Friday, February 26, 2010

ధరల్లో దగా!

ధరల్లో దగా!
ఇదో పెద్ద కుంభకోణం
జేపీసీ దర్యాప్తు జరపాలి
పార్లమెంటులో విపక్షాల వాకౌట్‌
చర్యలు చేపడతాం: ప్రణబ్‌
న్యూఢిల్లీ: ధరలను అదుపుచేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. నిత్యావసరాలైన గోధుమలు, బియ్యం, పప్పులు, చక్కెర ధరలు పెరగడం వెనుక పెద్ద కుంభకోణం (స్కాం) దాగి ఉందని ఆరోపించాయి. దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో (జేపీసీ) దర్యాప్తు చేయించాలని డిమాండు చేశాయి. ధరల పెరుగుదలపై రెండురోజులు పార్లమెంటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో గురువారం మొత్తం ఈఅంశంపైనే చర్చ చేపట్టారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయాన్నీ రద్దుచేశారు. యూపీఏ ప్రభుత్వం ధరలను అదుపు చేయడం మాని నెపాన్ని ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తోందని భాజపా, లెఫ్ట్‌, ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి. చివరకు ప్రభుత్వమిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి.

ములాయంసింగ్‌ యాదవ్‌: ధరల పెరుగుదల అంశంలో శరద్‌ పవార్‌ను యూపీఏ ప్రభుత్వం బలి పశువుగా మార్చింది. ఆయన ప్రభుత్వం నుంచి తప్పుకుంటే మంచిది. సమష్టి బాధ్యతగా భావించకుండా ఆయనొక్కడిపైనే భారం మోపడం సరికాదు. యూపీఏ నుంచి పవార్‌, ఎన్‌డీఏ నుంచి శరద్‌ యాదవ్‌ బయటకు వస్తే మేమంతా కలిసి పనిచేస్తాం.

శరద్‌ యాదవ్‌: ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్న ధరల పెరుగుదల వంటి అంశాల్ని పట్టించుకోకుండా మీడియా క్రికెట్‌ను ఆకాశానికెత్తుతోంది.

లాలు ప్రసాద్‌: నెలలోగా ధరలను దించకుంటే ఇతర పార్టీలతో కలిసి జైల్‌ భరో చేపడతాం. ప్రభుత్వ గోదాములపై దాడులు చేస్తాం. ప్రభుత్వ విధాన లోపంవల్లే ధరలు భారీగా పెరిగాయి.

గురుదాస్‌ దాస్‌గుప్తా: ఆశ్చర్యకరంగా సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే విలాసవంతమైన ఆధునిక సెల్‌ఫోన్లు, కార్ల ధరలు, రైళ్లలో ఏసీ ఛార్జీలు తగ్గుతున్నాయి. యూపీఏ హయాంలో 300 శాతందాకా ధరలు పెరిగాయి.

15శాతం పప్పుల దిగుబడి తగ్గింది... ప్రణబ్‌: పప్పు ధాన్యాల దిగుబడిలో 15శాతం లోటు ఉందని ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. ధరల అంశంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. కనీస మద్దతు ధరలను పెంచడంతో ధరలు పెరిగాయన్న వాదనను మరోసారి సమర్థించుకున్నారు. దీనికి తోడు దిగుబడిలో లోటు కూడా దెబ్బతీసిందని వెల్లడించారు. వ్యవసాయంపై తగినన్ని పెట్టుబడులు పెట్టడంలేదని ప్రణబ్‌ అంగీకరించారు. ఈ రంగంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలను నిరోధించేందుకు ప్రభుత్వం వద్ద ఇప్పటిదాకా స్పష్టమైన విధానమేదీ లేదని, పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. టోకు, చిల్లర ధరలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదల విషయంలోనూ సరైన లెక్కలు లేవని, ప్రణాళికా సంఘం అంచనాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నామన్నారు.మరోవైపు ధరలు దిగొస్తున్నాయని వ్యవసాయ మంత్రి పవార్‌ తెలిపారు.

సుష్మా స్వరాజ్‌: గోధుమలు, బియ్యం, పప్పులు, చక్కెర ధరల్లో చోటుచేసుకున్న కుంభకోణంపై జేపీసీ దర్యాప్తు జరిపించాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కుంభకోణానికి ఎలా దారితీశాయో దర్యాప్తులో తేల్చాలి. చక్కెరను మన దేశం నుంచి రూ.12.50కు ఎగుమతి చేశారు. అదే సమయంలో రూ.36కు దిగుమతి చేసుకున్నారు. దీనివల్ల చక్కెర కంపెనీలు రూ.901 కోట్ల లాభాలకు ఎగబాకాయి. గోధుమల దిగుమతి, బియ్యం ఎగుమతి, పప్పుల దిగుమతుల్లోనూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ బలహీనం: నామా
సరైన విధానం ఏది? : మైసూరా
పార్లమెంట్‌ ఉభయసభల్లో గురువారం తెదేపా నాయకులు ధరల పెరుగుదలపై ధ్వజమెత్తారు. లోక్‌సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నియంత్రణకు పటిష్ఠ విధానాలు తీసుకురాకుంటే సామాన్యుడి కష్టాలు కడతేరవన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థపాలకుల నిర్లక్ష్యం వల్ల బలహీనపడి పోయిందన్నారు.

ఆహార భద్రత ఏదీ?: ఆమ్‌ ఆద్మీకి ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదనీ, ఇందుకోసం కేంద్రం చేపడుతున్న చర్యలు అంతంత మాత్రమేనని మైసూరా విమర్శించారు. అవసరం మేరకు నిల్వ ఉంచుకొని సరైన ధరకు విక్రయించాలన్నారు. ధరలేక రైతు, ధరాఘాతంతో సామాన్యుడు అవస్థపడుతున్నట్లు ఆయన చెప్పారు.

రాజ్యసభలో...
అరుణ్‌జైట్లీ: మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉందని ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తోంది. కాంగ్రెస్‌ అధికార పత్రిక 'సందేశ్‌' కూడా సంకీర్ణంలో సమస్యలున్నాయని అభిప్రాయపడింది. సమస్యలను తీర్చలేనని ప్రధాని కార్యాలయమే నిస్సహాయత వ్యక్తం చేస్తే సామాన్యుడి పరిస్థితేమిటి?

బృందా కారత్‌: వైఫల్యాన్ని అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. చక్కెర ధరల్లో కుంభకోణం చోటుచేసుకుంది. జేపీసీ దర్యాప్తుగానీ, శ్వేతపత్రంగానీ ప్రకటించి దీనికి బాధ్యులెవరో తేల్చాలి.

ఇంకా రాజ్యసభలో ధరల అంశపై సమాజ్‌వాదీ సభ్యుడు బ్రిజ్‌భూషణ్‌ తివారీ, బీఎస్పీ సభ్యుడు బ్రజేశ్‌ పాఠక్‌, ఏఐఏడీఎంకే సభ్యుడు మలైస్వామి, జేడీయూ సభ్యుడు శివానంద తివారీ, సీపీఐ సభ్యుడు డి.రాజా తదితరులు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు.

కేశవరావు: ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదనడం నిజం కాదు. రాష్ట్రపతి ప్రసంగంలోనే ఈ అంశానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. ప్రభుత్వ చర్యలతో గత మూడు నెలలుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది.