Thursday, February 25, 2010

నిధులు పొందడంలోనూ ఒత్తిడి కొనసాగాలి: ఫ్యాప్సీ

నిధులు పొందడంలోనూ ఒత్తిడి కొనసాగాలి: ఫ్యాప్సీ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కొత్త రైళ్లు, మార్గాలను రాష్ట్రం సాధించుకోవడంపై ముఖ్యమంత్రి రోశయ్యకు ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య, పరిశ్రమల చాంబర్ల మండలి (ఫ్యాప్సీ) అభినందనలు తెలిపింది. రైల్వే బడ్జెట్‌ భవిష్యత్తు దృక్పథంతో ఆశావహంగా ఉందని ఫ్యాప్సీ అధ్యక్షుడు కె.హరీశ్‌చంద్ర ప్రసాద్‌ తెలిపారు. కొత్త రైళ్లు, మార్గాలు, వ్యాగన్‌ కర్మాగారం రాష్ట్రానికి లభించినప్పటికీ.. ఈ ప్రతిపాదనలకు నిధులు ఎలా సమకూర్చుతారన్న అంశాన్ని వేచి చూడాలని అన్నారు. అవసరమైన నిధులు విడుదల చేసే వరకు ఇవి కేవలం హామీలు మాత్రమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త రైళ్లు, మార్గాలు సాధించుకోవడానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్లమెంట్‌ సభ్యులు రైల్వే మంత్రిపై ఎటువంటి ఒత్తిడి తీసుకువచ్చారో అదే విధంగా నిధుల మంజూరులో కూడా ఒత్తిడి చేయాలని ఫ్యాప్సీ సూచించింది. వీలైనంత త్వరగా కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని పేర్కొంది. వచ్చే అయిదేళ్లలో 25 వేల కిలోమీటర్ల అదనపు రైలు మార్గాన్ని నిర్మించాలన్న బృహత్తర లక్ష్యం దేశ ఆర్థికాభివృద్ధి అంచనాలకు అనుగుణంగా ఉందని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి: సీఐఐ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు రైల్వే బడ్జెట్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యంపై హర్షం వెలిబుచ్చారు. రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్‌కు 10 కొత్త రైళ్లను మంజూరు చేయడమేకాక.. కొత్తగా 19 రైల్వేలైన్ల నిర్మాణం వల్ల గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడతాయని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ వై.హరీశ్‌ చంద్ర ప్రసాద్‌ తెలిపారు. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. సికింద్రాబాద్‌లో వ్యాగన్‌ కర్మాగారం, రైల్వే స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ఉత్తర-దక్షిణ, తూర్పు-దక్షిణ ప్రత్యేక సరకు రవాణా క్యారిడార్ల (ఫ్రైట్‌ క్యారిడార్స్‌) పనులు ప్రారంభమై అవి అందుబాటులోకి వస్తే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.