Friday, February 26, 2010

రాష్ట్రాల పన్నుల వాటా 32%

రాష్ట్రాల పన్నుల వాటా 32%
ఐదేళ్లతో పోలిస్తే 1.5 శాతం వృద్ధి
సహాయనిధికి రూ.3.19 లక్షల కోట్లు
స్థానిక సంస్థలకు తొలిసారి భారీగా నిధుల కేటాయింపు
జీఎస్‌టీ అమలుకు రూ.50వేల కోట్లతో నిధి
పరిశ్రమల ఉద్దీపన ప్యాకేజీలను క్రమంగా ఎత్తేయండి
13వ ఆర్థిక సంఘం సిఫార్సులు
ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కేంద్రం వసూలు చేసే వివిధ రకాల పన్నుల్లో రాష్ట్రాలకు కేటాయించే వాటా 32 శాతానికి పెరిగింది. ఇక స్థానిక సంస్థలకు కూడా కేంద్రం నిధులు కేటాయించనుంది. ఈ మేరకు 13వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆర్థిక సంఘం నివేదికను ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీపై 13వ ఆర్థిక సంఘం కీలకమైన సిఫార్సులు చేసింది.

పార్లమెంటులో నివేదిక సమర్పణ అనంతరం ప్రణబ్‌ ముఖర్జీ విలేకరులతో మాట్లాడారు. ''కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నప్పటికీ సమాఖ్య తరహా రాజకీయ వ్యవస్థ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 13వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదిస్తున్నాం'' అని చెప్పారు.

ముఖ్యాంశాలు...
* వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు 32 శాతం వాటా. 12వ ఆర్థిక సంఘం కాలంలో 30.5 శాతమే రాష్ట్రాలకు కేటాయించారు. అంటే, ఒకటిన్నర శాతం పెరిగిందన్నమాట.
* వివిధ పథకాల కింద ఐదేళ్ల వ్యవధిలో రాష్ట్రాలకు రూ.3.19 లక్షల కోట్ల కేటాయింపు.
* ఆదర్శ జీఎస్‌టీ అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత నిర్ణయానికి రావాలి. జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాల రాబడులకు వాటిల్లే నష్టాన్ని ఐదేళ్లపాటు భర్తీ చేయటానికి రూ.50 వేల కోట్ల నిధిని కేంద్రం ఏర్పాటు చేయాలి.
* రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారత కమిటీ చట్టబద్ధమైన మండలిగా రూపాంతరం చెందాలి. జీఎస్‌టీ నష్టపరిహార మొత్తాలను త్రైమాసిక పద్ధతిలో ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలి.
* ఆర్థిక సంఘం సూచించిన జీఎస్‌టీ విధానానికి భిన్నమైన ఒప్పందాన్ని కేంద్ర, రాష్ట్రాలు కుదుర్చుకుంటే రూ.50 వేల కోట్ల నిధిని పంపిణీ చేయనవసరం లేదు.
* ఉద్దీపన ప్యాకేజీల కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో ప్రభుత్వం సడలించిన ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యాలపై 13వ ఆర్థిక సంఘం పట్టు బిగించింది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 6.8 శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని చెప్పింది.
* ఆదాయ లోటును 4.8 శాతం నుంచి సున్నకు తీసుకురావాలి.
*పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజీని క్రమంగా తొలగించాలి.
* రాష్ట్రాలకు ఇవ్వజూపిన వాటా, విడుదల చేస్తున్న మొత్తాలకు మధ్య వైరుధ్యాలకు తావివ్వని విధంగా కేంద్రం తమ శిస్తులు, సర్‌ఛార్జీల వసూళ్ల పద్దులను సక్రమ నిర్వహిస్తామని హామీ ఇవ్వాలి.
* కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్యను తగ్గించాలి.
* విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు మరిన్ని రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించటం కేంద్రం మానుకోవాలి. తానే రుణాలు తీసుకుని పన్నుల వాటాల ఆధారంగా రాష్ట్రాలకు పంచాలి.
* వేతన సవరణల సిఫార్సులను ఆమోదం పొందిన తేదీల నుంచి మాత్రమే అమలు చేయాలి.
* పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించే నిధుల నిబంధనలను సరళీకరించాలి.
* పీఎస్‌యూల భూమి రికార్డులు సక్రమంగా నిర్వహించాలి. ఈ భూమి సక్రమ వినియోగానికి కృషిచేయాలి. లేదా కొత్త పీఎస్‌యూల ఏర్పాటుకు ఉపయోగించాలి. విక్రయించవచ్చు కూడా.

రాష్ట్రాలకు సూచనలు
*ప్రణాళిక నిధులను ప్రణాళికేతర అవసరాలకు వాడొద్దు.
*పనిచేయని ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకు 2011 మార్చికల్లా రంగం సిద్ధం చేయాలి. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ అవకాశాలను పరిశీలించాలి.
*జల విద్యుత్‌ ప్రాజెక్టుల సత్వర పూర్తికి సరైన వ్యవస్థను ఏర్పరుచుకోవాలి.
*కొత్త పెన్షన్‌ పథకాలను వెంటనే అమలు చేయాలి.
*రాష్ట్రాల సరిహద్దుల వెంబడి సరకు రవాణా సమస్యలను పరిష్కరించాలి. పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి చెక్‌పోస్టులు నిర్వహించాలి. ఎలక్ట్రానిక్‌ పాసుల వంటి విధానాలను అనుసరించాలి.
*నిర్ణీత కాలావధిలోగా విద్యుత్‌ రంగ నష్టాలను సరిదిద్దుకోవాలి.
*ప్రాథమిక విద్యకు రూ.24వేల కోట్లు, పర్యావరణానికి రూ.15 వేల కోట్లు కేటాయించాలి.
*పంచాయతీలు, మున్సిపాలిటీలు తదితర స్థానిక సంస్థలను బలోపేతం చేయాడానికి మరో రూ.87 వేలకోట్లు ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ఇదే తొలిసారి.
*స్థానిక సంస్థలు చేసే రెవెన్యూ వసూళ్లకు ప్రోత్సాహకాలివ్వాలి.
*రాష్ట్రాల ఆర్థిక సంఘాల నివేదిక సత్వర అమలుకు హామీ ఇవ్వాలి. చర్యా నివేదికలను చట్టసభల ముందుంచాలి.