Thursday, April 29, 2010

పన్ను సంస్కరణలు అమలు చేస్తాం : ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాల్లో సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. 2010-11 ఆర్థికబిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఆయన ప్రసంగించారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ప్రతిపాదనలను వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశ పెడతామని ప్రణబ్‌ తెలిపారు. ప్రతిపాదిత జీఎస్‌టీపై రాష్ట్రాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆదాయపు పన్నులో మార్పులతో పాటు దీర్ఘకాల పొదుపు పథకాలు, పదవీ విరమణ సొమ్ముపై పన్ను విధింపుతో పాటు గృహ రుణాలపై పన్ను రాయితీ ఉపసంహరణ వంటివి ఇందులో ఉన్నాయి. దీనిపై పలు ఫిర్యాదులు అందాయి. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, డిమాండ్‌ పెరగడంతో పారిశ్రామిక వృద్ధి బాగుందని ఉద్దీపన పథకాలు ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేశాయని మంత్రి వివరించారు.

ఎల్‌ఎల్‌పీల స్థాపనకు అవకాశం రాజ్యసభలో బిల్లులు: పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థల (ఎల్‌ఎల్‌పీ) ఏర్పాటుకు ఛార్టెడ్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్‌ అకౌంటెంట్లకు అవకాశం కల్పించే బిల్లులను రాజ్యసభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం సంబంధిత చట్టాల్లో సవరణలను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ప్రతిపాదించారు.

పీఎస్‌యూల ఐపీవోలకు కమీషన్‌ చెల్లించనున్న ప్రభుత్వం: న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల పబ్లిక్‌ ఇష్యూలకు బ్రోకర్లుగా వ్యవహరించే వారికి కమీషన్‌ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు విక్రయించిన షేర్లపై 0.35%, అధిక విలువ కలిగిన పెట్టుబడిదారు (హెచ్‌ఎన్‌ఐ)లకు విక్రయించే షేర్లపై 0.15% కమీషన్‌ చెల్లిస్తామని పెట్టుబడుల ఉపసంహరణ శాఖ కార్యదర్శి సుమిత్‌ బోస్‌ చెప్పారు. సట్లజ్‌ జల విద్యుత్‌ నిగమ్‌తో ఆరంభించి, రాబోయే పీఎస్‌యూ ఇష్యూ లన్నిటికీ వర్తింప చేస్తామని ఆయన తెలిపారు.