Monday, April 19, 2010

మాంద్యంలోనూ పెరిగాయ్‌

* రూ.1,22,000 కోట్లకు భారతీయుల రెమిటెన్సెస్‌
* ఆర్‌బీఐ సర్వే వెల్లడి
ముంబయి: విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే నగదు(రెమిటెన్సెస్‌)పై మాంద్యం ప్రభావం పడలేదు. గతేడాది ఏప్రిల్‌-సెప్టెంబరులో ఇవి ఒక బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగి 27.51 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1,22,420 కోట్లు)కు చేరుకున్నాయి.అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇవి 26.37 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని రిజర్వు బ్యాంకు సర్వే ఒకటి తేల్చిచెప్పింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం భారత్‌లోకి వచ్చే నగదుపై ప్రభావం చూపలేకపోయిందని ఆర్‌బీఐ తన తాజా నెలవారీ నివేదికలో పేర్కొంది. నవంబరు 2009లో చేసిన ఈ సర్వే విశేషాలివీ..

* భారత్‌కొచ్చిన నగదులో ఎక్కువ భాగం ఉత్తర అమెరికా నుంచేరావడం విశేషం. అయితే 2006 సర్వేలో దీని వాటా 44 శాతం కాగా ఈ సారి 38 శాతానికి పరిమితమైంది. (ఎక్కువ సగటు వార్షిక వేతనముండే ఐటీ/ఐటీ ఆధారిత రంగాల్లో పనిచేసే భారతీయులు ఉత్తర అమెరికాలో ఎక్కువగా ఉన్నారు.)

* ఇక గల్ఫ్‌ ప్రాంతానికి 27 శాతం వాటా ఉంది. కొచ్చి, ముంబయిలు తాము పొందే రెమిటెన్సెస్‌లో 50 శాతం గల్ఫ్‌ నుంచే పొందాయి.

* ఇక హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ, చండీగఢ్‌, కోల్‌కతలకొచ్చిన రెమిటెన్సెస్‌లో ఉత్తర అమెరికా, ఐరోపాల నుంచే 60 శాతం లభించడం విశేషం.