Thursday, April 29, 2010

యులిప్ పాలసీల్లో ఏజెంట్ కమీషన్ ఎంత?

బీమా కంపెనీలకు ఐఆర్‌డిఎ ఆదేశం

హైదరాబాద్: యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ (యులిప్స్)పై ఏజెంట్లకు చెల్లిస్తున్న కమీషన్ వివరాలను వినియోగదారులకు వెల్లడించాలని జీవిత బీమా కంపెనీలను ఐఆర్‌డిఎ ఆదేశించింది. బీమా సర్వీసుల మార్కెటింగ్‌లో పారదర్శకతను పెంచే దిశలో భాగంగా యులిప్‌లపై ఏజెంట్లకు చెల్లించే కమీషన్, బ్రోకరేజ్ వివరాలను వినియోగదారులకు విస్పష్టంగా తెలపాలని బీమా కంపెనీలను ఆదేశించినట్టు ఐఆర్‌డిఎ పేర్కొంది.

ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. యులిప్‌ల నియంత్రణపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబికి, బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఎకు మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఐఆర్‌డిఎ తాజా నిబంధన ప్రాధాన్యత సంతరించుకున్నది.

బీమా కవరేజ్ మినహా ఇన్వెస్ట్‌మెంట్ దృష్టితో చూస్తే పూర్తిగా మ్యూచువల్ ఫండ్స్‌ను పోలి ఉంటే యులిప్ పాలసీల్లో బీమా కంపెనీలు, బ్రోకర్లకు భారీ ఎత్తున కమీషన్లు చెల్లిస్తున్నాయి.

అదే సమయంలో సెబి ఆంక్షల కారణంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏజెంట్ల కమీషన్‌ను భారీగా తగ్గించాల్సి వచ్చింది. దాంతో బ్రోకర్లు, మార్కెట్ ఏజెంట్లు మ్యూచువల్ ఫండ్స్‌ను పట్టించుకోవడం మానేసి యులిప్ స్కీమ్‌ల మార్కెటింగ్‌ను మాత్రం జోరుగా చేస్తున్నారు. ఈ విషయంలో మ్యూచువల్ ఫండ్ సంస్థల ఆందోళనను గమనించిన సెబి రంగంలోకి దిగి యులిప్ స్కీమ్‌లపై ఆంక్షలను ప్రకటించింది.

తన పరిధిలోని యులిప్‌లపై సెబి పెత్తనాన్ని ఐఆర్‌డిఎ వ్యతిరేకించడంతో రెండు నియంత్రణ సంస్థల మధ్య వివాదం రాజుకున్నది. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. మరోవైపు బ్రోకర్ కమీషన్లే వివాదానికి మూలకారణమన్న విషయం గమనించిన ఐఆర్‌డిఎ బీమా పాలసీలకు సంబంధించి పారదర్శకతకు నడుంబిగించింది.

బీమా కంపెనీలు ఐఆర్‌డిఎ నిర్ణయాన్ని స్వాగతించాయి. యులిప్ పాలసీల కొనుగోలుదార్లకు తమ ఇన్వెస్ట్‌మెంట్‌లో నికరంగా ఎంత మొత్తం కమీషన్లు, చార్జీల కింద పోతున్నదో తెలియడం మంచిదేనని వారు అంటున్నారు. ఐఆర్‌డిఎ చర్య వల్ల మ్యూచువల్ ఫండ్స్, యులిప్‌ల మధ్య దేన్ని ఎంచుకోవాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి వినియోగదారులకు వీలుకలుగుతుందని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంటున్నాయి.