Wednesday, April 21, 2010

ద్రవ్యోల్బణ కట్టడికే ప్రాధాన్యం

వూహించినట్లే వార్షిక ద్రవ్య విధాన ప్రకటనలో ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసే దిశగా అడుగులేసిన ఆర్‌బీఐ కీలక రేట్లను స్వల్పంగా పెంచి సరళ విధానానికి తెరదించింది. నగదు నిల్వల నిష్పత్తిని 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచడం ద్వారా దాదాపు రూ.12,500 కోట్ల దాకా నిధులు బ్యాంకుల నుంచి ఆర్‌బీఐకు చేరుతాయి. తత్ఫలితంగా ఆ మేరకు బ్యాంకుల వద్ద రుణవితరణ నిమిత్తం నిధులు అందుబాటులో ఉండవు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే ప్రయత్నంలో భాగంగా ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ని స్వల్పంగా పెంచినప్పటికీ బ్యాంకుల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నాయి. తొలి త్రైమాసికంలో రుణగిరాకీ అంతగా పెరిగే అవకాశాలు లేవు. ఈ పెంపు వల్ల బ్యాంకులకు నిధుల కొరత ఏర్పడే అవకాశం లేదు. రెపో రేటును, రివర్స్‌ రెపో రేటును కూడా పావుశాతం చొప్పున పెంచింది. ముఖ్యంగా ఈ కీలక రేట్ల పెంపు వల్ల ద్రవ్యోల్బణాన్ని అరికట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.5 శాతానికి మించకుండా చూడాలన్నది ఆర్‌బీఐ ప్రయత్నం. ఓ వైపు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటూ మరోవైపు వృద్ధిరేటును మరింత పెంచే దిశలో ఆర్‌బీఐ గవర్నర్‌ పలు చర్యలు చేపట్టారు. బ్యాంకులు వివిధ రంగాలకు రుణవితరణ పెంచే దిశలో పలు చర్యలు తీసుకున్నారు.

వడ్డీరేట్లు స్వల్పంగా పెరుగుతాయి కానీ..: సీఆర్‌ఆర్‌, రెపో రేట్ల పెంపు సాధారణంగా బ్యాంకుల వడ్డీరేట్ల పెంపుకు దారితీస్తాయి. కిందటి నెలలో ఆర్‌బీఐ రెపో,రివర్స్‌ రెపో రేట్లను పెంచినప్పటికీ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచలేదు. అయితే సమీప భవిష్యత్తులో బ్యాంకులు వాటి వడ్డీరేట్లను స్వల్పంగా పెంచే అవకాశముంది. పొదుపు ఖాతాలపై వడ్డీ లెక్కకట్టే విధానంలో మార్పుల వల్ల వాటిపై అదనంగా ఆర్థిక భారం పడటంతో పాటు చాలా బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్‌బీఐ కీలకరేట్ల పెంపు ప్రభావం బ్యాంకుల వడ్డీరేట్లపై ఉంటుంది. కొన్ని బ్యాంకులు జులై నుంచి అమలుకానున్న 'బేస్‌రేటు' వడ్డీ విధానాన్ని పరిగణనలోకి తీసుకొని జూన్‌ నాటికి వడ్డీరేట్లు పెంచే అవకాశముంది. ఏది ఏమైనా వడ్డీరేట్లు స్వల్పంగానే పెరుగుతాయి.