ఫార్మాకు మంచి కబురు
ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధిపై దృష్టిని నిలిపి సమతూకంగా వెలువడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, సామాజిక రంగం, ఇతర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు కేటాయింపులు పెరగడం బడ్జెట్‌లో విశేషం. ఆరోగ్య సంరక్షణ సూచీల్లో మన దేశం దిగువన నిలచిన నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని నిధులను ఇవ్వబూనడం ప్రభుత్వ నిబద్ధతను చాటుతోంది. ఇది కచ్చితంగా ఒకటికి పది విధాల ప్రభావాన్ని ప్రసరింపచేయడం ఖాయం. ఔషధ తయారీ రంగం వైపు నుంచి చూస్తే, సంస్థాగత పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించిన వ్యయాన్ని వెయిటెడ్ డిడక్షన్ పద్ధతిలో 150% నుంచి 200 శాతానికి పెంచడం సానుకూల, ప్రోత్సాహకర ప్రతిపాదనే. ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్) వృద్ధికి సహకరిస్తామనడం ఇంకొక శుభ వార్త. అలాగే జీఎస్‌టీ, డీటీసీ లను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకోవడం మంచి శకునం. కార్పొరేట్ సర్‌చార్జి తగ్గింపు ఒకింత ఊరటను మిగిల్చేటట్లున్నా, మ్యాట్‌ను పెంచకుండా ఉండాల్సింది. జీడీపీలో 6.9 శాతానికి లోటు ఎగబాకడం, రెండంకెలకు చేరిన ఆహార ద్రవ్యోల్బణం పెను సవాళ్లు. - సతీశ్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎండీ, సీఓఓ