ప్రధానికి మురళీదేవ్‌రా వినతి
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న చమురు కంపెనీలను గట్కెక్కించేందుకు, పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసేందుకు మంత్రుల సాధికారిక కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి మురళీ దేవ్‌రా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. ఉత్పత్తి ధరకంటే తక్కువకు పెట్రోల్, డీజిల్‌ను అమ్మడం వల్ల చమురు కంపెనీలకు రోజుకు రూ.265 కోట్ల నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం దేవ్‌రా ప్రదానికి ఒక లేఖ రాశారు. ఉత్పత్తి ధరకన్నా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, కిరోసిన్‌ను తక్కువగా అమ్మడం వల్ల ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ తదితర కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.87,440 కోట్ల నష్టాలు మూటగట్టుకోనున్నాయని మంత్రి లేఖలో వివరించారు. నష్టాల నుంచి చమురు కంపెనీలను గట్టెక్కించేందుకు కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడకపోవడంతో.. మంత్రుల కమిటీ ఏర్పాటుదిశగా చర్యలు తీసుకోవాలని దేవ్‌రా ప్రధానికి రాసిన లేఖలో విన్నవించారు. పెట్రో ధరలు తగ్గించం.. కేంద్రం: పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్‌పీజీ ధరల్ని తగ్గించే ప్రసక్తేలేదని మరోవైపు కేంద్రం రాజ్యసభలో స్పష్టంచేసింది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు 2008 డిసెంబరు నుంచి ఒక్కసారిగా చుక్కల్ని తాకడం, ఆర్థిక మాంద్యం, దేశీయంగా చమురు వినియోగం పెరగడం వంటి కారణాల వల్ల పెట్రో ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్రమంత్రి జితిన్ ప్రసాద రాజ్యసభలో వెల్లడించారు.