Monday, April 26, 2010

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్ల సమీక్షకు కమిటీ!

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఇస్తున్న వడ్డీని మార్కెట్‌ రేట్లతో అనుసంధానం చేసే అంశంపై అధ్యయనం జరిపేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ అంశంపై తగిన సూచనల కోసం కేంద్ర నెలలోపు ఒక కమిటీని ఏర్పాటు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపు పథకాలకుఇస్తున్న వడ్డీ తీరు మార్కెట్‌లోని వడ్డీరేట్లకు, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే రుణలకు విఘాతం కలిగించేలా ఉందన్న ఆర్థిక సంఘం సూచన మేరకు కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించాలని యోచిస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు పలు రకాల ఫిక్స్‌డ్‌ టెర్మ్‌ డిపాజిట్లకు ఇస్తున్న వడ్డీకన్నా పీపీఎఫ్‌, పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ వంటి కేంద్ర నిర్వహిస్తున్న పలు పథకాలపై వడ్డీ అధికంగా ఉండడంతో ఎక్కువ మంది వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ విభాగాల్లో పొదుపు బాగా పెరుగుతోంది. ఆయా రాష్ట్రాల నుంచి వసూలయ్యే చిన్న మొత్తాల పొదుపులో కొంత సొమ్మును కేంద్రం సంబంధిత రాష్ట్రాలకు రుణ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే రుణాలు విషయంలోనూ ఏకరూపత కొరవడుతోందని ఆర్థిక సంఘం అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.