Thursday, April 29, 2010

బియ్యం పరిశ్రమకు గడ్డుకాలం

మండపేట: మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా పిలువబడుతుంది. అందులో ఉభయగోదావరి జిల్లాలు ధాన్యాగారాలుగా వర్థిల్లుతున్నాయి. పచ్చని పొలాలు, పాడిపంటలతో వుండే మన రాష్ట్రంలోని అభివృద్ధి చెందినంత విధంగా మరే రాష్ట్రంలోను రైసుమిల్లుల పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఇండస్ట్రీస్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని గడ్డుకాలంగా వుంది. క్రాప్‌ ఏరియా తగ్గిపోవడం ఇబ్బడిముబ్బడిగా కార్పొరేట్‌ రైసుమిల్లులు విస్తరించడం, ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతులు తగ్గిపోవడం, కార్పొరేట్‌ పోటీని తట్టుకోలేక పాతమిల్లులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వీటితోపాటు ప్రభుత్వం పరిశ్రమలకు పవర్‌ హాలీడేను ప్రకటించడం, జనరేటర్లపై మిల్లులను తిప్పడం భారంగా మారడం, ఎఫ్‌సిఐ గోదాములు ఖాళీలేక తద్వారా ప్రొక్యూర్‌ చేయవలసిన బియ్యానికి దారిలేక లెవీ ఇవ్వవలసిన బియ్యం నిల్వలు మిల్లులలోనే మూలుగుతున్నాయి.

మన రాష్ట్రంలో చిన్నాపెద్దాకలిపి సుమారు ఆరువేల వరకు రైసు మిల్లులు ఉండగా, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 600 వరకు ఉన్నాయి. గత సంవత్సరం ఎఫ్‌సిఐ రాష్టవ్య్రాప్తంగా 90 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రొక్యూర్‌మెంటు చేయగా ఈ సంవత్సరం కేవలం 62 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటి వరకు ప్రొక్యూర్‌ చేసినట్లుగా రైసుమిల్లు వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 37లక్షల టన్నుల పచ్చి బియ్యం వుండగా, 25లక్షల టన్నులు బాయిల్డ్‌ (ఉప్పుడు బియ్యం) రైస్‌ వుంది. అదే ఒక్క తూర్పుగోదావరి జిల్లాకు వస్తే 15లక్షల టన్నుల లెవీకి ఇప్పటివరకు 11లక్షలు పూర్తి అయింది. మూడు లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ గోదాములు ఖాళీలేక లేవీ పూర్తి చేయలేదు. ఆహార ధాన్యాల నిల్వలు తరిగిపోకుండా కేంద్రప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా బఫర్‌ స్టాకు నిల్వలు పెట్టమని ఆదేశాలున్నాయి.

ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నా అయితే గోదాములు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత ఖరీఫ్‌లో వర్షాలు, వరదలతో ఈ రబీలో నీటి ఎద్దడి అంటూ సాగుభూమిని కుదించేయడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దాంతో మిల్లర్లు పోటీపడి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే 30 నుంచి 50 రూపాయలకు అదనంగా కొనుగోలు చేయడం జరిగింది. అదీకాకుండా గతంలో మన రాష్ట్రం నుంచి పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా, బీహార్‌, యు.పి., మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు బియ్యం, నూకలు ఎగుమతి అయ్యేవి. అయితే అక్కడ కూడా ధాన్యం విస్తారంగా పండటంతో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇక్కడ మిల్లింగ్‌ చేసిన పచ్చిబియ్యం మన రాష్ట్రం నుంచి మహారాష్టక్రు 40 నుంచి 50 శాతం వెళ్లేవి.

అక్కడకు కూడా ప్రస్తుతం ఎగుమతి కావడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వరిపంట విస్తారంగా పండటంతో మార్కెట్‌ లేకుండా పోయింది. గత మూడు సంవత్సరాల క్రితం మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలైన సౌదీ అరేబియా, శ్రీలంక, సింగపూర్‌, బంగాదేశ్‌ తదితర దేశాలకు బియ్యం ఎక్స్‌పోర్టు వుండేది. అప్పట్లో రైస్‌మిల్లర్ల పరిస్థితి మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండేది. అప్పటి నుంచి బియ్యం రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మనదేశంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆహార ధాన్యాల ఎక్స్‌పోర్టుపై ఆంక్షలు విధించి ఎగుమతులను నిలిపి వేసింది. అలాగే సన్నరకాల బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఎగుమతి చేయాలంటే పరిమిట్‌ విధానం వుండేది. ఎఫ్‌సిఐకి 75 శాతం లెవీ పూర్తిచేస్తే 25 శాతం బయట అమ్ముకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం బియ్యం రేట్లు పెరిగిపోవడంతో అన్నిరకాల బియ్యానికి ఫ్రీ మార్కెట్‌ చేసింది.

దాంతో పరిమిట్‌ విధానం రద్దయి బియ్యాన్ని ఎక్కడైనా అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ లేకపోవడంతో మార్కెట్‌ లేకుండా పోయింది. ఒక్క కేరళ రాష్ట్రానికి మాత్రమే బాయిల్డ్‌ రైసు సరఫరా అవుతుంది. గత రెండు సంవత్సరాల నుంచి మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. బియ్యానికి మార్కెట్‌ లేక మిగిలిపోయిన లెవీ పూర్తిచేయడానికి గోదాములు ఖాళీలేక ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 30లక్షల టన్నుల బియ్యం రవాణా ఆగిపోయింది. చాలా వరకు రైసు మిల్లుల్లో మూలుగుతుంది. ప్రభుత్వం వరిలో కామన్‌ వెరైటీకి రూ.780లు, ఎ గ్రేడ్‌ ధాన్యానికి రూ.810లు రేటు నిర్ణయించింది. అయితే మిల్లర్లు పోటీ పడి కామన్‌ వెరైటీని రూ.820 నుంచి రూ.830, ఎగ్రేడ్‌ను రూ.830 నుండి రూ.850లకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే సన్నాలు, సోనా, గిద్ద మసూర్‌ ధాన్యాన్ని, పిఎల్‌ రకాలను రూ.1150 నుంచి రూ.1200 వరకు కూడా కొంటున్నారు.

అయితే ఈ బియ్యానికి కూడా డిమాండ్‌ తగ్గిందని రైసుమిల్లర్లు చెబుతున్నారు. ఈ రకం బియ్యాన్ని పాతవైతే క్వింటాళ్లకు రూ.2800 నుంచి రూ.3 వేలు, కొత్తవైతే రూ.2200 నుంచి రూ.2400లకు అమ్మకాలు సాగిస్తున్నారు. మనరాష్ట్రంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం ద్వారా వినియోగదారులకు, సామాన్యులకు బియ్యం చౌకగా దొరకడం, అలాగే గతంలో బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కూడా ధాన్యం ఉత్పత్తి పెరగడమే కారణంగా మిల్లర్లు అంటున్నారు. వీటితోపాటు పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, అలాగే వారంలో ఒకరోజు మిల్లుకు శెలవు ఉండటంతో మూ డురోజుల పాటు మిల్లు తిరగడం, మూడు రోజుల పాటు బంద్‌ చేయడంతో దీని ప్రభావం మిల్లులపై తీవ్రంగా చూపడం జరుగుతుంది.

దాంతో చేతినిండా పని దొరక్క జట్టుకూలీలు కూడా రావడం తగ్గిపోయారు. రాష్ట్రంలో వున్న ఆరు వేల రైసుమిల్లుల్లో సుమారు లక్షా50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ విధానం వల్ల రైసుమిల్లులన్నీ నష్టాల మరలో నలుగుతున్నాయి. ప్రభుత్వం రైసుమిల్లుల పరిశ్రమను పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వున్నాయి. 24 గంటలూ విద్యుత్‌ సరఫరాను చేయడం, 150 హెచ్‌పి వరకు ఎల్‌టి కింద పరిగణించడం, రైసుమిల్లుల ఆధునికీకరణకు సబ్సిడీలు కొనసాగించడం, ఎఫ్‌సిఐ గోదాములు ఎక్కువగా తీసుకుని స్టాక్‌ పెట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.