Friday, February 26, 2010

పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం

పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం
పెట్రోలుపై లీటరుకు రూ.2.67, డీజిల్‌పై రూ.2.58 !

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 : పారిక్ కమిటి నివేదికానుసారం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని శుక్రవారం ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. దీన్నిబట్టి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగబోతున్నాయని నిర్థారణ అయింది. అయితే పెట్రో ఉత్పత్తులపై ఎంత మేర ధరలు పెరగబోతున్నాయన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పారిక్ కమిటి సిఫార్సు చేసిన ప్రకారం పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీ ఎత్తివేసి అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న ధరలకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు రేటు పెంచుకునే అవకాశం కల్పించడం ఒక అంశమైతే, పెంచిన సుంకం మేరకు పెట్రో ధరలను సవరించడం మరో అంశం. మొత్తంగా పారిక్ కమిటి సిఫార్సుల ప్రకారం చూస్తే ప్రస్తుత ధరలను బట్టి లీటరు పెట్రోలుపై రూ.2.67, డీజిల్‌పై రూ. 2.58 పెరిగే అవకాశం కనిపిస్తున్నది. పన్ను పెంపును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే పెట్రోలుపై రూపాయి, డీజిల్‌పై అంతకంటే కొంత తక్కువ వడ్డిస్తారు. ఈ పెట్రో ఉత్పత్తుల పెంపు ఈ అర్థరాత్రి నుంచే అమలయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బడ్జెట్ పాఠంలో ప్రణబ్ ఈ దిశగా ఎలాంటి సూచనా చేయలేదు.

ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రసంగంలో పెట్రో ఉత్పత్తులపై సుంకం అంశాన్ని ప్రస్తావించిన వెంటనే విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. దీనితో ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రసంగం కొనసాగించడానికి వీలులేకపోయింది. బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించ నీయాలని స్పీకర్ మీరాకుమార్ పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్రణబ్ బడ్జెట్ ప్రకటించడం రాజ్యాంగ అవసరమంటూ గదమాయించారు. ఆఖరికి నిరసనల మధ్యనే ఆయన పెట్రో ఉత్పత్తులపై «ధరల పెరుగుదల తప్పదని ప్రకటించారు. పారిక్ కమిటి నివేదిక సిఫార్సుల ప్రకారం ధరలు పెంచితే కిరోసిన్‌పై కూడా ధరలు పెంచక తప్పదు. ఒకవేళ అలా పెంచక పోతే వంటగ్యాస్‌పై వంద రూపాయల వడ్డన తప్పనిసరి. మరీ అంతకాకపోయినా రూ.25 నుంచి రూ.50 వరకైనా వడ్డన తప్పదు. అలాగే పెట్రోలు, డీజిల్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. తద్వారా రవాణా చార్జీలు పెరిగి అంతిమంగా ఆహార ఉత్పత్తులు, ధరలపై ఆ ప్రభావం పడుతుంది. ఇలా ఆలోచిస్తే వ్యవసాయ రంగానికి ప్రణబ్ కల్పించిన కొద్దిపాటి ప్రోత్సాహకాలన్నిటినీ ఈ పెట్రో ఉత్పత్తులు తుడిచిపెట్టేస్తాయి. ఇది ఆహారభద్రత లక్ష్యాన్ని నీరుగారుస్తాయి.