Thursday, February 25, 2010

సరకు రవాణాకూ తత్కాల్‌!

సరకు రవాణాకూ తత్కాల్‌!
గూడ్స్‌ రైళ్ల పైనా బాదుడు
మమత బడ్జెట్లో కొత్త వాత
విశాఖపట్నం, న్యూస్‌టుడే: రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్లో తత్కాల్‌కోటా గురించి ఎలాంటి ప్రస్తావనా ప్రత్యేకంగా చేయకపోయినా సరకు రవాణాకూ ఈ విధానం వర్తిస్తుందని చెప్పడం చూస్తుంటే ఇక గూడ్సు బళ్లకూ బాదుడు తప్పదని స్పష్టమవుతోంది. ఎవరూ ఇది గుర్తించే వీలు లేకుండా గబగబా చదువుతూ ఆమె చెప్పింది ఒక వాక్యమే. తరచి చూస్తే రైల్వేలు అనుసరిస్తున్న దొడ్డిదారి క్రమంగా ఎలా విశ్వరూపం దాలుస్తుందో అవగతం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సరకు రవాణా బోగీలను కేటాయించడంలో తత్కాల్‌ విధానమనేది లేదు. అవసరానికి తగినన్ని బోగీల్లేక రవాణాదారులు, ఎగుమతిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల రవాణాకు తగినన్ని గూడ్సు బళ్లను (ర్యాక్‌లను) కేటాయించాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సైతం రైల్వే మంత్రికి విన్నపాలు చేసుకోవాల్సి వస్తోంది. వ్యాగన్ల తయారీ కర్మాగారాలను కొత్తగా నెలకొల్పుతున్నా వాటి నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి వచ్చేవరకు కొరత తప్పదు. ఈ పరిస్థితుల్లో ఈ కొరతనే సొమ్ముగా చేసుకునేందుకు రైల్వేశాఖ తెలివైన ఎత్తుగడను తత్కాల్‌ రూపంలో అనుసరిస్తోంది. తత్కాల్‌ కింద ఎంత అదనపు మొత్తాలను చెల్లించాల్సి ఉంటుందో రైల్వే ప్రకటించాల్సి ఉంది.