Thursday, February 25, 2010

రైళ్లల్లో 'మహిళా వాహిని'

రైళ్లల్లో 'మహిళా వాహిని'
న్యూఢిల్లీ: రైళ్లల్లో తరచుగా దోపిడీలు, అక్రమాలు, ప్రమాదాలు జరుగుతుండడంతో భద్రతపై మమతాబెనర్జీ దృష్టి సారించారు. బడ్జెట్‌లో కీలక నిర్ణయాలను ప్రకటించారు.

* మహిళా ప్రయాణికుల భద్రత కోసం వచ్చే ఐదేళ్లలో 12 కంపెనీల మహిళ రిజర్వు పోలీస్‌దళాలను ఏర్పాటు చేస్తారు. దీనికి 'మహిళా వాహిని' అని నామకరణం చేశారు.
* కాపలా లేని క్రాసింగుల వద్ద కాపలాదారుల నియామకం.
* దూర ప్రాంతాలకు వెళ్లే 20 రైళ్లలో అగ్ని ప్రమాదాలను గుర్తించే అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
* మెరుగైన సదుపాయాలు కల్పించడం ద్వారా 94 రైల్వే స్టేషన్లను 'ఆదర్శ రైల్వే స్టేషన్లు'గా తీర్చిదిద్దుతారు.
* ప్రయాణికులకు తక్కువ ధరకు శుద్ధి చేసిన తాగునీటిని అందించడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో ఆరు తాగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
* పీపీపీ పద్ధతిలోనే 93 బహుళ ప్రయోజన కాంప్లెక్సులు, పార్కులు అభివృద్ధి చేస్తారు.
* రిజర్వేషన్‌ స్థాయి, రైళ్ల సమయం తెలియజేయడం కోసం స్వల్పకాలిక సందేశాలను (ఎస్‌ఎంఎస్‌)లను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు చేరవేస్తారు.
* ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, న్యాయస్థానాలు, ఐఐటీలు, ఐఐఎంలు, జిల్లా ప్రధాన కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్లో మొబైల్‌ ఈ టిక్కెటింగ్‌ కేంద్రాలను ప్రవేశపెడతారు.