Thursday, February 25, 2010

స్వాగతించిన పారిశ్రామిక రంగం

రైల్వే బడ్జెట్‌ను స్వాగతించిన పరిశ్రమ రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ను పారిశ్రామిక రంగం స్వాగతించింది. ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా ఉండగలదని వారు చెబుతూ ఉండగా.. ట్రేడర్లు మాత్రం రైల్వేలను ప్రైవేటు పరం చేయడానికి విడుదల చేసిన పత్రమే ఈ బడ్జెట్‌ అని విమర్శించారు.
ఆర్థిక వృద్ధికి చేయూత
కొత్త లైన్ల అభివృద్ధి, పోర్ట్‌ అనుసంధానం, గనుల అనుసంధానం, బహుళ లేయర్ల పార్కింగ్‌ సదుపాయాల ప్రాజెక్టుల్లో పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం రైలు సేవల్లో సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఆర్థిక వృద్ధి 9 నుంచి 10 శాతం వరకూ పరుగులు తీయాలంటే రైల్వేల్లో ప్రైవేటు రంగం పాత్ర పెరగాల్సి ఉంది. ఏడాదికి 1000 కి.మీ. లైను ప్రతిపాదన సైతం ఆర్థిక వృద్ధికి దోహదం చేయగలదు. రైల్వే సరకు రవాణా, ప్యాసింజరు ఛార్జీల పెంపు లేకపోవడమనేది ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో ఒక భాగం. శీతలీకరణ ఉన్న వ్యాగన్ల పెంపు సైతం వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా కాపాడతాయి. భారత్‌లో మూల మూలకూ రైల్వే సేవలు చేరడానికి 2010-11లో రూ.41,426 కోట్ల కేటాయింపు చేయడం ఆహ్వానించదగ్గ విషయం.
-ఫిక్కీ అధ్యక్షుడు హర్షపతి సింఘానియా
మార్కెట్‌పై ప్రభావం లేదు
విష్యత్‌ దిశగా చూస్తే మొత్తం మీద ఈ బడ్జెట్‌ సానుకూలంగా ఉన్నా మార్కెట్‌ పరంగా చూస్తే పెద్ద ప్రభావం ఏమీ లేదు. సరకు రవాణా ఛార్జీలు మార్చకపోవడంతో మౌలిక(ఉక్కు, సిమెంటు, బొగ్గు) రంగాల్లో పెద్ద మార్పుండదు.
- ఏంజెల్‌ బ్రోకింగ్‌ సీఎండీ దినేశ్‌ ఠక్కర్‌
వ్యవసాయ షేర్లపై ప్రభావం
విజన్‌ -2020 కోసం ఏడాదికి 1000 కి.మీ. రైల్వే లైను నిర్మాణ లక్ష్యం ఈ రంగంలోని కంపెనీకి సదవకాశాలను తెచ్చిపెడుతుంది. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా ప్రైవేటు రంగానికి ఎక్కువ అవకాశాలు రానున్నాయి. ఆహార ధాన్యాల రవాణాపై వ్యాగన్‌కు రూ.100 తగ్గడం వల్ల వ్యవసాయ షేర్లపై ప్రభావం పడొచ్చు.
-ఇండియా ఇన్ఫోలైన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(పరిశోధన) అమర్‌ అంబానీ
తత్కాల్‌ పథకంపై స్పష్టత లేదు
ఈ బడ్జెట్‌ వృద్ధికి చేదోడుగా ఉండగలదు. సరకు రవాణా కారిడార్లపై దృష్టి సారించడంతో మౌలిక రంగానికి ప్రోత్సాహం ఇచ్చినట్లయింది. అయితే రైలు వ్యాగన్లను బుక్‌ చేసుకోవడానికి కొత్త తత్కాల్‌ పథకం ప్రారంభించిందా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. స్వల్ప, మధ్య కాలిక ప్రాజెక్టుల ఏర్పాటుకు విజన్‌ 2020 మార్గదర్శనం చేయగలదని భావిస్తున్నాం.
-ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐసీసీ)
మౌలికానికి వూతం
రకు రవాణాపై యధాస్థితిని ప్రకటించడంతో సిమెంటు, ముడి ఇనుము, బొగ్గు పరిశ్రమలకు ఉపశమనం కలిగించినట్లయింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికీ ఇది ఒక మార్గం. బంగ్లాదేశ్‌కు రైల్వే లింకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది. ప్రైవేటు ఆపరేటర్లు ప్రత్యేక రైళ్లను నడపడానికి అవకాశం కల్పిస్తుంది.
-భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఫియో) అధ్యక్షుడు ఎ. శక్తివేల్‌
90శాతం రోడ్డు మార్గంలోనే
డ్జెట్‌ ముసుగులో రైల్వేలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకున్నారు. బహుళ జాతి సంస్థలకు, బడా కార్పొరేట్‌ సంస్థలకు రైల్వే ఆస్తులను ధారాదత్తం చేయడానికి విడుదల చేసిన పత్రమే ఈ బడ్జెట్‌. పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం అంటూ పేర్లు మార్చి చేస్తున్నారు. కమ్యూటర్స్‌కు సదుపాయాలు పెంచడంపై కానీ; వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం నిర్ణీత ప్రకటనలు కానీ చేయలేదు. పాలనా వ్యవస్థను పటిష్ఠం చేసేదిశగా కూడా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుతం 90 శాతం వస్తువుల రవాణా రోడ్డు మార్గంలో జరుగుతోంది. రైల్వే రవాణా వ్యవస్థను సరిగ్గా ఉపయోగించుకుంటే ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది.
-అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌
రైతులపై ప్రభావం ఉండదు
రువుల రవాణా ఛార్జీలపై తగ్గింపు అటు రైతులపై కానీ, ఇటు కంపెనీలపై కానీ ఎటువంటి ప్రభావం చూపబోదు. అయితే ఆమేరకు సబ్సిడీ బిల్లును తగ్గించుకోవడానికి ప్రభుత్వానికే ఉపయోగపడగలదు.
- భారత ఎరువుల సంఘం డైరెక్టర్‌ జనరల్‌ సతీశ్‌ చంద్ర
రైల్వేల్లో భాగస్వామ్యాన్ని కోరుకునే ప్రైవేటు రంగానికి ఇది స్పష్టమైన అవగాహన కల్పించలేదు.
- అసోచామ్‌ అధ్యక్షురాలు స్వాతి పిరమాల్‌
దేశం బయట, లోపలి మదుపర్లకు ఈ బడ్జెట్‌ సరైన సంకేతాలను ఇస్తుందని భావిస్తున్నాం.
- సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌
చంద్రజిత్‌ బెనర్జీ