తప్పుడు వివరాలిస్తే అంతే సంగతులు
ప్రధాని అవార్డు అందుకున్న తెలుగువాడు

ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల్లో ఎన్ని లావాదేవీలు నిర్వహించినా వాటిని క్రోడీకరించి ఓ పద్దు కిందకు తేవడం ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత. దీన్ని ఇంటిగ్రేటెడ్ టాక్స్‌పేయర్ డేటా మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీడీఎంఎస్)గా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఐటీ శాఖలో కోట్లాది మందికి సంబంధించిన వివరాలతో భారీ డేటా ఉంటుంది. నిరంతరం ఎంతో సమాచారం ఈ విభాగానికి అందుతూ ఉంటుంది. ఇలా ఇబ్బడిముబ్బడిగా వచ్చే డేటాలోంచి ప్రతి వ్యక్తి అతని ఆదాయ పన్ను రిటర్న్‌లను సరిగా పొందుపర్చాడా? లేదా? అతను ఏడాదిలో పెట్టిన ఖర్చు ఎంత? ఆదాయం ఎన్ని మార్గాల్లో వస్తోంది... తదితర విషయాల్ని గుర్తించటం చాలా కష్టం. స్టాక్ ఎక్స్ఛేంజీ లావాదేవీలు, ఆదాయ వనరులు, బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డు కార్యకలాపాలు, ఇలా ఎన్నో అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఓ వ్యక్తి రిటర్న్స్‌ను దాఖలు చేసినప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఏళ్ల నుంచి జరుగుతున్నదే. కానీ సమస్య ఏమిటంటే అందుకున్న సమాచారాన్ని సరిపోల్చటం పెద్ద సమస్య. ఓ వ్యక్తికి సంబంధించిన ఆస్తులు ఒకచోట, వ్యాపార కార్యకలాపాలు మరో చోట, బ్యాంకు వ్యవహారాలు పలు ప్రాంతాల్లో చేస్తూ ఉండొచ్చు. ఉదాహరణకు క్రెడిట్ కార్డు మీద దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి... తన ఆదాయాన్ని మాత్రం రూ.లక్ష మాత్రమే చూపించిన వ్యక్తులను గుర్తించటం ఎలా? అన్నది ఓ సమస్య. ఈ తరహా సమస్యల్ని కొత్త సాఫ్ట్‌వేర్ పరిష్కరిస్తుందని వెంకటేశ్వర్లు చెప్పారు. పాన్‌కార్డ్ ద్వారా ఐటీ శాఖ ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక నెంబరు కేటాయిస్తుంది. కానీ చాలామంది తమ వ్యాపార లావాదేవీల్లో పాన్ నెంబర్‌ను తప్పుగా రాస్తుంటారు. ఇలాంటి ఇబ్బందుల్ని ఈ సాఫ్ట్‌వేర్ అధిగస్తుంది.
ఎలా పని చేస్తుందంటే?: ఓ వ్యక్తి తన పేరును మార్చి రాయటం, లేదా షార్ట్‌కట్ పేరుతో కొన్ని లావాదేవీలు జరిపినా ఈ సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. ఉదాహరణకు జి.వేణుగోపాల్ అనే పేరుతో వివిధ రకాలతో బ్యాంక్ అకౌంట్లు తెరిచినా, క్రెడిట్ కార్డులు, మొబైల్ కనెక్షన్లు తీసుకున్నా... అలాంటి వాటన్నింటికీ ఒకేచోటకు తీసుకొస్తుంది. ప్రతి వ్యక్తి తన పేరుతో పాటు తండ్రి పేరును నమోదు చేస్తారు. వ్యక్తి పేరు, తండ్రి పేరును పోల్చుకొని ఈ సాఫ్ట్‌వేర్ ఆ వ్యక్తి వార్షిక లావాదేవీల్ని బయట పెట్టేస్తుంది. ఇవే కాకుండా మరికొన్ని వివరాలను కూడా సమీకరించి వాటి ద్వారా వ్యక్తుల ఆదాయ, వ్యయాలను ఒక్క క్లిక్‌తో క్రోడీకరిస్తారు. పన్ను ఎగవేసినా, తప్పుడు వివరాలు అందించినా పట్టుకోవటం చాలా తేలిక'ని ఆయన వివరించారు.
ప్రయోగాత్మకంగా...: ఈ సాఫ్ట్‌వేర్ రూపకల్పన కోసం వివిధ దేశాల్లో పన్ను ఎగవేతదారుల్ని గుర్తిస్తున్న విధానాలపై అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. తరువాత ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో అమలు చేసి పరిశీలించారు. కొత్తగా దీనిని ప్రవేశ పెట్టడం ద్వారా దేశంలోని 20 డైరెక్టరేట్‌లలో 30 కోట్ల మంది డేటాను ఇది పరిశీలిస్తుంది. మరో విశేషం ఏంటంటే.. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఓ కార్యాలయంలో ఏర్పాటు చేయటానికి కేవలం రూ.2.50 లక్షలు మాత్రమే ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు.