ఇంటి బడ్జెట్.. ఇలాగైతే బాగు! పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఈ రోజే. మరి మీ ఇంటి ఆర్థిక మంత్రిగా మీరూ బడ్జెట్ సిద్ధం చేసుకున్నారా? ఆదాయ వ్యయాల అంచనాలు, ప్రణాళికలు దేశానికే కాదు, సాధారణ కుటుంబానికీ అవసరమే! లేకుంటే వృథా వ్యయం పెరిగి అప్పుల ముప్పులో చిక్కుకోవడం ఖాయం. అదే... ప్రణాళికాబద్ధంగా సాగితే సంసార నౌక సాఫీగా సాగిపోతుంది. మన ఇంటి బడ్జెట్ పక్కాగా వేసుకోవాలంటే ఏయే సూత్రాలు పాటించాలో చూద్దాం!

మార్గం చూపాలి
''ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేస్తున్నాను. భవిష్యనిధిలో జమ చేస్తున్నాను. బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలు, కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నాను''- ఇదంతా ఆర్థిక ప్రణాళిక కాదా? అని ప్రశ్నించవచ్చు! అయితే, పెట్టుబడి పెట్టడం ఒక్కటే ఆర్థిక ప్రణాళిక అనిపించుకోదు. ఇలాంటి పెట్టుబడులకు ఏటా కొంత కష్టార్జితాన్ని కేటాయించడమే బడ్జెట్ అనీ అనలేము. ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరికి వస్తుందనగా హడావిడిగా మదుపు చేయడం చాలామందికి అలవాటే. ఇలాంటివారు కూడా పక్కా ఆర్థిక ప్రణాళిక పాటిస్తారనుకోవచ్చా? కాదు కదా! ఆదరాబాదరాగా పెట్టిన పెట్టుబడుల నుంచి ఆశించిన లక్ష్యాలను చేరుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. అలా కాకుండా లక్ష్యశుద్ధితో పొదుపు, మదుపులకు మార్గం చూపేదిగా ఉండాలి మనం వేసుకునే బడ్జెట్.
కావాలి కచ్చితం
సొమ్ముకు సంబంధించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయమూ ఇతర ఆర్థిక విషయాల్లో మీ కుటుంబ సభ్యులందరి జీవితాన్నీ ప్రభావితం చేస్తుంది. పార్లమెంటులో బడ్జెట్ ఆమోదం పొందాలంటే దానిమీద విస్తృత చర్చ జరుగుతుంది. మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాతే అది అమల్లోకి వస్తుంది. మీ ఇంటిలో కూడా దీన్ని పాటించండి. వేసిన బడ్జెట్‌ను అందరికీ వివరించండి. మార్పులు చేర్పులు అవసరమైతే చేయండి. దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ ఒక దిశానిర్దేశం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా లేని వాటిని సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా ఎలాంటి ఒత్తిళ్లూ ఒడిదుడుకులూ లేని జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
* ప్రణాళిక ఏదైనా రూపకల్పన చేయడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఎంత మేరకు ఖర్చు చేయవచ్చో కచ్చితంగా తెలుస్తుంది. మన మనసును కూడా దానికి సిద్ధం చేసుకోవచ్చు. కొత్తలో ఆ మేరకే ఖర్చు చేయాలంటే కొంత ఇబ్బందే. అయితే, ఏదైనా సాధనతోటే వస్తుందన్నది పెద్దల మాట.
మిగిలింది కాదు.. పొదుపు!
మీ లక్ష్యాలేమిటో నిర్ణయించుకున్నారు కదా! మీరు రూపొందించుకున్న ప్రణాళిక, బడ్జెట్‌లోని ప్రతి అంశం వల్ల భవిష్యత్తులో ఉండబోయే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలి. ఆ ప్రభావాన్ని తట్టుకోవడానికి సన్నద్ధంగా ఉండాలి. సొమ్ము విషయాలకు సంబంధించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయమూ మీ అవసరాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. మీ ఆశయాలను అందుకోవడానికి ఎంత సొమ్ము అవసరమో తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా పొదుపు చేయడం మొదలు పెట్టాలి. ఖర్చులన్నీ పోగా నెలాఖరుకు మిగిలింది పొదుపు అని భావిస్తుంటారు చాలామంది. అయితే, ఇది సరైంది కాదు. నెల మొదటి రోజున మీరు కచ్చితంగా క్రమం తప్పకుండా చేసేదే నిజమైన పొదుపు. ఇక నెలాఖరుకు మిగిలిందంటారా? అది మీ ఆర్థిక క్రమశిక్షణకు గుర్తు.
సమయం ఉండాలి
లక్ష్యాలలో ఎన్నో రకాలుంటాయి. కొన్ని ఈ ఏడాదే సాధించేవి ఉంటాయి. మరికొన్నింటికి కొన్నేళ్ల కాలం పట్టవచ్చు. బడ్జెట్ ఈ ఏడాదికే అయినా.. దీర్ఘకాల ప్రయోజనాన్ని కూడా పరిశీలిస్తారన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే భవిష్యత్తు లక్ష్యాలేమిటో ముందే కుటుంబ సభ్యులందరితోనూ కలిసి స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఏర్పరుచుకున్న ప్రతి లక్ష్య సాధనకూ నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలి. దానికి ఎంత సొమ్ము అవసరమో కూడా నిర్ణయించుకోవాలి. ఇక్కడ ప్రధానమైన విషయం ఒకటుంది. సమయం నిర్ణయించుకోవాలి కదా అని చెప్పి కష్టసాధ్యమైన వాటిని తక్కువ సమయంలోనే పూర్తిచేయాలని నిర్ణయించుకోకండి. దానికి ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోండి.
సమీక్షించుకోవాలి
బడ్జెట్ వేసుకుంటున్నాం కదా అని లక్ష్మణరేఖలాగా దాన్ని దాటకూడదనే కఠిన నియమాన్ని పెట్టుకోవాల్సిన పనిలేదు. ఆర్థిక ప్రణాళిక అన్నది నిరంతర ప్రక్రియ. మీ జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతుల వల్ల లక్ష్యాలు మారవచ్చు. పెళ్లి, పిల్లల పుట్టుక, ఇంటి కొనుగోలు, ఉద్యోగంలో మార్పులు, వారసత్వం వల్ల కలిసి వచ్చిన ఆస్తి ఇలాంటివే. జీవితం మలుపు తిరిగిన ప్రతిసారీ ఆర్థిక ప్రణాళికలను సమీక్షించాలి. తదనుగుణంగా బడ్జెట్‌ను మార్చుకోవాలి.
అత్యాశ వద్దు
ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్‌ల విషయంలో వివేచన, విచక్షణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రణాళిక, బడ్జెట్ ఉన్నంత మాత్రాన అప్పటికప్పుడు మీ జీవితం మారిపోదు. ఇది జీవితకాలం కొనసాగే ప్రక్రియ. దేశ ఆర్థిక స్థితిగతులు, స్టాక్ మార్కెట్ ఎగుడుదిగుళ్లు, వడ్డీ రేట్లలాంటివి ఎన్నో పరిణామాలు మీ ఆర్థిక ప్రణాళిక ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తగిన లక్ష్యాలను ఎంచుకోవాలి.
జాగ్రత్త సుమా!
ఆర్థిక ప్రణాళికల ప్రాధాన్యాన్ని గుర్తించినవారు సైతం తప్పటడుగు వేసే విషయాలు కొన్ని ఉంటాయి.
* లక్ష్యాలు నిర్దేశించుకుంటారు కానీ, వాటికి సాధనకు అవసరమైన సొమ్ము గురించి అంచనా వేయడాన్ని మర్చిపోతారు.
* అనుకోని ఖర్చులు ఉంటాయన్న సంగతి గుర్తించరు. అంచనాకందని ఖర్చులు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
* ఇతర ఆర్థిక అంశాలపై ఉండే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే సొమ్ముకు సంబంధించి తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటారు.
* పెట్టుబడులే ఆర్థిక ప్రణాళిక అనుకొని, అవసరమైన వాటిని విస్మరిస్తుంటారు.
* పెరుగుతున్న అవసరాలను, మారుతున్న పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోరు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేయాలన్న విషయాన్ని పట్టించుకోరు.
* తక్కువ వడ్డీ వచ్చేవాటిల్లో సొమ్మంతా పెట్టి, క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలకోసం ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంటారు.
* పన్నులను తగ్గించుకోవడమే ఆర్థిక ప్రణాళిక కాదు.
ఇలాంటి పొరపాట్ల జోలికి పోకుండా ఆచితూచి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే ఒడిదుడుకుల్లేని జీవితం మన సొంతమవుతుంది.
మరవొద్దు
* అప్పులను సాధ్యమైనంత తగ్గించుకోవడం. గృహరుణాలవంటివి ఉంటే లోన్ కవర్ టెర్మ్ పాలసీలు తీసుకోవడం.
* పన్ను మినహాయింపు పథకాల్లో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పొదుపు/మదుపు చేయడం.
* కనీసం రెండు లక్షల రూపాయల ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా తీసుకోవడం.