Saturday, February 27, 2010

అత్తెసరు 'పరిశోధన'

అత్తెసరు 'పరిశోధన'
దేశంలోని అనేక సామాజిక, ఆర్థిక సమస్యలకు సైన్స్‌ సమాధానం చెబుతుంది. దేశ పురోగతికీ దోహదపడుతుంది. శాస్త్ర పరిశోధనల్లో ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కోట్ల డాలర్లు ఖర్చుపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నిపుణుల్ని ఆకర్షిస్తున్నాయి. వంద కోట్ల జనాభా ఉన్న భారత్‌లో శాస్త్ర పరిశోధనల స్థాయి ఇంకా వూపందుకోలేదు.
దేశ ప్రజలేం కోరుతున్నారు?
* భారత్‌లో ఏటా 4 లక్షల మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, 3 లక్షల మంది కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. ఇంజినీరింగ్‌లో వెయ్యి మంది పీహెచ్‌డీలు అందుకుంటున్నారు. వీరిలో ప్రపంచస్థాయిలో పోటీపడే సామర్థ్యం ఉన్నవారు చాలా తక్కువ. అలా సమర్థవంతుల్ని తయారుచేసినపుడే ఈ చదువుకు సార్థకత.
* 2007-08లో పదిలక్షల మంది జనాభాకు గాను 156 మంది పరిశోధకులు భారత్‌లో ఉన్నారు. అదే అమెరికాలోనైతే 4700 మంది ఉన్నారు. అమెరికాలో మొత్తం పరిశోధకుల సంఖ్య 15.71 లక్షలు కాగా.. చైనాలో 14.23 లక్షలు, ఈ సంఖ్య భారత్‌లో 1.54 లక్షలు మాత్రమే.
* పరిశోధన, అభివృద్ధి రంగంలో అమెరికా 368 బిలియన్‌ డాలర్లు ఖర్చుపెడుతుండగా.. చైనా 104 బిలియన్‌ డాలర్లు, భారత్‌ 24 బిలియన్‌ డాలర్లు వ్యయం చేస్తున్నాయి. పరిశోధన రంగంలో మన అలక్ష్యానికి ఈ గణాంకాలే చిహ్నాలు
* 70 శాతం మేర నోబెల్‌ బహుమతి విజేతలు అమెరికా విశ్వవిద్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌లలో 30 శాతం మేర ప్రచురణలు అమెరికా నుంచే జరుగుతున్నాయి.
* భారత్‌లో అత్యున్నత సంస్థలుగా గుర్తింపు పొందిన ఐఐటీల బోధన సిబ్బంది ఏడాదికి ఆరు నుంచి 8 పేటెంట్లు పొందుతున్నారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ సిబ్బంది 64, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) సిబ్బంది 102 పేటెంట్లు సాధిస్తున్నారు.
* ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ(ఐఎన్‌ఎస్‌ఏ) సూచించిన విధంగా దేశంలో దాదాపు 10 విశ్వవిద్యాలయాలను కనీసం తూర్పు ఆసియా దేశాల్లో ఉత్తమ వర్సిటీల స్థాయికి తీసుకురావాలి. వీటిలో పరిశోధనలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక్కో వర్సిటీకి రూ.200 కోట్లు ఇవ్వాలి.
* 2007-08లో యూజీసీ 47 వర్సిటీలపై సర్వే నిర్వహించింది. 51శాతం మేర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇందులో తేలింది. వీటి భర్తీపై తక్షణం దృష్టిసారించాలి.
* విస్తృతస్థాయి పరిశోధనలతో ప్రధానంగా ప్రయోజనం పొందేది పరిశ్రమలే. అందువల్ల పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఉండాలి. ఆర్‌అండ్‌డీలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న సంస్థలకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలి.
* ఈ-లెర్నింగ్‌ వనరులను మెరుగుపరచాల్సి ఉంది. నిరంతర అధ్యయనం చేయడానికి అవకాశాలు కల్పించాలి.
* హానికారక ఉద్గారాలను తగ్గించాలని కోపెన్‌హాగెన్‌ సదస్సుకు ముందే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని అమలుకు పర్యావరణ అనుకూల పరిజ్ఞానాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం పరిశోధన రంగానికి భారీగా నిధులు అవసరం.
* దేశంలో మరో హరిత విప్లవానికి అవసరం ఏర్పడింది. వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాల్సి ఉంది.
* భవిష్యత్‌ ప్రపంచాన్ని నిర్దేశించే నానోటెక్‌, బయోటెక్‌, మూలకణ చికిత్స వంటి రంగాల్లో పరిశోధనలకు ప్రభుత్వం గణనీయంగా నిధులు పెంచాలి.
* అంతరిక్ష రంగంలో పరిశోధనల కోసం అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులు కావాలి. ఐటీ రంగ దాడితో ఇస్రో మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సొంతంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం 150 మందికి అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లను మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తే మానవ వనరుల కొరత తీరుతుంది.
* వాతావరణాన్ని బట్టే వ్యవసాయ ఉత్పాదకత ఆధారపడి ఉంటుంది. అందువల్ల మెరుగైన వాతావరణ హెచ్చరిక వ్యవస్థ దేశానికి కావాలి. ప్రస్తుత ఉపగ్రహ ఆధారిత హెచ్చరిక వ్యవస్థను మరింత ఆధునికీకరించాలి. ఈ దిశగా ఇస్రో మరిన్ని పరిశోధనలు నిర్వహించాలి.
* ఉపగ్రహాల ద్వారా టెలిమెడిసిన్‌, దూరవిద్య వంటి సేవలను మరింత విస్తృతం చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకు నిధులు కేటాయించాలి.

మానవసహిత యాత్రలకు ప్రోత్సాహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన భారత మానవ అంతరిక్ష యాత్రకు ఈసారి బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయింపులు దక్కాయి. ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి, వారిని క్షేమంగా భూమికి తీసుకువచ్చే వాహకనౌకను రూపొందించేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి అవసరమైన పరిశోధన, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
* ఇస్రోకు కేటాయించిన మొత్తం ఈసారి రూ.5వేల కోట్లకు చేరుకుంది. గతేడాది కేటాయించింది రూ.3,172 కోట్లు మాత్రమే.
* అమెరికా గ్లోబల్‌ పొజిషనింగ్‌ వ్యవస్థ తరహాలో పనిచేసే ఇండియన్‌ రీజినల్‌ నేవిగేషనల్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ కోసం రూ.262.10 కోట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలో ఏడు ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో భావిస్తోంది. మొదటి ఉపగ్రహాన్ని 2011లో ప్రయోగించాలని అనుకుంటున్నారు.
* చంద్రయాన్‌-2 ప్రయోగం కోసం రూ.100 కోట్లు.
* భారీ ఉపగ్రహాల ప్రయోగానికి తోడ్పడే అధునాతన రాకెట్లలో ఉపయోగించే సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్ల అభివృద్ధికి రూ.250 కోట్లు.
* సూర్యుడిపై అధ్యయానికి ఉద్దేశించిన ఉపగ్రహ ఆదిత్యకు రూ.40 కోట్లు.
* పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ప్రాజెక్టుకు రూ.250 కోట్లు.

కార్పొరేట్‌ పరిశోధనలకు పెద్దపీట
పరిశోధన, అభివృద్ధి రంగంలో దేశాన్ని.. ముందుకు నడిపించేందుకు పన్ను రాయితీలను ప్రకటించారు. సొంతంగా పరిశోధనలు సాగించే కార్పొరేట్‌ సంస్థలకు 'వెయిటెడ్‌ డిడక్షన్‌'ను 150 శాతం నుంచి 200 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. దీని వల్ల అత్యాధునిక ఇంజినీరింగ్‌, ఫార్మారంగాల్లో కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. జాతీయ ప్రయోగశాలలకు, విశ్వవిద్యాలయానికి, ఐఐటీలకు మంజూరు చేసే విరాళాలపై ఐటీ మినహాయింపులను 175 శాతానికి పెంచారు.
* బహుళ ప్రయోజన పరిశోధనల కోసం రూ.570 కోట్లు
* నానో టెక్నాలజీలో జాతీయ మిషన్‌ కోసం రూ.100 కోట్లు
* శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి కిందున్న ప్రయోగశాలలకు రూ.1335 కోట్ల సాయం
* బయోటెక్నాలజీలో పరిశోధన అభివృద్ధికి రూ.457 కోట్లు
* స్వయం ప్రతిపత్తి పరిశోధన, అభివృద్ధి సంస్థల కోసం రూ.343 కోట్లు
* రుతుపవనాలపై ముందస్తు సమాచారాన్ని అందించే వ్యవస్థను మెరుగు పరిచేందుకు రూ.402 కోట్లు