Saturday, February 27, 2010

పొట్ట నింపని ప్రజాపంపిణీ

పొట్ట నింపని ప్రజాపంపిణీ
దేశంలో నిత్యావసరాల్ని చౌకధరలకే సామాన్యుడికి అందించాలన్న ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) అనేక లోపాల కారణంగా నేటికీ అనుకున్న ఫలితాల్ని సాధించలేకపోతోంది. పీడీఎస్‌ ద్వారా కేవలం 11 శాతం మందికే నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయని ప్రణాళిక సంఘమే భావిస్తోందంటే... ఇక పరిస్థితి ఎలా ఉందో వూహించవచ్చు.
సామాన్యుడి గోడు
* చౌక డిపోల్లో ప్రస్తుతం నాసిరకం బియ్యం ఇస్తున్నారు. వీటి బదులు ఎంతో కొంత నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చెయ్యాలి.
* డీలర్ల చిలక్కొట్టుళ్లు, అధికారుల అవినీతి వల్ల ప్రజాపంపిణీ స్వాహారాయుళ్లకు బంగారు బాతులా తయారైంది. వీటిని అడ్డుకుని, పథకాలు అర్హులకు చేరేలా చూడాలి.
* చౌకడిపోల్లో ఇచ్చే రేషన్‌ పరిమితంగానే ఇస్తున్నారు. దీనివల్ల మిగిలిన నిత్యావసరాలను బయట మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తోంది. ఇది కుటుంబానికి అదనపు భారం. బియ్యం, పంచదారలకు మిగిలిన వాటిని కూడా జోడిస్తే... పేదలకు కొంత డబ్బు ఆదా అవుతుంది. ఆ డబ్బును వైద్యానికో, పిల్లల చదువులకో ఖర్చు పెట్టుకునే వెసులుబాటు దొరుకుతుంది.
* చౌకడిపోల సంఖ్యను పెద్దఎత్తున పెంచాల్సి ఉంది. ఇందుకు కేరళ ఆదర్శం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.6 లక్షల దుకాణాలు మాత్రమే ఉన్నాయి.
* ఓట్ల రాజకీయాల మూలంగా.. అనర్హుల వద్దా తెల్లకార్డులుంటున్నాయి. దీంతో అసలైన లబ్ధిదారులు నష్టపోతున్నారు. మన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుంటుంబాలు 6.5 కోట్లు కాగా, తెల్లకార్డులు మాత్రం 10 కోట్లున్నాయి. వీటిని ఏరివేసి అర్హులకు న్యాయం చేయాలి. బోగస్‌ కార్డులు తగ్గించడం వల్ల రేషన్‌ సరుకులను ఎక్కువమంది అర్హులకు ఇవ్వడం సాధ్యమవుతుంది.
* పీడీఎస్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలి.
* రాష్ట్రాలు తరచూ కోటాను తగ్గిస్తున్నాయి. ప్రభుత్వం ఇపుడిస్తున్న కోటా ఒక కుటుంబానికి ఏమాత్రం సరిపోదు. ఎట్టిపరిస్థితిల్లోనూ కోటాను తగ్గించకూడదు.
* ఇప్పటికే దేశంలో 50 శాతం మంది పిల్లలకు పోషకాహారం లేదు. 75 శాతం మంది మహిళలకు రక్తహీనత ఉంది. పేదల ఆరోగ్యం కోసం కూడా పీడీఎస్‌ను అందరికీ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.
* సార్వత్రిక విశిష్ట గుర్తింపు విధానాన్ని వేగవంతం చేసి.. బోగస్‌ల బెడద లేకుండా చూడటం తక్షణావసరం.
* ఆహారభద్రత బిల్లును త్వరగా ప్రవేశపెట్టడం వల్ల దేశంలో కనీసం తిండికి భద్రత లభిస్తుంది.

బడ్జెట్‌ ఏమిచ్చింది..?
పేదలకు పట్టెడన్నం పెడుతుందని ఆశించిన 'ప్రజాపంపిణీ వ్యవస్థ'ను బలోపేతం చేసే దిశగాకేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని శుక్రవారంనాటి బడ్జెట్‌ను చూస్తే అర్థమైపోతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ఫలాలు కేవలం 11 శాతం మందికే అందుతున్నాయంటూ సాక్షాత్తూ ప్రణాళికా సంఘం మొత్తుకున్నా... ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. గత ఏడాది వరదలు, కరవుల కారణంగానే ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఫలితంగానూ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకుందని కారణాలను ఏకరువు పెట్టింది కానీ దానికి పరిష్కారాలను చూపించడంలో మాత్రం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం గణాంకాల నివేదిక కాదని, ప్రభుత్వ దూరదృష్టికీ, భవిష్యత్‌లో రాబోతున్న విధానాలకూ దీపిక అని విత్తమంత్రి ప్రణబ్‌ ముఖర్జీనే స్వయంగా చెప్పారు. మరి ప్రజాపంపిణీ గురించి ఏం చోయబోతున్నదీ ఎందుకు చెప్పలేదు? ఎంతో ముఖ్యమైన ఈ వ్యవస్థ ప్రక్షాళన గురించి ఆయన ఒక్క మాటా ఎందుకు మాట్లాడలేదు? ఆహార ధాన్యాల నిల్వ నిల్వ సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ఆహ్వానించారు. ఎఫ్‌సీఐ ప్రైవేటు వ్యక్తుల నుంచి గోదాములను అద్దె తీసుకునే కాల వ్యవధిని 5 నుంచి 7 సంవత్సరాలకు పెంచారు. దీని వల్ల తక్షణం పీడీఎస్‌ లబ్దిదారులకు ఒరిగేదేమిటి? ఆహార భద్రత బిల్లు ముసాయిదా సిద్ధంగా ఉందని చెప్పారు... అదెప్పటికి వస్తుందో...ఏం సాధిస్తుందో!!