Saturday, February 27, 2010

బడుగుకు గొడుగేదీ?

బడుగుకు గొడుగేదీ?
దేశంలో షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తరగతులు (ఎస్టీ) సమాజంలో అందరికన్నా ఎంతో వెనకబడి ఉన్నాయి. మానవాభివృద్ధి సూచికలు, నివేదికలన్నీ కూడా ఇదే విషయాన్ని ఘోషిస్తున్నాయి. స్వతంత్య్రానంతరం ప్రభుత్వాలన్నీ కూడా వీరి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు, ప్రణాళికలు చేపడుతూనే ఉన్నాయిగానీ అవేవీ లక్ష్యాలు చేరుకున్న దాఖలాల్లేవు. ఉన్న పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసినా చాలు, తమ జీవితాల్లో అనూహ్య మార్పులొస్తాయంటన్నారు ఎస్సీ, ఎస్టీలు.
సామాన్యుడి విన్నపమేంటి?
* వెనకబడిన తరగతుల అభ్యున్నతి కోసం- జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో కేటాయింపులుండాలని నిర్ణయించారు. వీటినే షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ ప్లాన్‌-ఎస్సీఎస్పీ(16%), ట్రైబల్‌ ఏరియా సబ్‌ప్లాన్‌-టీఎస్‌పీ(8%) అంటారు. అయితే ఏనాడూ బడ్జెట్‌ కేటాయింపులు దీనికి దగ్గరగా కూడా లేవు. కేంద్ర బడ్జెట్‌లోని ప్రణాళిక కేటాయింపులన్నింట్లో ఎస్సీలకు 16.2%, ఎస్టీలకు 8.2% కచ్చితంగా ఉండాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. కేటాయించిన నిధులు కచ్చితంగా వ్యయమయ్యేలా చూడాలన్నది ప్రధానమైన ఆకాంక్ష.

* రైతు కూలీలుగా, సాగుభూమి లేని పేదలుగా జీవిస్తున్న తమకు భూసంస్కరణల ద్వారా వనరుల పంపిణీలో సామాజిక న్యాయం జరగాలని కోరుతున్నారు. ముఖ్యంగా దళితులకు చెందిన భూములను సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు బోర్లు, కరెంటు వంటివన్నీ సమకూర్చేందుకు జాతీయ స్థాయిలో ఒక 'సమీకృత భూమి అభివృద్ధి పథకం' ఉండాలి.

* చేతులతో మలాన్ని ఎత్తి పనిచేస్తున్న సఫాయీ వృత్తిని నిషేధిస్తూ వారికి వృత్తి శిక్షణ, రుణాల కల్పన ద్వారా పునరావాసం చూపటం, పొడి మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్ధృతంగా చేపట్టటం, సఫాయీ వృత్తిలో ఉన్నవారి పిల్లల చదువులకు ఉపకారవేతనాలు పెంచటం వంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చెయ్యాలని కోరుతున్నారు. సఫాయీ, దేవదాశీల వంటివారి పునరావాసం కోసం రూ.2 లక్షలతో పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి.

* విద్యా, ఉపాధి అవకాశాల్లో జనరల్‌ కేటగిరీతో సమానంగా పోటీ పడేందుకు ఎస్సీ, ఎస్టీలకు శిక్షణావకాశాలు పెంచాలి.

* దళితులకు రుణాల మంజూరు విషయంలో- హామీలు, పూచీల్లాంటి చిక్కుల్లేకుండా సాఫీగా జరిగేలా చూడాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఉపాధి కల్పనలో ఎస్సీ, ఎస్టీలకు తోడ్పడేందుకు నాబార్డు తరహాలో ఒక బ్యాంకును నెలకొల్పాలన్న డిమాండూ ఉంది.

* ఎస్టీలు తీవ్రమైన పేదరికంలో కూరుకుని ఉన్న నేపథ్యంలో పేదరిక నిర్మూలన కోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించాలి.

బడ్జెట్‌ ఏమిచ్చింది?
షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమానికి కృషి చేసే సామాజిక న్యాయం, సాధికారికత శాఖకు రూ.4,500 కోట్లు కేటాయించారు. 2009-10లో ఇచ్చిన రూ.2,585 కోట్లు కన్నా 80శాతం ఎక్కువ.

* వినికిడి సమస్యతో బాధపడేవారికి లబ్ధి చేకూర్చేందుకు భారత సంకేత భాషా పరిశోధన, శిక్షణా కేంద్రాలు నెలకొల్పేందుకు ఈ కేటాయింపులు తోడ్పడతాయి.

రాష్ట్రానికేం ఒరిగింది?
సామాజిక న్యాయశాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. రాష్ట్రానికీ ఆ మేరకు మేలు జరగనుంది. ఎస్సీ ఉపకార వేతనాల్లో వాటా రూ.250 కోట్ల నుంచి పెరగనుంది. ఎస్టీల ఉపకార వేతనాల్లో వాటా రూ.40 కోట్లలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. ఎస్సీలకు కేంద్ర ప్రత్యేక సహాయం కింద కేటాయించిన రూ.600 కోట్లలో ఎప్పట్లాగే రాష్ట్ర వాటా రూ.45 కోట్లు రానుంది. ఆదిమ జాతుల అభివృద్ధికి శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏలకు మరిన్ని నిధులు రానున్నాయి.