Saturday, February 27, 2010

కల కానిదీ.. విలువైనదీ!

కల కానిదీ.. విలువైనదీ!
మాంద్యం తాకిడికి మార్కెట్లో గిరాకీ పడిపోయినా.. ధరలు ఇరవై శాతం తగ్గినా.. నేటికీ సామాన్యులు ఇల్లు కొనలేని పరిస్థితి! మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా నిర్మాణాలు చేపట్టేందుకు సంస్థలు ఆసక్తితో ఉన్నా.. బండి ఎటూ కదలని అనిశ్చితి. ఐదేళ్ల క్రితం వరకూ కూడా నెలకు రూ.10 వేల జీతం వచ్చేవారు కూడా నిశ్చింతగా ఓ ఇంటివారయ్యే వాతావరణం ఉండేదిగానీ.. ఇప్పుడు నెలకు రూ.30 వేల జీతం వచ్చేవారూ ఇళ్ల వైపు చూడాలంటే వణికిపోతున్నారు.
* ఎనిమిదేళ్ళ క్రితం స్థలాల ధరలు, నిర్మాణ వ్యయం తక్కువ. గిరాకీ ఉన్న చోటే బిల్డర్లు ఇళ్ళు నిర్మించేవారు. అప్పట్లో స్థానిక సంస్థలూ నామమాత్రపు ధరకే ప్లాట్లు విక్రయించేవి. దీంతో హైదరాబాద్‌ నగరంలోని హిమాయత్‌నగర్‌, బర్కత్‌పురా, మెహిదీపట్నం వంటి ప్రాంతాల్లో రెండు పడక గదుల ఫ్లాట్లు పది లక్షల్లోపే లభించేవి. దిల్‌సుఖ్‌నగర్‌, మోతీనగర్‌లలో అయితే ఆరు లక్షల నుంచే దొరికేవి. హైటెక్‌సిటీ సమీపంలోని అయ్యప్ప సొసైటీలో గజం ధర.. ఐదు వేలు!
* ఐటీ రంగం రాకతో.. ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. ఐదంకెల జీతం తీసుకోవటం ఆరంభించిన ఐటీ నిపుణులు- పన్ను రాయితీ, భవిష్యత్తు వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇళ్ళు కొనడం ఆరంభించారు. 2004లో మౌలిక అభివృద్ధి.. ఉపాధిని పెంచే పరిశ్రమల ప్రకటనలు వెలువడటంతో ప్రవాస భారతీయులూ స్థలాలు కొనడం మొదలెట్టారు. బ్యాంకులు పోటీపడి వడ్డీ రేట్లు తగ్గించడంతో బూమ్‌ ఏర్పడింది. అగ్నికి వాయువు తోడైనట్లు.. ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేలం పాటల వల్ల స్థలాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఐటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని బిల్డర్లూ ఆధునిక ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. అప్పుడే ప్రభుత్వం అనుమతుల ఫీజులు, భూముల మార్కెట్‌ విలువలను పెంచేసింది. దీనికి తోడు నిర్మాణ వ్యయమూ గణనీయంగా పెరిగింది. మొత్తానికి- ఇల్లు కొనడమనేది సామాన్యుడికి భారమైంది. కేవలం ఐదేళ్ళ వ్యవధిలో ఫ్లాట్ల ధర రెండు-మూడు రెట్లు అధికమైంది.
* నగరం నుంచి పది, పదిహేను కిలోమీటర్ల దూరంలో.. నిబంధనల ప్రకారం కట్టిన ఫ్లాట్‌ కొనాలంటే.. హీనపక్షం రూ.30 లక్షలైనా ఉండాలి. బ్యాంకుల ప్రకారం 20% మార్జిన్‌ మనీ (అంటే రూ.6 లక్షలు) చేతిలో పట్టుకోవాలి. మిగతా రూ.24 లక్షలూ రుణం తీసుకోవాలి. దీనిపై ప్రస్తుతం 8 శాతం వడ్డీ లెక్కించినా.. ఇరవై ఏళ్ళ కాలవ్యవధికి..నెలకు సుమారు రూ.22,000 వరకూ వాయిదా రూపేణా చెల్లించాలి. ప్రతినెలా ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, అత్యవసరాల్లో ఆస్పత్రి, రవాణా వ్యయం, పండగలు, పబ్బాలు వంటి వాటికి ఎంతలేదన్నా రూ. 15,000 వరకూ ఖర్చవుతుంది. అంటే నెలకు ముప్పై వేల జీతగాళ్ళూ సొంతింటి కలను తీర్చుకోలేని దుస్థితి.

సామాన్యుడి గోడు?
* గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాలి. మొదటిసారి ఇల్లు కొనేవారికి ప్రత్యేక వడ్డీ రేటును వర్తింపజేయాలి. గృహరుణాలు తీసుకునేవారికి ఏటా లక్షన్నర వరకూ ఇచ్చే పన్ను మినహాయింపును మూడు లక్షలకు పెంచాలి.
* సకాలంలో నిర్మాణాల్ని పూర్తి చేయని సంస్థలను దారిలోకి తెచ్చేలా నిబంధనల్ని మార్చాలి. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించారా? లేదా? అన్నది పరిశీలించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలి.
* దేశమంతటా స్టాంప్‌డ్యూటీ ఒకే రేటును వర్తింపజేయాలి.

నిర్మాణ రంగం ఆశిస్తున్నదేమిటి?
* వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్య గల అందుబాటు టౌన్‌షిప్‌ అపార్టుమెంట్లకు ఆదాయపన్ను, సేవాపన్ను, ఎక్సైజ్‌ సుంకం వంటి మినహాయింపులను వర్తింపజేయాలి. రూ.10-25 లక్షల్లోపు విక్రయించే ఫ్లాట్లకే ఈ నిబంధన ఉండాలి.
* 2007 మార్చి 31లోపు అనుమతి తీసుకున్న నిర్మాణాలకు.. సెక్షన్‌ 80-ఐబీ (10) కింద ఎల్‌ఐజీ, ఎంఐజీ నిర్మాణాలకు పన్ను రాయితీ ఇచ్చేవారు. ఎకరా కంటే ఎక్కువ స్థలంలో పదిహేను వందల చదరపు అడుగుల్లోపు కట్టే ఫ్లాట్లకు పన్ను మినహాయింపు ఇవ్వాలి.
* ఐదేళ్ళలో మురికివాడల్లేకుండా దేశాన్ని తీర్చిదిద్దడం కోసం ఉద్దేశించిన రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకం విజయవంతం అవ్వాలంటే.. వీటిని నిర్మించే బిల్డర్లు, డెవలపర్లకు పన్ను రాయితీలను అందజేయాలి. ఇళ్ళ గరిష్ట సంఖ్యపై నిబంధనను విధించి.. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే వారికి పెద్దపీట వేయాలి.
* సమీకృత పట్టణాల ప్రాజెక్టులకు 'మౌలిక సదుపాయాల హోదా'ను ఇవ్వడం సముచితం.

నిర్మాణ రంగంలో నిరాశ
ఆర్థిక మంత్రి ఆదుకుంటారని ఆశించిన భారత నిర్మాణ రంగం భంగపడింది. బడ్జెట్‌లో ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది. ఆర్థిక మాంద్యం తాకిడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ప్రణబ్‌ముఖర్జీ స్థిరాస్తి రంగాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని బిల్డర్లు, డెవలపర్లు, రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* సిమెంట్‌, ఉక్కులపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం వల్ల.. భవన నిర్మాణ సామగ్రి రేట్లు పెరుగుతాయి. దీంతో పది శాతం దాకా నిర్మాణ వ్యయం పెరుగుతుంది. దీంతో అంతిమంగా కొనుగోలుదారుడి మీదే భారం పడుతుంది.
* అందుబాటు ధరలో నిర్మించే ఇళ్ళకు బడ్జెట్‌లో ఆర్థికమంత్రి మొండిచెయ్యి చూపించారు. 20 లక్షల్లోపు ఇంటిని కొన్నప్పుడు పది లక్షల్లోపు రుణం తీసుకుంటే.. ఒక శాతం సబ్సిడీని అందజేస్తారు. దీనివల్ల మహా అయితే రూ.6 వేలు దాకా కలిసొస్తుంది. ఆరు వేల రూపాయలు తగ్గినంత మాత్రాన ఇల్లు కొనడానికి ముందుకొస్తారన్నది అపోహే! రుణాలపై వడ్డీ రేట్లు తగ్గితే తప్ప పేదల సొంతింటి కల సాకారమవ్వదు.
* 2007 మార్చి 31లోపు.. ఎకరా కంటే ఎక్కువ స్థలంలో పదిహేను వందల చదరపు అడుగుల్లోపు కట్టడానికి అనుమతి తీసుకున్న నిర్మాణాలకు మరో ఏడాది దాకా మినహాయింపును పొడిగించారు. దీంతో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకు కొంత మేలు కలుగుతుంది.

నిరుత్సాహమే!
త రెండేళ్ళుగా దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో సిమెంటు, ఉక్కు, భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగేలా నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదు. ముందు నుంచీ కేంద్రం నిర్మాణ రంగానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు. మొత్తానికి బడ్జెట్‌ వల్ల స్థిరాస్తి రంగానికి కలిగే ప్రయోజనం తక్కువే.
- శేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, బిల్డర్స్‌ ఫోరం