Friday, February 26, 2010

బడ్జెట్‌ పదజాలం

బడ్జెట్‌ పదజాలం

దేశ దిశా నిర్దేశాన్ని చూపించే బడ్జెట్‌ ఎంతో క్రియాశీలకమైనది. ప్రత్య క్షంగా, పరోక్షంగా ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే కేంద్ర బడ్జెట్‌ను ఈ నెల 26వ తేదీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ వాతావరణ సందర్భంగా కనిపించి, విని పించే పదజాలానికి సంబంధించిన అవగాహన పాఠకులలో కల్పించ డానికి వాటి అర్థాలను ఇక్కడ వివరిస్తున్నాము.


చీకటి ఆర్థికవ్యవస్థ (బ్లాక్‌ ఎకానమీ)
  • ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తూ జాతీయ ఆదాయపు లెక్కల్లో గణనకు రాని ఆర్థిక వ్యవస్థ. పన్నులను ఎగవేయడం కోసం పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను బయటపెట్టకపోవడం, ఉత్పత్తి అవుతున్న దానికంటే తక్కువగా లెక్కచూపడం చేస్తుంటారు.
    అవిభక్త గ్రాంట్‌ (బ్లాక్‌ గ్రాంట్‌)
  • ఒక పద్దు కింద విభజన కాని, వివరణ కాని పేర్కొనకుండా ఇచ్చే ఏకమొత్త గ్రాంటు.
    మూలధన రాబడి (క్యాపిటల్‌ గెయిన్‌)
  • ఆస్తులు, బాండ్లు, భూములు, భవనాల అమ్మకాలపై వచ్చే రాబడి. విలువ పెరిగిన ఆస్తుల అమ్మకాలపై వచ్చిన అమ్మకాలను ఇలా అంటారు. భూములు, షేర్లు లాంటి ఆస్తులను వాటిని హక్కుభుక్తం చేసుకున్న ఏడాదిలోగా అమ్మినప్పుడు వచ్చిన లాభాన్ని వర్తమాన ఆదాయంగా పరిగణించి దానిపై పూర్తి పన్ను విధిస్తాయి. ఒకవేళ ఆస్తులను సంపాదించిన ఏడాది తరువాత లాభాలు వస్తే సదరు లాభాలను దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలుగా జమకడతారు.
    పెట్టుబడి వస్తువులు (క్యాపిటల్‌ గూడ్స్‌)
  • తిరిగి వస్తువులు తయారీకి ఉపయోగపడే వస్తువులు.
    మూలధన వసూళ్ళు (క్యాపిటల్‌ రిసిప్ట్స్‌)
  • పెట్టుబడులపై వచ్చే ఆదాయం (ప్రభుత్వరంగ సంస్థల నుంచి వచ్చే ఆదాయం). ప్రజలు, రిజర్వు బ్యాంకు, విదేశీ ఏజన్సీల నుంచి అప్పులు సేకరించడం ద్వారా సమీకరించిన నిధులు. వసూలైన వడ్డీలు, బ్యాంకు రుణాల సొమ్ము ఇందులో ఉంటాయి.
    నగదు ద్రవ్యచెలామణి నిష్పత్తి (క్యాష్‌ లిక్విడిటీ రేషియో)
  • బ్యాంకులో ఉన్న నగదుకు, బ్యాంకు డిపాజిట్లు ఇతర ఆస్తులకు మధ్య ఉన్న నిష్పత్తి. బ్యాంకు స్వల్పకాలిక రుణావసరాలను తీర్చేందుకు ఉపయోగపడే ఆస్తుల పరిమాణాన్ని ఇది సూచిస్తుంది. సులువుగా నగదులోకి మార్చుకోగలిగే ఆస్తులు ఎంతగా ఉంటే ఈ నిష్పత్తి అంతగా పెరుగుతుంది. దీనినే క్యాష్‌ ఎస్సెట్‌ రేషియే అని కూడా అంటారు.
    నగదు నిల్వల నిష్పత్తి (క్యాష్‌ రిజర్వ్‌ రేషియో)
  • ప్రతి బ్యాంకు తమ బ్యాంకులో ఉన్న మొత్తం డిమాండ్‌ డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లలో విధిగా కొంత శాతం నగదు, డిపాజిట్లను రిజర్వు బ్యాంకులో నిల్వ ఉంచుతుంది. దేశంలో ద్రవ్యచెలామణిని నియంత్రించడం కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ విధానాన్ని అమలు చేస్తుంది.
    సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ (క్లాసికల్‌ ఎకానమీస్‌)
  • ఆడమ్‌ స్మిత్‌, జర్మీ బింథాంమ్‌, డేవిడ్‌ రికార్డో ప్రతిపాదించిన ఆర్థిక విధానం. ఇందులో ప్రభుత్వ జ్యోక్యాన్ని కనీస స్థాయికి తగ్గించాలని, స్వేచ్ఛా వాణిజ్యాన్ని, ప్రయివేటు స్వామ్యాన్ని ప్రోత్సహించాలని, సంపదను సృష్టించడానికి శ్రమే సాధనమని వారు ప్రతిపాదించారు.
    క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా
  • ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌ అభివృద్ధి కోసం ఎస్‌బీఐ మరి కొన్ని బ్యాంకులు ఆర్థిక సంస్థలతో కలసి ఏర్పాటు చేసిన కంపెనీ. ప్రభుత్వ సె క్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, విదేశీ మారకం, వ్యాపార లావాదేవీ లన్నింటినీ పరిష్కరించడానికి కేంద్రీకృత వ్యవస్థగా దోహదం చేస్తుంది.
    వినియోదారుల సూచీ
  • ఒక ఆధార రేఖ ప్రాతిపదికగా ఎప్పటికప్పుడు మార్కెట్లో వినియోగదారు లకు లభించే ధరల పరిమాణాన్ని సూచించే కొలమానం.
    పారిశ్రామిక పన్ను
  • దీనినే కార్పొరెట్‌ పన్ను అని కూడా అంటారు. కంపెనీ లాభాలపై విధించే పన్ను. యజమానుల ఆదాయాలపై విధించే పన్నుకు ఇది భిన్నమైనది.
    ధరల పతనం (డిఫ్లేషన్‌)
  • ఇది ద్రవ్యోల్బణానికి విరుద్ధం. డిమాండును మించి ఉత్పత్తి అయ్యే స్థితి. దిగుమతులు తగ్గిపోయి, పన్నులు పెరిగి, వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది.
    ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం (ఈ-కామర్స్‌)
  • ఎలక్ట్రానిక్‌ నెట్‌వర్క్‌ ద్వారా జరిగే సమస్త వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ. ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా సరుకులను సేవలను రూపొందించడం, ఉత్పత్తి చేయడం, ప్రటనలు నిర్వహించడం, అమ్మడం, కొనుగోలు చేయడం, ఖాతాలను పరిష్కరించుకోవడం జరుగుతాయి. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది వినియోగదారులు వాణిజ్య సంస్థలతో జరిపే లావాదేవీలు. రెండవది వాణిజ్య సంస్థల మధ్య జరిగే లావాదేవీలు. మూడవది వాణిజ్య సంస్థలకు ప్రభుత్వానికి జరిగే లావాదేవీలు.
    యూరో కన్వర్టబుల్‌ బాండ్స్‌
  • విదేశీ ఇన్‌వెస్టర్ల నుంచి నిధులు సేకరించడానికి భారతీయ కంపెనీలు జారీ చేసే యూరో బాండ్లు. ఇవి మారకం చేసుకోవడానికి అనువైన బాం డ్లు. వీటిని షేర్లలోకి మార్చుకోవచ్చు లేదా బాండ్లుగానే కొనసాగించ వచ్చు. యూరోపియన్‌ షేర్‌ మార్కెట్లలో వీటిని చలామణి చేయవచ్చు. ఇందుకు భిన్నంగా జీడీఆర్‌లను కేవలం డాలర్‌ మారకంలో విడుదల చేస్తారు.
    ఆర్థిక సర్వే
  • ఇది కూడా బడ్జెట్‌ పత్రాలలో భాగమే. దేశ ఆర్థిక స్థితిని విశ్లేషించే పత్ర మిది. దేశ ఆర్థిక రంగంలో సాధించిన ప్రగతిని మారుతున్న ధోరణులను ప్రతిబింబించే అధ్యయన నివేదిక. ఈ ఆర్థిక సర్వే బడ్జెట్‌ రూపకల్పనకు ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది. ప్రతి ఏడాది బడ్జెట్‌కు ముందు ఆర్థిక శాఖ దీన్ని విడుదల చేస్తుంది.