఒక ప్రకటన చేస్తూ, తమ కంపెనీ కార్ల శ్రేణి ధరలు కనీసం రూ.3,000 నుంచి గరిష్ఠంగా రూ.13,000 వరకు వెంటనే ఎగబాకనున్నట్లు తెలిపింది. జనరల్‌ మోటర్స్‌ ఇండియా కంపెనీ తమ కార్ల ధరలను రూ.7,500 నుంచి రూ.26,000 వరకు, హ్యుందాయ్‌ రూ.6,500 నుంచి రూ.25,000 వరకు ధరలను పెంచనున్నట్లు పేర్కొన్నాయి. హోండా సియల్‌ కార్స్‌ ఇండియా కూడా ఇదే దారిలో నడచి, తమ ఉత్పత్తులకు రూ.13,000 నుంచి రూ.41,000 వరకు ప్రియం అవుతాయని వెల్లడించింది.

విమాన ప్రయాణమూ భారమే
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బడ్జెట్‌లో సేవా పన్నుల పరిధిలోకి విమాన ప్రయాణికులను కూడా తీసుకు రావడంతో విమానయానం భారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మొదటి, వ్యాపార తరగతుల్లో ప్రయాణించే వారికే సేవల పన్ను వరిస్తుండగా.. తాజాగా దేశీయ ప్రయాణికులపైన కూడా సేవల పన్నును విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పుడిప్పుడే విమాన ప్రయాణికులు పెరుగుతున్నారని, తాజా నిర్ణయ ప్రభావం కొంత మేరకైన ప్రయాణికులపై ఉండగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విమానాశ్రయం ప్రాంగణంలో కల్పించే అన్ని సేవలకు వర్తించే విధంగా 'ఎయిర్‌పోర్ట్‌' సేవలన నిర్వచనాన్ని కూడా మార్చనున్నారు. ఎయిర్‌ ఇండియాను పునరుద్ధరించడానికి ఇటీవల కేబినెట్‌ ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ఈక్విటీని అందించాలని నిర్ణయించడం ఆహ్వానించతగిన పరిణామమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మొదటిగా ప్రభుత్వం రూ.800 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తుంది.