Thursday, April 29, 2010

బహుళ బ్రాండ్‌ రిటైల్‌లో 51% విదేశీ పెట్టుబడులు?

న్యూఢిల్లీ: రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నియమాలను కొన్ని కఠినమైన షరతులకు లోబడి సరళతరం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆహార వస్తువులు, కిరాణా, కాయగూరలు వంటి ప్రాథమిక వస్తువులు మినహా ఇతర బహుళ బ్రాండ్‌ల రిటైల్‌ వ్యాపారంలో 51 శాతం వరకు ఎఫ్‌డీఐని అనుమతించడానికి సంబంధించి ఒక కాన్సెప్ట్‌ నోట్‌ను కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. ప్రస్తుత నిబంధనావళి ప్రకారం సింగిల్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల వ్యాపారంలో తప్ప రిటైల్‌లో 51 శాతం విదేశీ పెట్టుబడిని అనుమతించడం లేదు. హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగంలో మాత్రం ఎఫ్‌డీఐని 100 శాతం వరకు అనుమతిస్తున్నారు. ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరకుల రిటైల్‌ వ్యాపారంలో ఎఫ్‌డీఐలను అనుమతించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)కు సమాంతరమైన యంత్రాంగాన్నొకదానిని సృష్టించాలని మంత్రిత్వ శాఖ తలపోస్తోంది. ఇపుడున్న పీడీఎస్‌లో వస్తువులు లక్షిత వర్గాలకు కాకుండా ఇతరత్రా దారి మళ్లుతున్న ఆరోపణలు అంతకంతకు అధికంగా వినవస్తున్న విషయం విదితమే. రిటైల్‌ విక్రయ కేంద్రాలను కనీసం 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే ఏర్పాటు చేసుకునేలా పరిమితులు విధించే అవకాశాలున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వచ్చే నెలలో 6 చర్చాపత్రాలు..: రక్షణ శాఖ నుంచి వ్యవసాయం వరకు, ఔషధ తయారీ నుంచి రిటైల్‌ రంగం వరకు.. ఇలా పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని సరళతరం చేయడం గురించి ఒక చర్చకు వచ్చే నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ఎఫ్‌డీఐ విధానాల రూపకల్పనకు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ) విదేశీ పెట్టుబడి నియమాలకు సంబంధించి ఆరు చర్చాపత్రాలను మే రెండో వారం చివర్లో విడుదల చేయనుంది. మే 12న గాని, లేదా 13వ తేదీన గాని ఈ చర్చాపత్రాలను ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేయనున్నట్లు డీఐపీపీ వర్గాలు పేర్కొన్నాయి.