Thursday, February 25, 2010

కొత్త రైళ్లు 21

కొత్త రైళ్లు 21
అనుబంధ బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌కు పచ్చజెండా?
ద.మ. రైల్వే జీఎం జయంత్‌ వెల్లడి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రైల్వే బడ్జెట్‌లో ద.మ.రైల్వే ప్రాజెక్టులకు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఐదురెట్లు అధికంగా రూ.700 కోట్లు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఎం.ఎస్‌.జయంత్‌ పేర్కొన్నారు. 2007 నుంచి 2010 వరకు ద.మ.రైల్వేకు 9 కొత్త రైళ్లు కేటాయించగా ఈసారి 21 రైళ్లు ఇచ్చారన్నారు. ఈ ఏడాది ద.మ. రైల్వే పరిధిలో 200 నుంచి 250 కి.మీ. మేర రైల్వేలైన్‌ నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు. బడ్జెట్‌ కేటాయింపులపై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు రైళ్లు పొడిగించారని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న శ్రీకాళహస్తి-నడికూడి, గుడివాడ-నర్సాపూర్‌, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పీపీపీ పద్ధతిలో సికింద్రాబాద్‌లో వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు క్రీడా అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గోదావరి బ్రిడ్జిపై రూ.75 కోట్లతో మూడో రైల్వేలైను నిర్మించేందుకు అనుమతి లభించిందని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాల కోసం ఈ ఏడాది రూ.220 కోట్ల ఖర్చు చేయనున్నట్లు వివరించారు. 58 రైల్వే స్టేషన్లలో బయటి రోగుల విభాగాలు(ఓపీ), డయాగ్నస్టిక్‌ కేంద్రాలు నెలకొల్పుతామన్నారు. 21 స్టేషన్లలో ద్వితీయ స్థాయి జనరల్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. కేన్సర్‌ సోకిన వారికి 100 శాతం టికెట్‌ మాఫీ వర్తిస్తుందని, రైల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. తిరుపతి-నెల్లూరు-చెన్నై, విజయవాడ-గుంటూరు-తెనాలి, కాచిగూడ-మహబూబ్‌నగర్‌, మిర్యాలగూడకు ఫుష్‌పుల్‌ రైళ్లు నడపనున్నట్లు తెలిపారు.

రైల్వే అనుబంధ(సప్లిమెంటరీ) బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశకు ఆమోదం లభించే అవకాశముందని జయంత్‌ పేర్కొన్నారు. ఇందుకుజులై-ఆగస్టులో అనుమతి లభించవచ్చన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి టెండరు ద్వారా పనులు ప్రారంభిస్తామన్నారు.కొత్త రైళ్లను మార్చి 31లోగా ప్రారంభించేందుకు ద.మ.రైల్వే సిద్ధంగా ఉందని జయంత్‌ వివరించారు. మూడు నెలలుగా జరుగుతున్న ఆందోళనలతో ద.మ.రైల్వేకు రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. విశాఖపట్నంను ద.మ.రైల్వే పరిధిలోకితీసుకువచ్చే ప్రతిపాదనకు ఆమోదం లభించలేదని చెప్పారు. ద.మ. రైల్వేపరిధిలో సుమారు 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.భద్రాచలం-సత్తుపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయితే సింగరేణి నుంచి 4 మిలియన్‌ టన్నుల బొగ్గును ఏపీజెన్‌కో ప్రాజెక్టులకు సరఫరా చేయవచ్చని చెప్పారు.