
ముదురుతున్న గ్రీస్ సంక్షోభం
స్పెయిన్, పోర్చుగల్, ఇటలీలకూ ముప్పు!
గడ్డు స్థితిలో ఐరోపా దేశాలు
కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ పతనం 300 పాయింట్లు పైనే
మదుపర్లూ.. అనవసర ఖర్చులకు దూరం జరగండి
బంగారం, వెండి కొనుగోలు శ్రేయస్కరం
నిన్న మొన్నటి మాంద్యం ఇంకా సమసిపోనేలేదు. అప్పుడే గ్రీసు రూపంలో మరో సంక్షోభం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారింది.తాజాగా అది అంతర్జాతీయ మార్కెట్లను కుప్పకూల్చింది. మన మార్కెట్ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇప్పటికే పోర్చుగల్‌పై ఈ ప్రభావం పడగా ఇటలీ, స్పెయిన్‌వంటి దేశాలకూ ముప్పు ముంచుకొస్తోంది. మరింత ఆలస్యమైతే అమెరికా, ఆసియాకూ ఈ ఛాయలు పాకే అవకాశముందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్రీసు సంక్షోభం రోజు రోజుకూ కాదు.. గంట గంటకూ వేగంగా వ్యాపిస్తోందంటున్న నిపుణుల మాటలు మరింత ఆందోళనను కలుగజేస్తున్నాయి.
![]() కష్టాల కడలిలో ఐరోపా: గ్రీస్ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ ఏకంగా 'పనికిరాని (జంక్)' స్థాయికి దిగజార్చింది. అంటే ఆ దేశంలోని బ్యాంకులన్నీ దివాలా తీసినట్లే. అలాగే పోర్చుగల్ రేటింగ్‌నూ తగ్గించింది. ఇదే వరుసలో స్పెయిన్, ఇటలీ ఉన్నాయి. వీటిని ఒడ్డున పడేయాలంటే కనీసం 2 లక్షల కోట్ల యూరోలు (మన కరెన్సీలో 120 లక్షల కోట్ల రూపాయలు) కావాలి. గ్రీస్‌కు 'జంక్' రేటింగ్ రావడంతో ఆ దేశ బాండ్ మార్కెట్ కుప్పకూలి ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సైతం నష్టపోతున్నాయి. రేటింగ్ తగ్గడంతో పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లోని బ్యాంకింగ్ వ్యవస్థ కూలిపోయే విధంగా ఉంది. ఇబ్బంది కొన్ని ఐరోపా దేశాలకే అనుకుంటే పొరపాటే. ఇది ఆరంభం మాత్రమే. నెమ్మదిగా ఇతర ఐరోపా దేశాలకు, జపాన్, అమెరికాలకూ సంక్షోభం విస్తరిస్తుంది. అప్పుల భారమే ఈ స్థితికి ప్రధాన కారణం. ఐరోపా దేశాలు వచ్చే ఏడాది వ్యవధిలో 1.6 లక్షల కోట్ల (దాదాపు రూ.96 లక్షల కోట్ల) అప్పు తీర్చాల్సి ఉంది. గ్రీస్ వచ్చే మూడేళ్ల పాటు ఏటా 5000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్ల) అప్పు చేయకపోతే బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. ఐరోపా దేశాల ఆర్థిక లోటు (గ్రీస్‌కు 13.6 శాతం, పోర్చుగల్ 9.4 శాతం, స్పెయిన్ 12 శాతం, బ్రిటన్ 11.5 శాతం) అంతులేని స్థాయికి పెరిగిపోయింది. ఐరోపాలో మొదలైన సమస్యను తక్షణం కట్టడి చేయకపోతే కష్టమే. ఎందుకంటే ఈ దేశాల మధ్య మూలధన మార్పిడికి ఆంక్షలు లేవు. దీనివల్ల మూలధనం వేగంగా ఆయా దేశాల నుంచి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇంకా అంతులేని సంక్షోభంలో ఆయా దేశాలు చిక్కుకుపోతాయి. అమెరికా, చైనా: అమెరికా తాను సృష్టించుకున్న కష్టాల్లో పీకల్లోతు మునిగిపోయి ఉంది. నిరుద్యోగం పెద్ద సమస్య. ఫలితంగా ఎంతోమంది ఇళ్లు అమ్ముకోవలసి వస్తోంది. అక్కడి పౌరుల వ్యక్తిగత ఆదాయం క్షీణిస్తూనే ఉంది. పైగా అమెరికా ప్రభుత్వం చేస్తున్న అప్పులు భయాందోళన కలిగిస్తున్నాయి. అవి తీర్చలేనంతగా పెరిగిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా కష్టాలను అడ్డుకోగలదని భావిస్తున్న చైనా కూడా ఇబ్బందుల్లో ఉంది. చైనా రియల్‌ఎస్టేట్ గాలి బుడగ ఏక్షణంలోనైనా పేలిపోనుంది. 2009లో చైనా బ్యాంకులు 1.4 ట్రిలియన్ డాలర్ల ఇంటిరుణాలు మంజూరు చేశాయి. ఈ మొత్తం భారత స్థూల ఆదాయం కంటే ఎక్కువ. ద్రవ్యోల్బణం చైనాలో అదుపులేని స్థాయిలో ఉంది. అతిజాగ్రత్తకు పోయి చైనా పెద్దఎత్తున సరుకులు, బొగ్గు, రాగి వంటి ముడిపదార్ధాలు పెద్దఎత్తున దిగుమతి చేసుకుంది. దీంతో నిల్వలు పేరుకుపోయాయి. దీనికి పరిష్కారంగా వడ్డీ రేట్లు పెంచాలి. అందుకే చైనాలో షేర్లు, రియల్ ఎస్టేట్ ధరలు పతనం అవుతున్నాయి. మనదేశం మాటో..: మనదేశంలో ఇప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేదు. మనకు అతిపెద్ద వర్తక భాగస్వామి అయిన చైనా సమస్యల పాలయితే మనకూ ఇబ్బందులు తప్పవు. యూరో జోన్, అమెరికా ఇతర అతిపెద్ద వర్తక భాగస్వాములు. ఈ మూడుచోట్లా కష్టాలు చోటుచేసుకుంటే మనదేశానికి అంతా బాగుంటుందని భావించడానికి వీల్లేదు. కాకపోతే ఈ దేశాలతో పోలిస్తే మన స్థితి కాస్త ఫర్వాలేదు. చమురు ధరలు పెరుగుతుండటం మనకు ఇబ్బందికరమైన పరిణామం. దీనివల్ల సబ్సిడీ భారం రూ. లక్ష కోట్లకు పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీరేట్లు పెంచాల్సి వస్తుంది. అదే జరిగితే అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్లకు పెనుభారమే. ప్రస్తుతం విదేశీ సంస్థాగత పెట్టుబడులు (హాట్ మనీ) పెద్దఎత్తున మనదేశానికి వస్తున్నాయి. ఇది కూడా ప్రమాదమే. అవి ఎప్పుడు వెనక్కి వెళ్లిపోతాయో అంచనా వేయలేం. ప్రతిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కృషి చేయాలి. రిటైల్, బీమా, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఎఫ్‌డీఐలను ఇంకా అనుమతించాలి. దేశీయంగా బలమైన బాండ్ మార్కెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల స్థితిపై కన్నేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కంపెనీలైనా, మదుపుదార్త్లెనా ప్రస్తుత పరిస్థితుల్లో అనవసర ఖర్చులు, విస్తరణల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ధరలు తగ్గినప్పుడల్లా బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉండటం మదుపుదార్లకు క్షేమకరంగా కనిపిస్తోంది. - కె. కృష్ణంరాజు, క్రిసాని వెల్త్ మేనేజ్‌మెంట్ సీఎండీ |
|
|
|
![]() |