Thursday, April 29, 2010

తస్మాత్‌ జాగ్రత్త!

ముదురుతున్న గ్రీస్‌ సంక్షోభం
స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీలకూ ముప్పు!
గడ్డు స్థితిలో ఐరోపా దేశాలు
కుప్పకూలిన ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు
సెన్సెక్స్‌ పతనం 300 పాయింట్లు పైనే
మదుపర్లూ.. అనవసర ఖర్చులకు దూరం జరగండి
బంగారం, వెండి కొనుగోలు శ్రేయస్కరం
మొన్నటి ఆర్థిక సంక్షోభం ఛాయలు చెరిగిపోక ముందే.. మాంద్యం చీకట్లు పూర్తిగా తొలగిపోకముందే.. 'గ్రీస్‌ సంక్షోభం' ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఒకదానివెంట ఒకటి పతనానికి సిద్ధంగా ఉన్న కొన్ని 'ఐరోపా దేశాల' ఆర్థిక వ్యవస్థలు కలకలం పుట్టిస్తున్నాయి. ఒక దేశాన్ని నిలబెట్టాలంటే లక్షల కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఇదెంతవరకు సాధ్యం..? ఈ తాజా సంక్షోభం ఏ స్థాయికి తీసుకెళ్తుంది...? ఇప్పుడివే ప్రధాన ప్రశ్నలు.
- ఈనాడు వాణిజ్య విభాగం
పేరుకు అది చిన్న దేశమే. కానీ.. అక్కడ మొదలైన రుణ సంక్షోభం మాత్రం చిన్నది కాదు. గత కొన్ని నెలలుగా ఇంతలింతలవుతున్న ఈ దావానలం ఇపుడు తీవ్ర రూపు దాల్చింది. అది క్రమంగా ఐరోపా దేశాలకూ పాకి ఆర్థిక వ్యవస్థలను మరింత నిర్వీర్యం చేసే ప్రమాదముందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. బుధవారం ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలడం ఇందుకు తాజా ఉదాహరణ. డాయిష్‌ బ్యాంకు అయితే చావు ముంచికొచ్చే పరిస్థితిగా అభివర్ణించడం సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది.
ఇతర దేశాలకూ విస్తరిస్తోందా?
గ్రీసు దేశానికున్న మోయలేని అప్పుల ప్రభావం పోర్చుగల్‌కు పాకుతోంది. తాజాగా ఎస్‌&పీ రేటింగ్‌ ఆ దేశానికీ తగ్గడం దీనిని సూచిస్తోంది. రాజకీయ, ఆర్థిక నాయకులు జాగ్రత్తగా లేకపోతే ఈ సంక్షోభం మార్కెట్లో భయాందోళనలను రాజేస్తుంది. అప్పుల భారం ఎక్కువగా ఉన్న దేశాలనూ ఇది సంక్షోభంలోకి లాగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎలాగంటే.. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం వద్ద నిధులుంచిన పెట్టుబడిదార్లు డబ్బులు వెనక్కి ఇవ్వమని కోరతారు. అపుడు ఆ ప్రభుత్వం మరింత ఎక్కువ వడ్డీ రేట్లకు అప్పులు తెచ్చి ఈ అప్పు తీర్చాల్చి ఉంటుంది. ఇలా అప్పులు పేరుకుపోయి చివరకు అటు ప్రభుత్వం, ఇటు పెట్టుబడిదార్ల వద్ద మిగిలేది ఏమీ ఉండదు. కుప్పలకొద్దీ అప్పులు తప్ప. అపుడు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలతాయ్‌. ఈ ప్రమాదం చిన్న దేశాలకే ఉందనుకుంటే పొరబాటు. స్పెయిన్‌, బ్రిటన్‌లతో పాటు అమెరికాకూ ఉండడం గమనార్హం.

బయటపడే మార్గం దిశగా అడుగులు
సంక్షోభాల అల తగ్గుముఖం పట్టే సూచనలూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమోదించిన సహాయ ప్యాకేజీని యూరోపియన్‌ యూనియన్‌ గ్రీసుకు అందజేస్తే ఈ సంక్షోభానికి త్వరగా తెర వేయవచ్చు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి బెర్లిన్‌లో జర్మనీ రాజకీయ నాయకులు, అధికార్లతో ఐఎమ్‌ఎఫ్‌ అధిపతి డొమినిక్‌ స్ట్రాస్‌ కాన్‌ గ్రీసు సంక్షోభంపై చర్చించారు. అయితే ఇప్పుడే ఇంకా సహాయ ప్యాకేజీకి తుది రూపునివ్వలేదని ఆయన సమావేశం అనంతరం వెల్లడించారు. మరో పక్క అంతర్జాతీయ ప్యాకేజీ విలువ 100-120 బిలియన్‌ డాలర్ల వరకూ పెరగొచ్చని ఓ జర్మనీ చట్టసభ్యుడు అభిప్రాయపడడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఐరోపా, ఐఎమ్‌ఎఫ్‌ల నుంచి 45 బిలియన్‌ యూరోల(రూ.2,60,000 కోట్లు)ను సహాయంగా అడిగిన సంగతి తెలిసిందే.

ప్రపంచ మార్కెట్లు ఇలా పడ్డాయ్‌
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూంటే గ్రీస్‌ దేశ భవిష్యత్‌ అంచనాను 'చెత్త'(జంక్‌)గా రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌&పూర్స్‌ తేల్చి చెప్పడంతో అగ్గిరాజుకుంది. ప్రపంచ మార్కెట్ల సూచీ ఎమ్‌ఎస్‌సీఐ 0.9 శాతం పడింది. అంతక్రితం మంగళవారం ఇది 3 శాతం పతనమైంది. అంతక్రితం రోజు 3.1 శాతం పడ్డ ఐరోపా మార్కెట్‌ (ఎఫ్‌టీఎస్‌ఈ) బుధవారం మరో 0.7% నష్టపోయింది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 2.6% కుదేలైంది. 8 వారాలుగా పెరుగుతూ వస్తున్న అమెరికా మార్కెట్లు మంగళవారం ఒక్కసారి కుదేలయ్యాయి. డోజోన్స్‌ మూడు నెలల కనిష్ఠ స్థాయి 10,991కి పతనమైంది.

మన మార్కెట్లకూ 'గ్రీసే'
భారత మార్కెట్లనూ గ్రీసు సంక్షోభం విడిచిపెట్టలేదు. గ్రీసు, పోర్చుగల్‌ దేశాల రేటింగ్‌ దిగజారడం ఇక్కడి మార్కెట్లకు శాపమైంది. అంతక్రితం రోజు డోజోన్స్‌ పతనం పూర్తి ప్రభావం చూపింది. ఒక్కసారిగా సెన్సెక్స్‌ దాదాపు నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. 310 పాయింట్లు కోల్పోయి 17,380.08 వద్ద స్థిరపడింది. ఒక దశలో 17,344.58 వద్ద కనిష్ఠ స్థాయినీ తాకింది. మదుపర్లు బుధవారం ఒక్కరోజే రూ.41,000 కోట్లు కోల్పోయారు.మరో పక్క గురువారం(నేడు)డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు తీరనుండడం కూడా కొంత ప్రతికూలంగా నిలిచింది. అంచనాల కంటే తక్కువగా ఫలితాలను ప్రకటించడంతో కొన్ని కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో 4.16% నష్టపోయి రూ.1,017కు పరిమితమైంది. ఐసీఐసీఐ బ్యాంకు 2.93% పోగొట్టుకుని రూ.918.65 వద్ద నిలిచింది. మొత్తం 13 బీఎస్‌ఈ సూచీలూ కుంగాయి. సెన్సెక్స్‌లోని 30 స్క్రిప్‌లలో 25 నేల చూపులు చూశాయి. ఇతర నష్టపోయిన షేర్లలో జైప్రకాశ్‌ అసోసియేట్స్‌(4.48%), టాటా స్టీల్‌(3.52%), డీఎల్‌ఎఫ్‌(3.17%), టాటా మోటార్స్‌(3%) ఉన్నాయి. అయితే సన్‌ఫార్మా, ఏసీసీ, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐలు మాత్రం స్వల్ప లాభాలు పొందాయి.

రోమారు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రీస్‌ రూపంలో తాజా ముప్పు ఉప్పెనలా ముంచుకొచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ కుంగదీసేదిలా కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం యూఎస్‌, ఐరోపా దేశాల్లో కంపెనీలు, బ్యాంకులు దివాలాతో సంక్షోభం తలెత్తితే.. ఇప్పుడు ప్రభుత్వాలు అప్పుల పాలై ఈ ముప్పును కొనితెస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం లాటిన్‌ అమెరికా దేశాలు ఎదుర్కొన్న స్థితినే ఇప్పుడు ఐరోపా ఎదుర్కొంటోంది. గ్రీస్‌, ఇటలీ, స్పెయిన్‌ తదితర దేశాలు ఒకదానివెంట మరొకటిగా దివాలా దిశగా కదులుతున్నాయి.

కష్టాల కడలిలో ఐరోపా: గ్రీస్‌ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ ఏకంగా 'పనికిరాని (జంక్‌)' స్థాయికి దిగజార్చింది. అంటే ఆ దేశంలోని బ్యాంకులన్నీ దివాలా తీసినట్లే. అలాగే పోర్చుగల్‌ రేటింగ్‌నూ తగ్గించింది. ఇదే వరుసలో స్పెయిన్‌, ఇటలీ ఉన్నాయి. వీటిని ఒడ్డున పడేయాలంటే కనీసం 2 లక్షల కోట్ల యూరోలు (మన కరెన్సీలో 120 లక్షల కోట్ల రూపాయలు) కావాలి. గ్రీస్‌కు 'జంక్‌' రేటింగ్‌ రావడంతో ఆ దేశ బాండ్‌ మార్కెట్‌ కుప్పకూలి ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ సైతం నష్టపోతున్నాయి. రేటింగ్‌ తగ్గడంతో పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాల్లోని బ్యాంకింగ్‌ వ్యవస్థ కూలిపోయే విధంగా ఉంది. ఇబ్బంది కొన్ని ఐరోపా దేశాలకే అనుకుంటే పొరపాటే. ఇది ఆరంభం మాత్రమే. నెమ్మదిగా ఇతర ఐరోపా దేశాలకు, జపాన్‌, అమెరికాలకూ సంక్షోభం విస్తరిస్తుంది. అప్పుల భారమే ఈ స్థితికి ప్రధాన కారణం. ఐరోపా దేశాలు వచ్చే ఏడాది వ్యవధిలో 1.6 లక్షల కోట్ల (దాదాపు రూ.96 లక్షల కోట్ల) అప్పు తీర్చాల్సి ఉంది. గ్రీస్‌ వచ్చే మూడేళ్ల పాటు ఏటా 5000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్ల) అప్పు చేయకపోతే బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. ఐరోపా దేశాల ఆర్థిక లోటు (గ్రీస్‌కు 13.6 శాతం, పోర్చుగల్‌ 9.4 శాతం, స్పెయిన్‌ 12 శాతం, బ్రిటన్‌ 11.5 శాతం) అంతులేని స్థాయికి పెరిగిపోయింది. ఐరోపాలో మొదలైన సమస్యను తక్షణం కట్టడి చేయకపోతే కష్టమే. ఎందుకంటే ఈ దేశాల మధ్య మూలధన మార్పిడికి ఆంక్షలు లేవు. దీనివల్ల మూలధనం వేగంగా ఆయా దేశాల నుంచి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇంకా అంతులేని సంక్షోభంలో ఆయా దేశాలు చిక్కుకుపోతాయి.

అమెరికా, చైనా: అమెరికా తాను సృష్టించుకున్న కష్టాల్లో పీకల్లోతు మునిగిపోయి ఉంది. నిరుద్యోగం పెద్ద సమస్య. ఫలితంగా ఎంతోమంది ఇళ్లు అమ్ముకోవలసి వస్తోంది. అక్కడి పౌరుల వ్యక్తిగత ఆదాయం క్షీణిస్తూనే ఉంది. పైగా అమెరికా ప్రభుత్వం చేస్తున్న అప్పులు భయాందోళన కలిగిస్తున్నాయి. అవి తీర్చలేనంతగా పెరిగిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా కష్టాలను అడ్డుకోగలదని భావిస్తున్న చైనా కూడా ఇబ్బందుల్లో ఉంది. చైనా రియల్‌ఎస్టేట్‌ గాలి బుడగ ఏక్షణంలోనైనా పేలిపోనుంది. 2009లో చైనా బ్యాంకులు 1.4 ట్రిలియన్‌ డాలర్ల ఇంటిరుణాలు మంజూరు చేశాయి. ఈ మొత్తం భారత స్థూల ఆదాయం కంటే ఎక్కువ. ద్రవ్యోల్బణం చైనాలో అదుపులేని స్థాయిలో ఉంది. అతిజాగ్రత్తకు పోయి చైనా పెద్దఎత్తున సరుకులు, బొగ్గు, రాగి వంటి ముడిపదార్ధాలు పెద్దఎత్తున దిగుమతి చేసుకుంది. దీంతో నిల్వలు పేరుకుపోయాయి. దీనికి పరిష్కారంగా వడ్డీ రేట్లు పెంచాలి. అందుకే చైనాలో షేర్లు, రియల్‌ ఎస్టేట్‌ ధరలు పతనం అవుతున్నాయి.

మనదేశం మాటో..: మనదేశంలో ఇప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేదు. మనకు అతిపెద్ద వర్తక భాగస్వామి అయిన చైనా సమస్యల పాలయితే మనకూ ఇబ్బందులు తప్పవు. యూరో జోన్‌, అమెరికా ఇతర అతిపెద్ద వర్తక భాగస్వాములు. ఈ మూడుచోట్లా కష్టాలు చోటుచేసుకుంటే మనదేశానికి అంతా బాగుంటుందని భావించడానికి వీల్లేదు. కాకపోతే ఈ దేశాలతో పోలిస్తే మన స్థితి కాస్త ఫర్వాలేదు. చమురు ధరలు పెరుగుతుండటం మనకు ఇబ్బందికరమైన పరిణామం. దీనివల్ల సబ్సిడీ భారం రూ. లక్ష కోట్లకు పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీరేట్లు పెంచాల్సి వస్తుంది. అదే జరిగితే అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్లకు పెనుభారమే. ప్రస్తుతం విదేశీ సంస్థాగత పెట్టుబడులు (హాట్‌ మనీ) పెద్దఎత్తున మనదేశానికి వస్తున్నాయి. ఇది కూడా ప్రమాదమే. అవి ఎప్పుడు వెనక్కి వెళ్లిపోతాయో అంచనా వేయలేం. ప్రతిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కృషి చేయాలి. రిటైల్‌, బీమా, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో ఎఫ్‌డీఐలను ఇంకా అనుమతించాలి. దేశీయంగా బలమైన బాండ్‌ మార్కెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల స్థితిపై కన్నేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కంపెనీలైనా, మదుపుదార్త్లెనా ప్రస్తుత పరిస్థితుల్లో అనవసర ఖర్చులు, విస్తరణల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ధరలు తగ్గినప్పుడల్లా బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉండటం మదుపుదార్లకు క్షేమకరంగా కనిపిస్తోంది.

- కె. కృష్ణంరాజు, క్రిసాని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఎండీ