Thursday, April 29, 2010

ఒకదాని వెంట మరొక ఇష్యూ దూసుకొస్తున్నాయ్‌

ఇన్వెస్టర్లలో మాత్రం అనాసక్తి
గిట్టుబాటు లేకపోవడమే ప్రధాన కారణం
కొత్తగా నమోదవుతున్న ఇష్యూలకు రిటైల్‌ మదుపర్లు దూరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల నమోదైన కంపెనీల్లో ఎక్కువ భాగం నష్టాల్లో కదలాడుతుండడం వారిని ఆలోచింపజేస్తోంది. ఈ నెలలో స్టాక్‌ మార్కెట్లో అయిదు ఇష్యూలు నమోదయ్యాయి. ఇందులో 4 కంపెనీల షేర్ల ధరలు ఇష్యూ ధర కంటే దిగువనే ఉండడం గమనార్హం.ఇక ఈ వారంలో వస్తోన్న మరో ఐదు ఇష్యూలకు స్పందన ఏ మాత్రం ఉంటుందన్న సంగతి తెలియాల్సి ఉంది (ఇప్పటికే ఒక ఇష్యూకు అంతంత మాత్రం స్పందన లభిస్తోంది).

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ప్రదీప్‌ ఓవర్సీస్‌, శ్రీ గణేశ్‌ జువెలరీ హౌస్‌, ఇంట్రాసాఫ్ట్‌ టెక్నాలజీస్‌, గోయెంకా డైమండ్‌&జువెల్స్‌.. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇష్యూధర కంటే తక్కువ ధరలవద్ద ట్రేడవుతున్నాయి. ఒక్క పర్సిస్టెంట్‌ సిస్టమ్‌ మాత్రమే 29% పైగా లాభంతో ఉంది.

కారణాలేమిటి: మదుపర్లు కొత్త లిస్టింగ్‌ల పట్ల నిరాసక్తతను ప్రదర్శించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే తాజా ఇష్యూలు పెద్దగా పనిచేయకపోవడమే కాదు.. ఇష్యూల ధరలు ఉండాల్సిన దాని కంటే అధికంగా ఉండడం(ఓవర్‌ప్రైసింగ్‌) కూడా మరో కారణమని మర్చంట్‌ బ్యాంకర్లు చెబుతున్నారు.

ఇటీవల వచ్చిన ఇష్యూలు అనుకూలంగా లేకపోవడానికి వాటి పారిశ్రామిక నేపథ్యం ఆకర్షణీయంగా లేకపోవడం కూడా కారణమేనని అంటున్నారు. ఇది మదుపర్లు ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించేలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా ఇష్యూల్లో శ్రీ గణేశ్‌ జువెలరీ, గోయెంకా డైమండ్‌లు ఆభరణాల రంగానికి చెందినవి. ఈ రంగం సాధారణంగానే మార్కెట్‌ను తక్కువగా ఆకర్షిస్తుంది. ఇక ప్రదీప్‌ ఓవర్సీస్‌ ఓ జౌళి కంపెనీ కావడం ప్రతికూల అంశంగా మారింది. ఎందుకంటే బలపడుతున్న రూపాయి సహజంగానే ఈ రంగాన్ని దెబ్బకొడుతుందన్న భావన వారిలో ఉంటుంది.ఈ రెండు రంగాల్లోని చాలా కంపెనీల షేర్లు ఇంకా చౌకగా లభిస్తుండడం కూడా నిరాసక్తతకు దారితీసింది.

హెచ్‌ఎన్‌ఐల మాయాజాలం: ఓవర్‌ప్రైసింగ్‌ కారణంగానే కొత్త ఇష్యూలు సరిగ్గా పనిచేయలదన్నది కొంతమంది బ్యాంకర్ల అభిప్రాయం. మరో పక్క అధిక నికర విలువ గల వ్యక్తులు(హెచ్‌ఎన్‌ఐ) నమోదు రోజున ఇష్యూ నుంచి బయటపడడం కూడా షేర్ల ధరలపై ఒత్తిడి పెంచేదేనని బ్యాంకర్ల భావన. ఇది ఆయా ఇష్యూల స్పందన గణాంకాలను చూస్తే ఇట్టే తెలిసిపోతుందంటున్నారు. హెచ్‌ఎన్‌ఐలు భారీ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్‌ చేయగా.. రిటైల్‌ వర్గాలది నామమాత్రంగా ఉంది. ఉదారహణకు గోయెంకా డైమండ్‌&జువెల్స్‌కు సంస్థాగతేతర స్పందన 2.7 రెట్లుగా ఉండగా.. రిటైల్‌ స్పందన కేవలం 0.5 శాతం రెట్లుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇది ఇష్యూ ధర కంటే 19% తక్కువ వద్ద ఉంది. గణేశ్‌ జువెలర్స్‌ ఇష్యూకు కూడా సంస్థాగతేతర స్పందన 3.9 రెట్లు; క్యూఐబీల స్పందన 1.4 రెట్లు ఉండగా.. రిటైల్‌ వర్గాల నుంచి 1.2 రెట్లుగానే ఉంది. ఇది అన్ని ఇష్యూల కంటే ఘోరంగా 45%పైగా నష్టంతో రూ.142.50 వద్ద కదులుతోంది.