Thursday, April 22, 2010

ఇన్ఫోటెక్ 1:1 బోనస్

1,000 కోట్ల టర్నోవర్
40 శాతం డివిడెండ్

హైదరాబాద్, ఏప్రిల్ 22 : సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగంలోని ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ మైలురాయిని చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2009-10 )లో 9,994 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించిన ఇన్ఫోటెక్ తన ప్రస్తుత వాటాదారులకు 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ 21 శాతం వృద్ధిని సాధించిందని ఈ ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక ఫలితాలు, గత ఆర్థిక సంవత్సర ఫలితాలను ఆయన విలేకరుల సమావే శంలో వెల్లడిస్తూ కంపెనీ ముందుగా ప్రకటించిన దానికంటే 10 శాతం అధికంగా గత ఆర్థిక సంవత్సరానికి 40 శాతం డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించిదన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోటెక్ 9,994 కోట్ల రూపాయల టర్నోవర్‌పై 170.8 కోట్ల రూపాయల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాబడి 7.1 శాతం మేరకు వృద్ధి చెందగా, నికరలాభం భారీగా 87.5 శాతం పెరిగింది.

సిబ్బంది పని నియామకంలో చేసిన మార్పులు చేర్పులు లాభాలు గణనీయంగా పెరగడానికి దోహదపడినట్లు మోహన్ రెడ్డి తెలిపారు. ఇపిఎస్ 30.9 రూపాయలు లభించింది. వాటాదారులకు 1:1 బోనస్ ప్రకటించినందున ఈక్విటీ రెట్టింపవుతుంది. ఇది ఈ ఆర్థిక సంవత్సరం ఇపిఎస్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

నాల్గో త్రైమాసికానికి 51 కోట్ల లాభం
ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికానికి 244 కోట్ల రూపాయల టర్నోవర్‌పై 51.3 కోట్ల రూపాయల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే టర్నోవర్ 3.9 శాతం వృద్ధి చెందగా నికరలాభం భారీగా 185 శాతం పెరిగింది. మూడవత్రైమాసికంతో పోలిస్తే నికరలాభం 35శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ రంగం ఆశాజనకంగా ఉండవచ్చునని మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

కొత్తగా 1,400 నియామకాలు
సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగంలో పెరుగుతున్న వ్యాపార అవకాశాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1400 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు.

జీతాలు పెంచుతాం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఆఫ్ షోర్ సిబ్బందికి 10శాతం ఆన్ షోర్ సిబ్బందికి సుమారు 3 శాతం జీతాలను పెంచుతున్నట్లు ఆయన వివరించారు. ఇది కంపెనీ లాభాల మార్జిన్లపై కొంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉందని మోహన్ రెడ్డి తెలిపారు.