Saturday, February 27, 2010

కదలికలేని వ్యవ'సాయం'

కదలికలేని వ్యవ'సాయం'
ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చేవరకు భారత విధాన నిర్ణేతలు వ్యవసాయ రంగం ప్రాధాన్యాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తులు పడిపోయి, దిగుమతులు భారమయ్యే సరికి గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై శ్రద్ధ పెంచింది. ఉత్పాదకత పెంచాల్సిన అవసరాన్ని రాష్ట్రాలకు గుర్తు చేస్తోంది.
న ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం వాటా నాలుగోవంతు కన్నా తక్కువే అయినప్పటికీ 60 శాతం మంది దీనిమీదే ఆధార పడుతున్నారు. ఆ అరవై శాతం మంది పచ్చగా ఉంటేనే మిగతా 40 శాతం మంది ఆధారపడిన పరిశ్రమలు, సేవారంగాలు కళకళలాడతాయి. అయినా, వ్యవసాయరంగానికి ప్రభుత్వం అందించే మద్దతు మొక్కుబడి వ్యవహారంగానే ఉంది. ఈ రంగం నుంచి ప్రభుత్వానికి భారీ ఎత్తున పన్నులు రాకపోవడమే కారణం.
రైతాంగం ఏం కోరుతోంది?
* బ్యాంకుల నుంచి వ్యవసాయానికి రుణ వితరణ ఏటేటా పెరుగుతోంది. అదే సమయంలో చిన్న సన్నకారు రైతుల వాటా తగ్గుతోంది. బ్యాంకులు పెద్ద రైతుల చుట్టాలయ్యాయి. ఈ పరిస్థితి మారాలి.
* గ్రామాల్లో కౌలు రైతుల సంఖ్య పెరుగుతోంది. వారికి భూమి యాజమాన్యంతో సంబంధం లేకుండా రుణ పరపతి కల్పించాలి. పంట నష్టపోయినపుడు యజమానికి బదులు అతనికే పరిహారం చెల్లించాలి.
* సాగునీటి రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి. వాటర్‌షెడ్లు, భూగర్భ, ఉపరితల నీటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రకటించాలి. బిందు, తుంపర సేద్యాలకు మరిన్ని సబ్సిడీలివ్వాలి.
* విద్యుత్తు, ఎరువులు, సాగునీటిపై రాయితీల ఫలాలను నేరుగా రైతులకు అందించాలి.
* అభివృద్ధి చెందిన దేశాల్లాగే వ్యవసాయ పరిశోధనకు జీడీపీలో ఒకశాతం కేటాయించాలి.
* ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకునే సమగ్ర విధానం రూపొందించాలి.
* ప్రాజెక్టుల కింద సాగవుతున్న భూములకు తక్కువ నీటి తీరువా వసూలు చేస్తున్నారు. సొంతంగా మౌలిక సదుపాయాలు కల్పించుకొని, భూగర్భ జలాలతో మోటార్ల సాయంతో పంటలు పండిస్తున్న రైతులకు భారీ ఖర్చు అవుతోంది. ఈ అంతరాన్ని తొలగించాలి.
* పంట పండించడానికి అయ్యే ఖర్చులో సగం మొత్తాన్ని ప్రభుత్వం రైతుకు చెల్లిస్తే అవసరాల కోసం కల్లంలో పంటను తక్కువ ధరకు అమ్ముకొనే పరిస్థితి రైతుకు రాదని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ సూచించారు. దాన్ని అమలు చేయాలి.
బడ్జెట్‌ ఏమిచ్చింది?
కొత్త బడ్జెట్‌లో నాలుగు అంశాలను లక్ష్యాలుగా చేసుకుని ప్రణబ్‌ ముఖర్జీ వ్యవసాయ కేటాయింపులు జరిపారు. అవి... 1. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, 2. వ్యవసాయ ఉత్తత్తుల వృథాను అరికట్టడం, 3. రైతులకు మరింత రుణ పరపతి, 4. ఆహార శుద్ధి పరిశ్రమకు ప్రోత్సాహం.

* వ్యవసాయ రుణాల లక్ష్యం 3.75 లక్షల కోట్లకు పెంపు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు 5 శాతం వడ్డీ వర్తింపు. రైతులకు స్వల్ప కాల రుణ పరిమితి రూ.3లక్షలకు పెంపు. రుణ మాఫీ తర్వాత తీసుకున్న రుణాల చెల్లింపు గడువు ఈ ఏడాది జూన్‌ వరకూ పొడిగింపు. ఎరువుల సబ్సిడీల వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ. ఎరువుల్లో పోషకాల విలువ ఆధారిత సబ్సిడీ.

* రెండో హరిత విప్లవంలో భాగంగా దేశంలోని తూర్పు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తుల పెంపునకు రూ.400 కోట్ల కేటాయింపు. ఆహార శుద్ధి పరిశ్రమల కోసం కొత్తగా ఐదు ఫుడ్‌ పార్కులు.

* వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఏర్పాటుచేసే శీతల గిడ్డంగులకు వ్యాపార రుణాలు. వీటి కోసం దిగుమతి చేసుకునే పరికరాలకు 5శాతం కస్టమ్స్‌ సుంకాల తగ్గింపు. సేవా పన్ను నుంచి పూర్తి మినహాయింపు. మండీలకు, గోదాములకూ ఈ పన్ను మినహాయింపు.

* పండ్ల రసాలు, జామ్‌, సాస్‌, పచ్చళ్లు, పాల ఉత్పత్తులు, కోళ్ల పరిశ్రమ, మాంసం, చేపలు వంటి వాటి నిల్వకు ప్రోత్సాహం.

* పప్పులు, తృణ ధాన్యాల రవాణాపై సేవా పన్ను మినహాయింపు. సరకులు రవాణా చేసే శీతల వాహనాలను నిర్మించే యూనిట్లకు కస్టమ్స్‌ సుంకం పూర్తిగా ఎత్తివేత.

* విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ యంత్ర సామగ్రిపై 5శాతం కస్టమ్స్‌ పన్ను మినహాయింపు. సాగునీరు అందుబాటులో లేని 60వేల గ్రామాలు 'పప్పు ధాన్యాలు, నూనె పంటల సాగు గ్రామాలు'గా అభివృద్ధి. ఇందుకోసం రూ.300 కోట్ల కేటాయింపు.

* ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా పంటల సాగును ప్రోత్సహించేందుకు చేపట్టే ప్రాజెక్టు ప్రారంభానికి రూ.200 కోట్లు కేటాయింపు. ఆహార నిల్వల కోసం ప్రైవేటు గోదాముల నిర్మాణానికి ప్రోత్సాహం. ప్రైవేటు రంగంలో ఏర్పాటుచేసే గోదాములను కనీసం ఏడు సంవత్సరాల పాటు అద్దెకు తీసుకుంటామనే భరోసా.

రాష్ట్రానికేం ఒరిగింది?
*ఈశాన్య రాష్ట్రాల్లో హరిత విప్లవానికి రూ.400 కోట్లు ఇచ్చిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో కరవు, వరదల గురించి పట్టించుకోలేదు. ఏడువేల కోట్ల ఉత్పత్తి నష్టం జరగ్గా కోలుకోడానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయరంగం తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వ్యవసాయం మొత్తం -0.2% తిరోగమనంలో ఉంది. ఈ గడ్డు పరిస్థితి గురించి బడ్జెట్లో రేఖామాత్రంగా ప్రస్తావించారు. గోదాములు, శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకుల నుంచి ఒక్కో గ్రామానికి రూ.50వేలు రుణం (పది మంది రైతులకు సరిపోదు) ఇప్పిస్తామని ఆర్థికమంత్రి ఒకే ఒక్క ప్రకటన చేశారు. కనీసం బ్యాంకు రుణాల పరిమితిని 40% పెంచితే ఉత్పత్తిలో 22% లోటును భర్తీ చేయవచ్చు.

- డాక్టర్‌ ఆర్‌వీ రమణమూర్తి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌,
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం