Saturday, February 27, 2010

'ఇంతి'త కాదయా!

'ఇంతి'ంత కాదయా!
రాష్ట్రపతి మహిళ. లోక్‌సభ స్పీకర్‌ మహిళ. కేంద్ర సంకీర్ణ ప్రభుత్వ సారధి మహిళ. విపక్ష నేత మహిళ. ఇలా అత్యున్నత స్థానాల్లో అంతా అతివలే ఉన్నందున దేశంలో మహిళల అభ్యున్నతి కోసం నిజాయతీగా కృషి జరుగుతుందని భావించటం అత్యాశ కాదు.
మహిళా లోకం ఏం ఆశిస్తోంది..?
* ఒకప్పుడు మహిళల డిమాండ్లంటే 'వంటింటి వ్యవహారాలే' అనుకునే వారు. కానీ ప్రగతి పథంలో సాగుతున్న నేటి మహిళ ప్రాధమ్యాలు... కేవలం నిత్యావసరాల ధరవరలకే పరిమితం కాదు. పారిశ్రామిక రంగం, పన్నులు, వాణిజ్యం, రుణాలు, రాయితీలు.. ఇలా ఎన్నింటితోనో ముడిపడి ఉన్నాయని, వీటన్నింటా తమకు ప్రాధాన్యం ఇస్తూ విధిగా 'జెండర్‌ బడ్జెటింగ్‌'ను అనుసరించాలని నేటి మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.
* తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవటానికి ప్రత్యేక శిక్షణ కోసం కేటాయింపులు ఉండాలని కోరుతున్నారు. బడ్జెట్లో- కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక రుణాలు తమకు అందుబాటులోకి తేవటం మీద దృష్టిపెట్టాలని, వెనకబడిన కులాలు, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల అభ్యున్నతి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆశిస్తున్నారు.
* మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం, శిశుమరణాల రేటు తగ్గించటం కోసం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు పెంచాలని కోరుతున్నారు.
* వ్యవసాయ పనులు చేసుకునే మహిళలకు ఎక్కడా సంస్థాగత రుణాలు పుట్టటం లేదు. వారి పేరు మీద సెంటు భూమి కూడా లేకపోవటమేదీనికి కారణం. వీరికి హామీలతో నిమిత్తం లేని సంస్థాగత రుణ వసతి కల్పించాలని కోరుతున్నారు.
* మహిళా కార్మికుల్లో 97% అసంఘటిత రంగంలో ఉన్నారు. ఇలాంటివారి సామాజిక భద్రత కోసం 2008లో బిల్లు ఆమోదించినా అమలుకు వచ్చేసరికి- అలసత్వంతో పాటు అరకొర నిధులూ అవరోధంగా మారాయి. గృహహింస బిల్లుదీ ఇదే పరిస్థితి. దీనికోసం రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
* మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయింపులు ఏటికేడాది తగ్గిపోతున్నాయి. మహిళలు, ప్రధానంగా గ్రామీణ పేదల ఆర్ధిక పరిపుష్టికి ఉపకరించే 'స్వయంసిద్ధ', 'స్వధార్‌', 'స్టెప్‌', ఎస్సీ మహిళలకు ప్రత్యేక సహాయం తదితర పథకాలకు కేటాయింపులు క్రమేపీ తగ్గించేస్తున్నారు. ఆడపిల్లల స్కూలు విద్య ప్రోత్సాహకంగా ప్రకటించిన జాతీయ పథకం కేటాయింపులూ తగ్గిపోతున్నాయి. మైనారిటీ మహిళల్లో నాయకత్వ పెంపుదలకు ఉద్దేశించిన పధకాల్లో పెంపుదల లేదు. వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టళ్లు, వైపరీత్యాల్లో నిరాశ్రయులైన మహిళలకు నీడ, రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన 'షార్ట్‌ స్టే హోం'ల కేటాయింపుల విషయంలోనూ పురోగతి లేదు. వీటిని తగిన కేటాయింపులతో, చిత్తశుద్ధితో అమలు చెయ్యాలి.
* మొత్తం కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక మహిళా కేటాయింపులన్నవి కొన్నేళ్లుగా 5.5% దగ్గరే ఆగిపోయాయి. ఇది గణనీయంగా పెరగాలని కోరుకుంటున్నారు.
బడ్జెట్‌ ఏమిచ్చింది..?
ప్రణబ్‌ దాదా ఆడపడుచుల సంక్షేమంపై ఈసారి కాస్త గట్టిగా దృష్టి సారించారు. శిశుసంక్షేమాన్నీ మనసారా ఆకాంక్షించారు. వారిపై వరాల జల్లు కురిపించారు. కేటాయింపుల పెంపులు, సరికొత్త మార్పుచేర్పులతో సమగ్ర మహిళాభివృద్ధికి బాటవేసే యత్నాలు చేశారు. గత బడ్జెట్‌లో మహిళాశిశు సంక్షేమంపై ఖర్చు రూ. 8,624 కోట్లుగా ఉండగా... 2010-2011 బడ్జెట్‌లో రూ.11,070కోట్లను కేటాయించారు.

* మహిళా, శిశు సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలకు కేటాయింపులను దాదాపు యాభయిశాతం పెంచారు. ఇది వనితా లోకానికి కచ్చితంగా తీపికబురే.
* సమగ్ర శిశు సంరక్షణ పథకానికి గతేడాది రూ.44కోట్లు కేటాయించగా... ఇప్పుడు రూ.270 కోట్లను ప్రత్యేకించారు.
* ప్రసూతి చేయూతకు ఉద్దేశించిన 'ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్‌ యోజన'కు గత ఏడాది కేవలం తొంభైలక్షలరూపాయలను మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది ఆ కేటాయింపులను రూ.351 కోట్లకు పెంచారు.
* వ్యవసాయ రంగంలో మహిళా శక్తికి ప్రణబ్‌ ఈ బడ్జెట్‌లో సముచిత బలాన్నిచ్చారు ...మహిళా రైతుల కోసం రూ.100కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. దీనిని 'మహిళా కిసాన్‌ సశక్తీకరణ్‌ పరియోజన'గా పేర్కొన్నారు. మహిళారైతుల మేలుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకానికి అనుబంధంగా ఆర్థికమంత్రి పేర్కొన్నారు.
*మహిళా సాధికారత సాధనే థ్యేయమంటూ... ఇందుకోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్‌ ఏర్పాటును విత్తమంత్రి ప్రకటించారు.
*జెండర్‌ బడ్జెటింగ్‌ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల్లో మహిళలకు ప్రత్యేకించిన పథకాల కోసం రూ.67,749.80కోట్లను కేటాయించారు.
* ఇవేకాక, 2009-10లో మహిళాశిశు సంక్షేమానికి ఉద్దేశించిన పలు కార్యక్రమాలు ఇప్పుడు అమలుకు సంసిద్ధంగా ఉన్నట్లు ప్రణబ్‌ ప్రత్యేకంగా పేర్కొన్నారు.