ధరలు దడదడ ఆమ్ ఆద్మీ పేరుచెప్పి ఆరేళ్ల క్రితం అధికారానికి వచ్చిన యూపీఏ కూటమి అప్పటి నుంచీ తన విధానాల ద్వారా పెట్టుబడిదారుల పక్షం వహిస్తూ ధరల అగ్గిని రాజేస్తోంది. మార్కెట్ మాయాజాలంతో హఠాత్తుగా పెరిగే ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. ఆహారం, ఆరోగ్యం, ఆకాంక్షలు... అన్నీ సంక్షోభంలో పడిపోతున్నాయి. ఈసారి పెరిగే ధరలు ప్రధానినే బెంబేలెత్తించాయి. ఆయన తన ప్రతిష్ఠనే ఫణంగా పెట్టి అల్లాఉద్దీన్ అద్భుతదీపం చేతిలో ఉన్నవాడిలా ధరలు దిగి వస్తున్నాయని ప్రకటన చేశారు. అన్నీ తెలిసిన ప్రణబ్ ధరల విషయంలో బడ్జెట్లో ఏమైనా చేస్తారన్న నమ్మకం ఉంది.

* పన్ను వసూళ్లు పెంచుకోవడానికి ప్రభుత్వం నిత్యావసరాల మీద పడకూడదు. * ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని వర్గాలకూ నాణ్యమైన తిండి గింజలు అందించాలి. * నిత్యావసరాల ధరల విషయంలో ఏ శాఖ మంత్రి విఫలమైనా అతని పదవి ఊడుతుందన్న భయం కలగాలి. అప్పుడే సదరు మంత్రులు, వారి కింది అధికారులు నల్లబజారు వ్యాపారులతో కుమ్మక్కు కావాలంటే భయపడతారు. * గత ఆరేళ్లలో బియ్యం ధరలు 77 శాతం, కందిపప్పు ధరలు 252 శాతం పెరిగాయి. నిత్యావసరాల్లో ఫ్యూచర్ ట్రేడింగ్ దీనికి కారణం. పూర్తిగా నిషేధించాలి. * వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలి. దళారీ వ్యవస్థను తగ్గించే సంస్కరణలు చేపట్టాలి. దేశీయ అవసరాలు, పంట విస్తీర్ణంపై ప్రణాళికతో వ్యవహరించాలి. * రాష్ట్రాలు నిత్యావసర వస్తువుల చట్టాన్ని నిక్కచ్చిగా అమలుచేసేట్లు కేంద్రం ఒత్తిడి తేవాలి. అక్రమ నిల్వలపై ఉమ్మడి చట్టం తేవాలి. * విదేశీ పెట్టుబడులతో నిత్యావసరాల ధరలు దిగివస్తాయని చెప్పిన ప్రధాని ఆ విషయంలో ప్రజల అనుమానాలను తీర్చాలి. * ధరలు పూర్తిగా పెరిగే వరకూ వేచి చూడకుండా ప్రభుత్వం ఎప్పటి కప్పుడు ధరలను గమనిస్తూ చర్యలు తీసుకోవాలి. * ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. |
దేశంలో నిత్యావసరాల ధరలు పెరగడానికి తాము కారణం కాదని, అసలు విలన్ - ప్రకృతి వైపరీత్యాలేనంటూ కేంద్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంది. పైగా దేనికైనా ప్రకృతి సహకరించాలంటూ ''నేను ఆ ఇంద్రుడిని ప్రార్థిస్తున్నాను'' అంటూ ఆర్థికమంత్రి ప్రణబ్ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ''ధరల పెరుగుదల సమస్యను కేంద్రం గమనిస్తోంది... తగిన చర్యలు తీసుకుంటుంది''- ఇదీ బడ్జెట్‌లో ప్రణబ్‌బాబు పొదుపుగా చెప్పిన ఒకే ఒక్క మాట. మున్నెన్నడూ లేనివిధంగా ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 22 శాతానికి చేరుకుని సామాన్యులు విలవిలలాడినా... ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ధరల స్థిరీకరణకు ఒక నిధిని ఏర్పాటు చేయడం ద్వారా మార్కెట్‌ను నియంత్రించే అవకాశం ఉన్నా... ఆ దిశగా ఆలోచించిన పాపాన పోలేదు. కనీసం రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పలేదు. ధరల స్థిరీకరణకు ప్రధాని మన్మోహన్ ప్రైవేటీకరణ మంత్రాన్ని జపిస్తున్నారు. ''చిల్లర వ్యాపార రంగాన్ని విదేశీ పెట్టుబడులకు తెరిచే విషయంలో మరింత దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది'' అని మన్మోహన్ మనసులో మాటనే ప్రణబ్ తన ప్రసంగంలో వల్లెవేశారు. ఇది ధరలను తగ్గిస్తుందో లేక... ఏకంగా సంప్రదాయ చిల్లరవ్యాపారి మెడకే చుట్టుకుంటుందో తెలియదు. |