Thursday, February 25, 2010

మళ్లీ బెం'గాలే'

మళ్లీ బెం'గాలే'
సొంతరాష్ట్రంపై మమత వరాలజల్లు
రెండు ప్రపంచస్థాయి స్టేషన్లు
బోలెడన్ని ఫ్యాక్టరీల ఏర్పాటు శిక్షణ కేంద్రాలు
ప్రశ్నిస్తే రైల్వేమంత్రి ఎదురుదాడి
న్యూఢిల్లీ: రైల్వేమంత్రులు దేశం మొత్తానికి కాకుండా తమ సొంతరాష్ట్రాలకే మంత్రులుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను నిజం చేసేలా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌పై వరాల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బెంగాలీల అభిమానాన్ని చూరగొనేలా మమత జాగ్రత్త పడ్డారు. రైల్వే బడ్జెట్‌లో బెంగాల్‌కు దక్కిన ప్రాజెక్టులు ఇవీ..

దేశవ్యాప్తంగా 10 ప్రపంచస్థాయి స్టేషన్ల ఏర్పాటులో భాగంగా రెండు (ఖరగ్‌పూర్‌, బోల్‌పూర్‌), ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్న 94 స్టేషన్లలో 11, మల్టీఫంక్షనల్‌ కాంప్లెక్సుల నిర్మాణం జరిగే 93 స్టేషన్లలో 17 బెంగాల్‌కు దక్కాయి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 150వ జయంతిని పురస్కరించుకొని హౌరా, బోల్‌పూర్‌లలో మ్యూజియంల ఏర్పాటు, హౌరాలో శంభుమిత్ర కల్చరల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, ఖరగ్‌పూర్‌లో రైల్వే శిక్షణ కేంద్రం, సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ వాగన్‌ ప్రొటోటైపింగ్‌ ఏర్పాటు. ఖరగ్‌పూర్‌ ఐఐటీతో కలిసి రైల్వే పరిశోధన కేంద్రం నిర్మాణం. బహుళ శాఖల శిక్షణ కేంద్రాలు మొత్తం నాలుగు ఏర్పాటైతే వాటిలో రెండు బెంగాల్‌లో, దేశవ్యాప్తంగా నెలకొల్పే మూడు కోచ్‌ఫ్యాక్టరీల్లో ఒకటి బెంగాల్‌లోని కంచరపారాలో, సింగూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే మరో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటన, న్యూజల్‌పాయ్‌గురిలో రైల్‌ ఏక్సిల్‌ ఫ్యాక్టరీ, డంకునీలో హెవీయాక్సిల్‌ లోడ్‌వ్యాగన్స్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌, బెంగాల్‌లోని 22 స్టేషన్లలో ఔట్‌పేషంట్‌ ఆరోగ్యవిభాగాలు, 17 స్టేషన్లలో ద్వితీయస్థాయి ఆసుపత్రులు, 11 స్టేషన్లలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు, చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ విస్తరణ, శంక్రాయిల్‌లో డీజిల్‌ మల్టీపుల్‌ యూనిట్‌ ఫ్యాక్టరీ, హల్దియా, బర్ధమాన్‌లలో వ్యాగన్‌ తయారీ ఫ్యాక్టరీలు, కొత్తగా ప్రారంభించనున్న సంస్కృతి ఎక్స్‌ప్రెస్‌, భారత్‌ తీర్థ్‌లతోపాటు నాన్‌స్టాప్‌ సూపర్‌ఫాస్ట్‌ దురంతో రైళ్లు బెంగాల్‌ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ప్రణాళిక, ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న రెండు డబుల్‌డెక్కర్‌ రైళ్లలో ఒకటి కోల్‌కతాకు, ఫరక్కాలో బాట్లింగ్‌ప్లాంట్‌, కోల్‌కతాలో క్రీడా అకాడమీ. వీటితోపాటు కొత్త రైల్వేలైన్లు, ట్రాక్‌ ఉన్నతీకరణలో బెంగాల్‌కు అగ్రతాంబూలం. రైల్వేశాఖ సహాయమంత్రి కె.హెచ్‌.మునియప్ప తన వంతు వాటాగా సొంతరాష్ట్రం కర్ణాటకకు కొన్ని వరాలు దక్కించుకున్నారు. రైల్వే బడ్జెట్‌లో 13 సర్వే ప్రాజెక్టులు, వీల్‌డెవలప్‌ టెస్టింగ్‌ సెంటర్‌ కర్ణాటకకు లభించాయి.

విమర్శలపై మండిపాటు
రైల్వేబడ్జెట్‌ను పూర్తిగా బెంగాల్‌ కేంద్రంగా రూపొందించారన్న విమర్శలను మీడియా మమత ముందు ప్రస్తావించినప్పుడు.. 'బెంగాల్‌ను అవమానపరచొద్దు. మీ ప్రశ్న రాజకీయ దురుద్దేశాలతో కూడి ఉంది' అంటూ ఆమె ఎదురుదాడికి దిగారు. బెంగాల్‌ను అభివృద్ధికి దూరం చేయమంటారా అని ప్రశ్నించారు. అందరు మంత్రుల్లాగే నేనూ నా స్వరాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకున్నాని చెప్పారు. అయినప్పటికీ, మెజారిటీ ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకే ఇచ్చానని చెప్పారు.