Tuesday, March 2, 2010

రెండు రెళ్లు ఆరు! కేటాయింపుల్లో భారీగా సవరణలు

రెండు రెళ్లు ఆరు!
కేటాయింపుల్లో భారీగా సవరణలు
వాస్తవాన్ని ప్రతిబింబించని అంకెలు
ముఖ్యమైన శాఖలకు నిధుల కోత
మిగిలిపోయిన రూ.22 వేల కోట్లు
ఇదీ 2009-10 బడ్జెట్‌ వి'చిత్రం'
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌ ప్రణాళికా వ్యయంలో రాష్ట్రాల మాదిరే పిల్లిమొగ్గలేస్తోంది. వాస్తవంగా బడ్జెట్‌లో కేటాయించిన మొత్తానికీ, ఏడాది చివర కనిపించే ఖర్చులకూ పొంతన ఉండటంలేదు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ అంచనాలు, సవరించిన అంచనాలను చూస్తే ఇది కళ్లకుకడుతుంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలకు బడ్జెట్‌లో రూ. 4,47,921.31 కోట్లు కేటాయించింది. అయితే సవరించిన అంచనాల్లో ఆ మొత్తం రూ.4,25,590.05 కోట్లకు తగ్గిపోయింది. ఫలితంగా రూ.22,331.26 కోట్ల మేర కోతపడింది. అంటే 4.98 శాతంమేర నిధులను ఖర్చు పెట్టలేకపోయారు. ఆమ్‌ఆద్మీ పేరు చెప్పుకొని రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌ ప్రభుత్వం... 47 శాఖల్లో ముఖ్యమైన వ్యవసాయం, విద్యుత్‌, మానవవనరుల వంటి శాఖలకు కూడా అవసరమైన మేరకు నిధులను ఖర్చు చేయలేకపోయింది. వ్యవసాయ శాఖలో రూ. 315.84 కోట్ల మేరకు నిధులు ఉపయోగించలేదు. నిజానికి 2004 నుంచీ ఈ రంగంలో ప్రభుత్వరంగ వాటా తగ్గిపోతూ వస్తోంది. 2004లో ప్రభుత్వరంగ పెట్టుబడి 20.5 శాతం ఉండగా 2008-09 నాటికి ఇది 17.6 శాతానికి తగ్గిపోయింది. అదే సమయంలో వ్యవసాయంలో ప్రైవేటురంగం పెట్టుబడులు 79.5 శాతం నుంచి 82.4 శాతానికి పెరిగాయి. 2008-09 సంవత్సరంలో వ్యవసాయ వృద్ధిరేటు 1.6 శాతానికి పడిపోయినప్పటికీ దాన్ని సరిదిద్దేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో ప్రయత్నం చేయలేకపోయింది. ఆహారధాన్యాలు ఆకాశాన్నంటి సామాన్యుడు అల్లాడిపోతున్న తరుణంలో కేంద్రం ఆ శాఖకు కేటాయించిన మొత్తాన్నీ వాడుకోలేకపోయింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖలో రూ.156.45 కోట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి ఆహార ఉత్పత్తుల ధరలు... టోకు ధరల సూచి ప్రకారం 13.31 (2009-10) శాతం పెరిగాయి. 2008-09తో పోలిస్తే ఇది రెట్టింపు. అయినప్పటికీ ఈ శాఖ మాత్రం తనకు ఇచ్చిన మొత్తాన్నీ పూర్తిగా వినియోగంచుకోలేక సామాన్యుడిని ధరల రక్కసికి బలిచేసింది. హోంశాఖదీ ఇదే పరిస్థితి. మానవ వనరుల అభివృద్ధిశాఖదీ మరో విషాదగాథ. అతిముఖ్యమైన ఈ విభాగానికి బడ్జెట్‌లో రూ.5719 కోట్ల రూపాయల మేర కోతపడింది. పసిపిల్లల పొట్ట నింపాల్సిన మధ్యాహ్న భోజన పథకానికి సుమారు రూ.640 కోట్లు కోతపెట్టారు. తాజా బడ్జెట్‌లో ఇదే పద్దుకింద రూ.9400 కోట్లు కేటాయించినా అంచనాలు సవరించే సరికి ఎంత మేరకు తగ్గిపోతుందో చూడాలి. గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయింపులు కూడా ఏడాది చివరి కొచ్చే సరికి రూ.891 కోట్లకు తగ్గిపోయాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం, గృహనిర్మాణ పథకాలకు ఇచ్చిన నిధులన్నీ ఖర్చు చేసినా, గ్రామీణ రోడ్లు, వంతెనల పద్దుల్లో రూ.648 కోట్లు కోతపెట్టారు. మైనారిటీ సంక్షేమం (రూ.1740 కోట్లు), సామాజిక న్యాయశాఖ (రూ.2500 కోట్లు)లకు ఇచ్చిన నిధులను పూర్తిగా ఖర్చుపెట్టిన మన్మోహన్‌ ప్రభుత్వం గిరిజనాభివృద్ధిపైనా శీతకన్ను వేసింది. అంచనాల సవరణ నాటికి గిరిజనులు రూ.186 కోట్లను కోల్పోయారు. ఇదే సమయంలో మహిళా, శిశుసంక్షేమానికి మాత్రం అంచనాల కంటే ఎక్కువగా రూ.1200 కోట్లు ఖర్చు చేసింది. రవాణా రంగానికి జీవనాడి అయిన రైల్వేశాఖ కేటాయింపుల్లో రూ.1629 కోట్లు కోతపడింది. ఉపరితల రవాణాశాఖకు 1686 కోట్ల మేర వాతపెట్టారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న విద్యుత్తుశాఖకూ షాక్‌ తప్పలేదు. ఆ శాఖ సుమారు రూ. 7856 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో అణువిద్యుత్తుకు మాత్రం ఎక్కువే ఖర్చు చేశారు. దేశంలో ఎరువుల ధరలు పెరగడం వల్లనో, మరో కారణంగానో రైతులు అష్టకష్టాలూ పడుతుంటే ఆ శాఖ కూడా బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయింది. పట్టణాభివృద్ధిశాఖ మాత్రం భారీగా నిధులు ఖర్చు చేసింది.
ఆదాయంలో సగానికిపైగా అప్పులకే: 2010-11 బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఆదాయంలో 36 శాతం అప్పుల మీద వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల ప్రకారం మన ఆదాయం రూ.6,82,212 కోట్లు కాగా అందులో 36.4 శాతం అంటే రూ.2,48,664 కోట్లు అప్పుల మీద వడ్డీ కిందే పోతోంది. మనం చెల్లించే అప్పులోని అసలు కూడా (రూ.1,37,276)కలిపితే ఇది 56.57 శాతానికి పెరుగుతుంది. అంటే మనకొచ్చే ఆదాయంలో 43 శాతమే ఇతర ఖర్చుల కోసం వినియోగించుకోవాల్సి వస్తోంది. 2009-10 నాటికి భారత్‌ అప్పు రూ. 19.57 లక్షల కోట్లకు చేరింది. ఆదాయం కూడా అంచనాల మేరకు రాకపోవడంతో అదనంగా అప్పులు తేవాల్సిన పరిస్థితి వస్తోంది. పన్ను, పన్నేతర ఆదాయం 2009-10లో రూ.37,203 కోట్లు తగ్గిపోయింది. దీనివల్ల తేవాల్సిన అప్పుల్లో కూడా అంచనాలు మారిపోయాయి. ఇతరత్రా ఆదాయం రూ.1120కోట్లు వస్తుందని అంచనా వేయగా రూ.25,958 కోట్లు వచ్చింది. అలాగే... ప్రణాళికా వ్యయం రూ.3,25,149 చూపించగా, సవరించిన బడ్జెట్‌లో అది రూ. 3,15,176 అయింది. ప్రణాళికేతర వ్యయాన్ని రూ.6,95,689 కాగా, సవరించిన తర్వాత అది రూ.7,06,371 అయింది.రాష్ట్రాల మాదిరే... కేంద్రం కూడా బడ్జెట్‌ ప్రణాళికా వ్యయంలో గొప్పలకు పోతూ వాస్తవాలను ప్రతిఫలించలేకపోతోంది.