పెట్రో వాత షురూ!
పెట్రోల్ లీటర్‌కు రూ.2.71, డీజిల్ రూ.2.55
అర్ధరాత్రి నుంచే పెంపు
కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల పెంపు ఫలితం
పారిఖ్ కమిటీ సిఫార్సుల అమల్లో తొలి అడుగు
న్యూఢిల్లీ: ఇది సామాన్యుడి బడ్జెట్ అంటూనే విత్త మంత్రి పెట్రో మోత మోగించారు. పెట్రోల్, డీజిల్‌పై సుంకం పెంచిన కారణంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి వీటి ధరలు పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై కస్టమ్స్ సుంకాన్ని 2.5% నుంచి 7.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూపాయి చొప్పున పెంచారు. ఈ భారాన్ని భరించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేని చమురు మార్కెటింగ్ సంస్థలు దాన్ని సరాసరి వినియోగదారులపైకి మోపాయి. ఫలితంగా పెట్రోలు లీటరుకు రూ.2.71, డీజిల్‌కు రూ.2.55 పెరిగింది. ''చమురు మార్కెటింగ్ సంస్థలు సుంకం పెంపును భరించే పరిస్థితిలో లేవు'' అని పెట్రోలియం కార్యదర్శి సుందరేశన్ విలేకర్లతో అన్నారు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 47.43, డీజిల్ రూ.35.47 అవుతుంది. ఇతర ప్రత్యేక పెట్రో ఉత్పత్తులపై సుంకాన్ని పది శాతానికి పెంచిన ఫలితంగా విమాన ఇంధనం కిలోలీటర్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరగునుంది. 
మాంద్యం కనుమరుగవుతున్నందున.. గతంలో తగ్గించిన మేరకే సుంకాలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ కిరీట్ పారిఖ్ కమిటీ సిఫార్సులను క్రమంగా అమల్లో పెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం సుంకం పెంచినట్లు కనబడుతోంది. పెట్రో ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఖరీదైన కార్లు, ఇతర వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని రెండు శాతం పెంచాలని తీసుకున్న నిర్ణయం కూడా పారిఖ్ కమిటీ సిఫార్సులకనుగుణంగానే ఉంది. కార్లు, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయొచ్చని సిఫార్సుల్లో పేర్కొన్నారు. ''వాహన ఇంధనం ధరలపై నియంత్రణ ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి'' అని ఎస్సార్ ఆయిల్ సీఈఓ నరేష్ కె నాయర్ చెప్పారు. పారిఖ్ కమిటీ సిఫార్సులను అమలు చేయబోవడం లేదని ప్రణబ్ స్పష్టం చేయలేదు సరికదా.. తగిన సమయంలో పెట్రోలియం మంత్రి దేవ్‌రా పరిశీలిస్తారని చెప్పారు. వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని దేవ్‌రా వెల్లడించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో ఏకాభిప్రాయం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.
పారిఖ్ కమిటీ సిఫార్సులివే..
*పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలి*మోటార్‌బైక్‌లు, కార్లు వినియోగించేవారిలో ఎక్కువ మంది సంపన్నవర్గాల వారే. వారికి రాయితీపై చమురు ఇవ్వాల్సిన అవసరం లేదు.*డీజిల్‌పై లీటర్‌కు రూ.2.33, పెట్రోల్‌పై రూ. 4.72 చొప్పున పెంచాలి.*డీజిల్ వాడే వ్యక్తిగత కార్లకు, అందులోనూ విలాసవంతమైన కార్లకు ఇంధనంపై రాయితీ ఇవ్వడంలో అర్థం లేదు. మొత్తం అమ్ముడవుతున్న కార్లలో ఇవే 35% వరకు ఉన్నాయి. పెట్రోల్‌కు ఎంతవసూలు చేస్తున్నారో అంతే సుంకాన్ని వారి నుంచీ వసూలు చేయాలి.*డీజిల్‌తో నడిపే స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకూ డీజిల్‌పై సుంకం పెంచాలి.*డీజిల్ ధరల పెంపు వల్ల ట్రక్కుల వినియోగం తగ్గి సరకు రవాణాకు రైళ్లపై ఆధారపడతారు. ఇది శ్రేయస్కరమే.*కిరోసిన్ ధరను గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయానికి ముడిపెట్టి నిర్ణయించాలి. లీటర్‌కు రూ.6 వరకు పెంచాలి. రాయితీ కిరోసిన్ పంపిణీకి స్మార్ట్‌కార్డులు జారీ చేయాలి. దీపపు వెలుగుల కోసం కిరోసిన్‌పై ఆధారపడడాన్ని నిరుత్సాహపరిచి గ్రామీణ విద్యుదీకరణను ప్రోత్సహించాలి. *వంటగ్యాస్ రాయితీని పరిమితంగా, పరిమిత కాలానికే ఇవ్వాలి. గ్యాస్‌బండల వినియోగంపై పరిమితైనా విధించాలి. లేదంటే ధరైనా పెంచాలి. వంటగ్యాస్ వినియోగంలో పట్టణ సంపన్నుల వాటానే ఎక్కువ. అందుకే రాయితీలో అధిక భాగం వారికే పోతోంది. ఇది సరికాదు. పేదలకే అందేలా స్మార్ట్‌కార్డులు ప్రవేశపెట్టాలి. అప్పటివరకు బండపై రూ.100 పెంచాలి