Monday, April 26, 2010

చైనాకు మన ఎగుమతులు పెరిగాయ్‌

బీజింగ్‌: ఈ ఏడాది తొలి మూడు నెలల్లో చైనాకు భారత్‌ ఎగుమతుల విలువ 75 శాతం పెరిగి 5.81 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది.. ఇరు దేశాల మధ్య జరిగిన మొత్తం వాణిజ్య విలువ సైతం 66 శాతం మెరుగుపడినట్లు సమాచారం. వస్త్రాలు, విలువైన రాళ్లు, లోహాల ఎగుమతుల భారీగా పెరగడంతో ఇది సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఏడాది చివరికి ఇరు దేశాల మధ్య 60 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరగొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. చైనా కస్టమ్స్‌ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఈ గణాంకాలు భారత ఉన్నతాధికార వర్గాలు, వాణిజ్య అధికారుల్లో భవిష్యత్తు వాణిజ్య పురోగతిపై కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. నివేదికలోని వివరాలవీ.. ఈ ఏడాది తొలి మూడునెలల్లో చైనాకు భారత్‌ ఎగుమతుల విలువ 5.81 బిలియన్‌ డాలర్లు. కిందటేడాది ఇదేకాలంలో ఎగుమతుల విలువ 3.31 బిలియన్‌ డాలర్లు కాగా, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో మొత్తం వాణిజ్య విలువ 44 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఇదే త్రైమాసికంలో చైనా నుంచి భారత్‌కు జరిగే ఎగుమతులు 38 శాతం మేర పెరగడంతో ఆ దేశానికి చెందిన పరిశ్రమ వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.