Friday, April 23, 2010

ఇక పల్లెల సంగతి చూద్దాం... మారుతీ సుజుకీ, హ్యుండాయ్‌, జీఎంల వ్యూహం

విక్రయాలు పెంచుకొనేందుకు ప్రణాళికలు
త కొంత కాలంగా భారత్‌లో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల విక్రయాలు ఝామ్మంటూ దూసుకుపోతున్నాయి. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే కోటీ ఇరవై లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించి భారత వాహన ఉత్పత్తి పరిశ్రమ సంచలనం సృష్టించింది. ఇందులో ప్యాసింజర్‌ కార్ల విభాగంలో 15.26 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు అయ్యాయి. వీటిలోనూ నాలుగింట దాదాపు మూడు వంతులు చిన్న కార్ల మోడళ్లే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాలలో ఆటోమొబైల్‌ విక్రయాలు గణనీయంగా పుంజుకొన్నాయంటున్నారు. ప్రస్తుతానికి ప్రయాణికుల కార్ల విభాగంలో పల్లె ప్రాంతాల కొనుగోళ్ల వాటా 30 శాతం కన్నా కొద్దిగా ఎక్కువగా ఉందని, మరో రెండేళ్లలో ఇది 40 శాతానికి చేరుకొనే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత వాహన ఉత్పత్తిదారుల సంఘం (సియామ్‌) కూడా వాహన విపణి 12- 14 శాతం చొప్పున దూసుకుపోగలదని చెప్తోంది.

పల్లె భారతి ఆశల పందిరి
భారత దేశంలో ప్రతి నూటికి డెబ్భై మంది ఇంకా గ్రామ ప్రాంతాలలో నివసిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఛాయలు గ్రామీణ భారతాన్ని ఏమంత పెద్దగా కమ్ముకోలేదు. కేంద్రం తన ప్రధాన పథకాల్లో భీమ భాగాన్ని గ్రామ ప్రాంతాలకు కేటాయించడమే కాక ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా కల్పిస్తూంది. పైగా, గ్రామాల్లో ఆర్థిక స్తోమత మెల్లగా ఎగబాకుతూంది. గ్రామీణుల వద్ద చేతిలో ఆడే డబ్బు పెరుగుతూంది. మహా నగరాల్లో డిమాండును ఇదివరకే ఒడిసిపట్టిన వివిధ కంపెనీలు తమ విస్తరణ పథకాల అమలు వ్యూహంలో భాగంగా ఇక పల్లె ప్రాంతాలకేసి దృష్టిని సారిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధికి గ్రామాలలో మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించి, ఆ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొంటున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుండాయ్‌మోటార్స్‌ వంటి కొన్ని కంపెనీలు అవి కొంత కాలంగా సాధిస్తున్న అమ్మకాల్లో గ్రామాల వాటా గణనీయంగా ప్రతిఫలిస్తున్నట్లు మార్కెట్‌ పరిశీలక వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయంలో తమ వాదనకు మద్దతుగా నిలచే గణాంకాలను కూడా ఈ వర్గాలు నిదర్శనంగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు మారుతీ ఆమ్ని, ఆల్టో, వ్యాగన్‌ఆర్‌, ఎస్టిలోలకు తోడు, జీఎం కంపెనీ చిన్న కారు బీట్‌, హ్యుండాయ్‌ ఐ10ల వంటి వాహనాలకు గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ కనపడుతోంది.

బ్యాంకులదీ అదే దోవ..
బ్యాంకులు కూడా తమ కొత్త శాఖలను గ్రామాలలో నెలకొల్పుతున్నాయి. కేంద్రం పదే పదే చెప్తున్న ఆర్థిక సంఘటితం (ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌) విధానం కూడా ఈ ధోరణి పెరుగుతూ ఉండడానికి ఒక కారణం అవుతోంది. రుణాలు సులభంగా లభించడానికి బ్యాంకుల విస్తరణ ఉపయోగపడుతోంది. వెరసి వాహన విక్రయాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. కొనుగోలు శక్తి పెరగడం అనేది అంతిమంగా వస్తూత్పత్తి వృద్ధి రేటులో ప్రతిఫలిస్తుంది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత ఆర్థిక సంవత్సరానికి 7.2 శాతం వృద్ధి రేటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.