హైదరాబాద్‌లో 7 నక్షత్రాల పార్క్ హోటల్ దేశీయ హోటల్ పరిశ్రమకు విలాసవంతమైన డిజైన్ (బొటీక్) హోటళ్లను పరిచయం చేసిన ఘనత అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్‌ది. ఈ కంపెనీకి ఇప్పటివరకు విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా తదితర నగరాల్లో 'ద పార్క్' పేరుతో ఎనిమిది హోటళ్లు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఏడు నక్షత్రాల పార్క్ హోటల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్‌పర్సన్ ప్రియా పాల్ ఇక్కడకు విచ్చేశారు. కంపెనీ హోటళ్లను డిజైన్ చేయడంలో కీలక ప్రాత పోషించే ఆమె హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు. ఈ నేపథ్యంలో హోటల్ పరిశ్రమ, కంపెనీ ప్రణాళికలు, కొత్తగా ప్రారంభించిన హైదరాబాద్ హోటల్ గురించి 'న్యూస్‌టుడే'తో ముచ్చటించారు.
ఐదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు
2020 నాటికి ఇరవై హోటళ్లు
న్యూస్‌టుడే ఇంటర్వ్యూ అపీజే సురేంద్ర
పార్క్ హోటల్స్ ఛైర్‌పర్సన్ ప్రియా పాల్

ప్రియా పాల్: దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం (1968) విశాఖపట్నంలో మా రెండో హోటల్‌ను ప్రారంభించాం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి అయిదు నక్షత్రాల హోటల్. ఇన్నాళ్లకు హైదరాబాద్‌లో అడుగు పెట్టాం. రూ.340 కోట్ల భారీ పెట్టుబడితో దీన్ని నిర్మించాం. ప్రస్తుతానికి స్పష్టమైన ఆలోచన లేకున్నా అవసరమైతే.. రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు తప్పకుండా విస్తరిస్తాం. అయితే.. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో హోటళ్లను ఏర్పాటు చేయనున్నాం.
? కంపెనీ విస్తరణ ప్రణాళికలు ఏమిటి
పుణే, కోల్‌కతాలలో హోటళ్లను ఏర్పాటు చేయనున్నాం. వరుసగా 2013, 2014 నాటికి ఇవి సిద్ధం అవుతాయి. జైపూర్‌లో కూడా స్థలాన్ని సేకరించాం. గోవా, ముంబాయి వంటి ప్రాంతాల్లో కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. 2020 నాటికి మొత్తం హోటళ్ల సంఖ్యను ఇరవైకి పెంచాలన్నది మా లక్ష్యం. వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాం. ప్రస్తుతం మాకు 1145 గదులు ఉన్నాయి.
?భారత హోటళ్ల సంఘానికి గతంలో అధ్యక్షురాలిగా పని చేశారు కదా.. హోటల్ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉంటుంది
వచ్చే 15-20 సంవత్సరాల్లో హోటల్ పరిశ్రమలో వృద్ధిరేటు ఆకర్షణీయంగా ఉంటుంది. సులభ రుణాలు, అనుమతులు, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ పరిశ్రమకు 'మౌలిక సదుపాయాల' హోదా కల్పించాలి. స్థలం సమకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హోటల్ నిర్మాణం రాత్రికి రాత్రే పూర్తయ్యే పని కాదు. ఆర్థిక మాంద్య ప్రభావం నుంచి హోటల్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున గదులకు ఇబ్బంది లేక పోయినప్పటికీ భవిష్యత్తులో సరఫరా గిరాకీల మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. గుర్తింపు పొందిన హోటళ్లలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 1,30,000 గదులు ఉన్నట్లు అంచనా. ఆర్థిక వ్యవస్థ 8 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నందున గదుల అవసరం బాగా పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొత్తగా ఎన్ని గదులు అందుబాటులోకి వస్తాయో చెప్పలేను.
?గదుల భర్తీ, గదుల సగటు ఆదాయం ఎలా ఉంది
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గదుల భర్తీ సగటున 60 శాతం మించి లేదు. గదుల సగటు ఆదాయం నగరానికి, నగరానికి మధ్య తేడా ఉంటుంది. దాని గురించి మాట్లాడలేను.
? మన దేశంలో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడల వల్ల హోటల్ పరిశ్రమకు జరిగే మేలు..
విలాసవంతమైన హోటళ్లకు వీటి వల్ల ఎంత ఆదాయం లభిస్తుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఢిల్లీలోని హోటళ్లకు తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది.
? హైదరాబాద్ పార్క్ హోటల్ ప్రత్యేకతలు ఏమిటి
ప్రతి పార్క్ హోటల్‌కు ప్రత్యేక భావన (థీమ్) ఉంటుంది. ఏ రెండు హోటళ్లు ఒకే విధంగా ఉండవు. చెన్నై హోటల్‌ను జెమినీ ఫిలిమ్ స్టూడియోలో నిర్మించాం. అందుకే దాన్ని 'ఫిలిమ్ థీమ్'తో రూపొందించాం. హైదరాబాద్ నగలకు, దమ్ బిర్యానీ వంటి వంటకాలకు ప్రసిద్ధి. అందుకే నగల భావనతో 'పార్క్ హైదరాబాద్'ను డిజైన్ చేశాం. కెంపులు, పచ్చలు, నీలమణి వంటి విలువైన రాళ్ల రంగులతో ఒక్కొక్క అంతస్తును డిజైన్ చేశాం. గదులు నగల పెట్టెలను పోలి ఉంటాయి. ప్రతి భాగంలో హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు, నిర్మాణ రూపకర్తలు హోటల్‌ను రూపొందించారు. మొత్తం 270 గదులు, సూట్లు ఉన్నాయి. సింగిల్ గది అద్దె రోజుకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది. లీడ్ (లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ డిజైన్) గోల్డ్ ధ్రువీకరణను పొందిన తొలి హోటల్ ఇది. 30 శాతం విద్యుత్, 40 శాతం నీరు ఆదా అవుతుంది.