Saturday, February 27, 2010

చిన్న, మధ్యతరహా సంస్థలకు కాస్తంత వూరటే

చిన్న, మధ్యతరహా సంస్థలకు కాస్తంత వూరటే
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెటులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు రానున్న ఆర్థిక సంవత్సరం (2010-11)లో కేటాయింపును రూ.600 కోట్ల మేర పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విత్త మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం బడ్జెటు ప్రసంగంలో ఈ సంగతి తెలిపారు. ఇదివరకు ఈ రంగానికి రూ.1,794 కోట్లు కేటాయించారు. ఇపుడు దీనిని రూ.2,400 కోట్లు చేశారు. ఎంఎస్‌ఎంఈలపై ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సిఫారసుల అమలును ఒక ఉన్నత స్థాయి సమితి (కౌన్సిల్‌) పర్యవేక్షించగలదని ముఖర్జీ వివరించారు. ఎస్‌ఎంఈలకు 2% వడ్డీ రాయితీని (ఇంటరెస్ట్‌ సబ్‌వెన్షన్‌) ఒక ఏడాది పాటు పొడిగించేందుకు ప్రతిపాదించారు. ఈ పథకం గడువు వచ్చే నెల 31తో ముగియనుంది. సమగ్ర ఖాదీ సంస్కరణల కార్యక్రమం అమలుకు ఆసియా అభివృద్ధి బ్యాంకుతో గత డిసెంబరు 22న కేంద్ర ప్రభుత్వం 150 మిలియన్‌ డాలర్ల (రూ.690 కోట్ల) రుణ ఒప్పందాన్ని కుదర్చుకొందని, ఈ కార్యక్రమం ఎంపిక చేసిన 300 ఖాదీ సంస్థలకు వర్తిస్తుందని మంత్రి గుర్తు చేశారు.