
ఉద్దీపనల పథకాలను మొత్తం మీద ఎత్తివేయరన్న అంచనాలతో మార్కెట్ 79 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా పెద్ద మార్పుల్లేకుండా అక్కడక్కడే తచ్చట్లాడింది. ప్రణబ్ ప్రసంగం వరకూ వేచిచూసింది.బడ్జెట్ వేళ 420 పాయింట్లు పైకి మబ్బు తెరలు వీడాయి. ఉద్దీపన దీపాలు ఆరిపోతే మార్కెట్లో చీకటి కమ్ముకుంటుందన్న భయాలు విడిపోయాయి. 'పాక్షిక గ్రహణమే' ఉండడంతో మార్కెట్లో వెలుగులు తొంగి చూశాయి. ప్రణబ్ ప్రసంగ పాఠం మార్కెట్‌ను లాభాల వల్లె వేయించేలా చేసింది. ఓ మోస్తరు లాభాలతో ప్రారంభమైన మార్కెట్ ఓ దశలో 400 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. తర్వాత లాభాల స్వీకరణతో కాస్త తగ్గినా చివరకు బలమైన సెంటిమెంటునే కనబరచింది. మదపర్లకు నవ్వుల్నే పంచింది. భవిష్యత్‌లోనూ లాభాలు కొనసాగగలవన్న భరోసాను ఇచ్చింది
చివర్లో లాభాల స్వీకరణ
175 పాయింట్ల లాభంతో ముగింపు


* మ్యాట్‌లో పెంపు ఐటీ రంగం తేలిగ్గా తీసుకుంది. విప్రో తప్ప అన్ని ఐటీ కంపెనీలూ అనుకూలంగానే ముగిశాయి.
* వాహన, లోహ, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి సూచీలు అధికంగా లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ సూచీలు మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి.
* మార్కెట్ పరిమాణం ఒక్క ఉదుటన రూ.3,111.32 కోట్ల(గురువారం) నుంచి రూ.5,384.54 కోట్లకు పెరిగింది.
* 1848 స్క్రిప్‌లు లాభాలను పొందగా.. 942 స్క్రిప్‌లు నష్టాలను అనుభవించాయి.
* బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టవచ్చన్న అంచనాలతో రిలయన్స్ క్యాపిటల్ రూ.304.85 కోట్లతో అత్యధిక లావాదేవీలను నమోదు చేసుకుంది.
* టాటా మోటార్స్ అత్యధికంగా 6.33% పెరిగింది. హిందాల్కో, ఎం&ఎం, హీరోహోండా, రిలయన్స్ ఇన్‌ఫ్రా, మారుతీ సుజుకీ, స్టెరిలైట్, ఎస్‌బీఐ, డీఎల్‌ఎఫ్, ఐసీఐసీఐ బ్యాంకు, జైప్రకాశ్ అసోసియేట్స్‌లు 2.20-5.39% మేర లాభాలను ఆర్జించాయి.
* ఐటీసీ, టాటా పవర్ మాత్రం స్వల్పంగా నష్టపోయాయి.

