Thursday, February 25, 2010

మార్కెట్‌ సమీక్ష: ఒత్తిడి కొనసాగింది

మార్కెట్‌ సమీక్ష
ఒత్తిడి కొనసాగింది
సాధారణ బడ్జెట్‌ దగ్గరపడుతుండడం.. రైల్వే బడ్జెట్‌లో సరకు రవాణా ఛార్జీలు మారకపోవడంతో మదుపర్లలో గుబులు కొనసాగింది. బుధవారం ట్రేడింగ్‌ తక్కువ స్థాయుల్లో జరిగింది. మార్కెట్‌ సైతం స్వల్ప స్థాయుల్లోనే ఊగిసలాడింది. 16,187.44-16,328.44 మధ్య చలించింది. చివరకు 30.35 పాయింట్ల నష్టంతో 16,255.97 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ సైతం 11.45 పాయింట్లు కోల్పోయి 4,858.60 వద్ద స్థిరపడింది. ప్రారంభంలో రైల్వే షేర్లలో మదుపర్లు లాభాలను స్వీకరించారు. ప్యాసింజరు, సరకు రవాణా ఛార్జీలను రైల్వే మంత్రి మమతా బెనర్జీ పెంచకపోవడం సాధారణ బడ్జెట్లో ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ ఉంటుందన్న సంకేతాలను పంపినట్లయిందని బ్రోకర్లు అంచనా వేస్తున్నారు.

6% వరకూ పతనమైన రైల్వే షేర్లు
గురువారం డెరివేటివ్‌ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో ట్రేడింగ్‌ పరిమాణం తక్కువగా నమోదైంది. త్వరగా అమ్ముడయ్యే వినియోగదారు వస్తువులు అధికంగా కుంగగా.. ఆరోగ్య సంరక్షణ, వాహన, టెక్నాలజీ, బ్యాంకింగ్‌ సూచీలూ అదే బాట పట్టాయి. అయితే స్థిరాస్తి, ఐటీ, సహజవాయువు, యంత్ర పరికరాల సూచీలు మార్కెట్‌ అధిక నష్టాల పాలు కాకుండా కాపాడాయి. 986 స్క్రిప్‌లు లాభపడగా.. 1917 స్క్రిప్‌లు నష్టపోయాయి. మార్కెట్‌ పరిమాణం రూ.4566.06 కోట్లుగా నమోదైంది. రైల్వే షేర్త్లెన కెర్నెక్స్‌ మైక్రోసిస్టమ్స్‌, కాలిండీ రైల్‌, టిటాఘర్‌ వ్యాగన్స్‌, స్టోన్‌ ఇండియా, హింద్‌ రెక్టిఫైయర్స్‌, టెక్స్‌మ్యాకోలు 4.70- 6% మేర నష్టపోయాయి. ఇక సన్‌ ఫార్మా, ఎం&ఎం, ఆర్‌కామ్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ 1.38-2.51% కుంగాయి. మారుతీ సుజుకీ, ఎన్‌టీపీసీ, ఎల్‌&టీ, టాటా పవర్‌, టీసీఎస్‌లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.