
రాష్ట్రాన్ని గుర్తించిన తొలి మంత్రి: డీఎస్
ఇప్పటివరకూ రాష్ట్ర రైల్వే అవసరాలను గుర్తించిన మొట్టమొదటి రైల్వే మంత్రి మమతాబెనర్జీయే. కృతజ్ఞతగా ఆమెకు లేఖ రాశా. పేదలకు ఉపయోగపడాలనే ఆలోచనబడ్జెట్‌లో స్పష్టంగా కనిపించింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లు, రైల్వే స్టేషన్లలో పది రూపాయలకు భోజనం వంటివి మంచి నిర్ణయాలు.
రాష్ట్రానికి బిస్కట్లు, చాక్లెట్లే: కేసీఆర్
కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. భద్రాచలం- కొత్తగూడెం లైన్లో కొత్తగా వేయాల్సింది ఆరు కిలోమీటర్లు కూడా ఉండదు. పటాన్‌చెరువు లైను కూడా చాలా తక్కువ దూరమే. మనోహరబాద్- కొత్తపల్లి రైల్వేలైను సర్వేకు గతంలో రూ. 5 కోట్లు కేటాయించి అది పూర్తి చేయకుండా ఇప్పుడు దానికే సికింద్రాబాద్ - గజ్వేల్-సిరిసిల్ల- జగిత్యాల లైనంటూ కొత్త పేరు పెట్టడం ఏమిటి?నిజామాబాద్-రామగుండం లైన్ తలాతోక లేని ప్రతిపాదన. రాష్ట్రానికి దక్కింది కేవలం బిస్కట్లు, చాక్లెట్లే. ఖాజీపేటను కనీసం డివిజన్ కేంద్రంగా చేయమని కోరినా అదీ చేయలేదు.
ప్రైవేటీకరణకు ద్వారాలు: రాఘవులు
బడ్జెట్‌లో ప్రైవేటీకరణకు పూర్తి ద్వారాలు తెరిచారు. నిధుల కేటాయింపు, కాలపరిమితి లేకుండా రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించారు. ఇది ఊహాజనిత బడ్జెట్.
పూర్తి న్యాయం చేయలేదు: దత్తాత్రేయ
ఇది జనాకర్షక బడ్జెట్. రాష్ట్రానికి పూర్తి న్యాయం చేయలేదు. ఎంపీలు పార్లమెంటులో ఈ విషయం ప్రస్తావించాలి.రైల్వే భద్రత, ఉద్యోగుల సంక్షేమంపై ప్రస్తావన లేదు. రాష్ట్రానికి కొత్త లైన్లు, కొత్త రైళ్లు ఇవ్వడం హర్షణీయం.
బంగారు పూతే: మైసూరారెడ్డి, నామా
ఇనుముకు బంగారు పూతపూసినట్టుంది. కొత్త లైన్లలో రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసిన వాటికే డబ్బు కేటాయించారు. మంచినీటి సౌకర్యాన్ని వ్యాపారంలా మార్చేశారు.
సమతౌల్య బడ్జెట్: మర్రి రాఘవయ్య
(రైల్వేకార్మికుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి)
బడ్జెట్ సమతౌల్యంగా ఉంది. స్వచ్ఛంద పదవీవిరమణ చేసే ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం సంతోషకరం. దీనివల్ల 2 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది.
ఛార్జీల్ని పెంచకపోవడమే ఘనత : కాంగ్రెస్
ప్రయాణ, సరకు రవాణా ఛార్జీలను పెంచకపోవడం గొప్ప విషయం. పైగా కొన్ని తగ్గాయి. సామాన్యుడి కోణంలో ఈ ఛార్జీలు పెంచకపోవడం ఎంతో మేలు చేసే విషయం. వరుసగా రెండోసారి యూపీఏ ప్రభుత్వం రైల్వే ప్రయాణఛార్జీల్ని పెంచలేదు. బడ్జెట్ ఆశావహంగా ఉంది.
రైల్వేబడ్జెట్‌లో ఎలాంటి వెలుగులు లేవు. సరైన మార్గదర్శనం లేదు. రైల్వే ట్రాక్‌ల అభివృద్ధి, ఆధునికీకరణ, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించకుండా వైద్య కళాశాలలు, ప్రింటింగు ప్రెస్‌లు, విద్యుత్తు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి? మమతను మేం దేశ రైల్వేమంత్రిగా చూడాలనుకుంటున్నాం.