Friday, April 23, 2010

'రియల్' దెబ్బ: హెచ్ఎండిఎ కొంప ముంచిన కోకాపేట

హైదరాబాద్, ఏప్రిల్22(): కోకాపేట కొంప ముంచింది. కో.. అంటే కోట్లు పలికించిన కోకాపేట... కరెంటులా షాకిచ్చింది. ఒక్క దెబ్బతో...హెచ్ఎండీఏ బిక్కమొహమేసింది. డెవలపర్స్ చెల్లించిన దాదాపు రూ.450 కోట్లు మూడు నెలల్లో వాపస్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో తలపట్టుకోవడం అధికారుల వంతైంది. మూడునెలల్లో చెల్లింపులు చేయకపోతే 9శాతం వడ్డీ రేటుతో డబ్బులు చెల్లించిన తేదీ నుంచి లెక్క కట్టి ఇవ్వాలని జస్టీస్ ఎల్.నరసింహారెడ్డి సంచలన తీర్పు ఇచ్చారు.

అధికారులు ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా హెచ్ఎండీఎ వద్ద భూములు కొనుగోలు చేసిన ఇతర సంస్థలు కూడా ఇప్పటికే తమకు భూములు వద్దు.. డబ్బులు ఇవ్వమని ఆర్జీలు పెట్టాయి కాగా ఆయా సంస్థల ప్రతినిధులు కూడా కోకాపేట కేసును ఆదర్శంగా తీసుకొని కోర్టును ఆశ్రయించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

n బూమ్ సృష్టించింది కోకాపేటే...
కోట్లు పలికించిన కోకాపేట.. ఇప్పుడు హెచ్ఎండీఏను భూతంలా పట్టి పీడిస్తోంది. ఔటర్ చుట్టూ నవరత్నాలంటూ అప్పటి హుడా భారీ బ్రోచర్ వేసి మరీ ప్రచారం నిర్వహించింది. ఔటర్‌రింగ్ రోడ్డు చుట్టూ భారీ ఎత్తున భూములు సొంతం చేసుకున్న రియల్ పెద్దలు... పకడ్బందీగా బూమ్‌ను సృష్టించాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించిన వాళ్లు కోకాపేటలో హుడా ద్వారా భూముల వేలంపాట నిర్వహించేలా చేశాయి. కోట్ల రూపాయలు వస్తాయని ఆశించిన హుడా ... గోల్డెన్ మైన్ అంటూ వేలం పాట నిర్వహించింది.

100 ఎకరాల భూమికి జూలై2006లో వేలం పాటలు నిర్వహించగా... హుడా ఆర్భాటపు ప్రచారానికి దాదాపు 15 కంపెనీలు కోకాపేట భూమిని కొనుగోలు చేశాయి. ఇందులో ఒక కంపెనీ ఏకంగా ఎకరానికి రూ.14 కోట్లు చెల్లించింది. ఈ భూమి మొత్తాన్ని దాదాపు 15 కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో ఒక్క కంపెనీయే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించింది. మిగిలిన కంపెనీలు 50 శాతానికి పైగా చెల్లించాయి.

n అడ్డంగా ఇరుక్కున హెచ్ఎండీఏ
అప్పటి వరకు మామూలుగా ఉన్న భూముల రేట్లు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. శివారు ప్రాంతాలలో ఏరియాను బట్టి గజం భూమి ధర రూ.10,15,20 వేల రూపాయలకు చేరుకుంది. తుఫానులా వచ్చిన బూమ్ అదే ఏడాది చివరి నాటికి వెనుకడుగేసింది. అది కాస్త 2007 చివరి నాటికి రివర్స్‌గేర్‌లో పడింది. కోట్లు పెట్టి భూములు కొన్న వాళ్లు డోలాయమానంలో పడ్డారు. ముందు చూపు రియల్ బాబులు భారీగా సొమ్ము చేసుకున్నారు... కానీ హెచ్ఎండీఏ మాత్రం అడ్డంగా ఇరుక్కుంది.

కోకాపేటలో కోట్లు పెట్టి భూములు కొన్న బడా బాబులు తమకు భూములు వద్దు... డబ్బులు ఇవ్వమని పేచీ పెట్టారు. దీనికి భూమి యజమాన్య హక్కుల వివాదాన్ని ముందుకు తెచ్చారు. రియల్ బూమ్ తగ్గడంతో.. ఇలాంటి డిమాండ్ వచ్చిందని భావించిన అధికారులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ వివాదంపై సర్కారు సరిగ్గా స్పందించక పోవడంతో... గురువారం నాడు హైకోర్టు డబ్బులు తిరిగి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.

n సర్కారు తీరుతో...
సర్కారు తీరుతో.. భారీమూల్యం చెల్లించాల్సిన పరిస్థితి హెచ్ఎండీఏకు ఏర్పడింది. కోకాపేట భూ యజమాన్య హక్కుల విషయం తేల్చకపోవడంతోనే కోర్టు డబ్బులు తిరిగి చెల్లించాలన్న తీర్పు వచ్చిందని హెచ్ఎండీఎ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ కేసులో గతంలో హైకోర్టు హెచ్ఎండీఎకు అనుకూలంగా తీర్పు ఇస్తే... సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం కోర్టు ఈ విషయం కింది కోర్టులో తేల్చుకోమంటే... వాళ్లు తిరిగి హైకోర్టును ఆశ్రయించారని ఓ అధికారి అన్నారు. హైకోర్టు ఈ భూమి యజమాన్య హక్కులు ఎవరివో తేల్చమంటూ సర్కారునే ఆదేశించగా... ఇప్పటి వరకు స్పం దించలేదన్నారు. సర్కారు తీరు సరిగ్గా లేకపోవడంతో హెచ్ఎండీఎ రూ.450 కోట్లు ఒకేసారి నష్టపోవాల్సి వచ్చిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

n రియల్ అవతారమెత్తి...
రియల్ మాఫియా ఉచ్చులో పడిన హెచ్ఎండీఏ ఊహాలోకంలో విహరించింది. కోట్ల రూపాయలు వస్తున్నాయని... వేలం పాట పాడటమే ఆలస్యమన్నట్లు భావించిన హెచ్ఎండీఏ... నగరాభివృద్ధిని గాలికి వదలి... రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తింది. ఎడాపెడా భూముల అమ్మకానికి పాల్పడింది. 2006లో ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తిన హెచ్ఎండీఏ... చతికిలబడింది. హెచ్ఎండీఏ సృష్టించిన కృత్రిమ బూమ్‌ను చూపెట్టి... రియల్ వ్యాపారులు వేల ఎకరాలను ప్లాట్లుగా చేసి అమ్ముకొని కోట్లకు ఎదిగారు.

ఆశకు పోయిన హెచ్ఏండీఏ రియల్ మాఫియా ఉచ్చులో చిక్కుకొని బొక్క బోర్లా పడింది. దాదాపు మూడు వేల కోట్ల రూపాయల భూ ములను విక్రయించిన హెచ్ఎండీఏ కనీసం అందులో సగం కూడా రాబట్టుకోలేకపోయింది. ఆర్థికంగా చిక్కులో ఇరుక్కొంది. అప్పుల పాలై దివాళా దశకు చేరుకుంది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నా... నేడు నయాపైస చేతిలో లేని స్థితిలో హెచ్ఎండీఏ ఉంది.

n ఈ చెల్లింపులకు అప్పు చేయాల్సిందే...
కోర్టు తీర్పు అమలు చేయాలంటే... హెచ్ఎండీఏ తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితే... లేదా సర్కారు... తన ఖజానాకు అప్పు చేయించి మరి తీసుకున్న రూ.500 కోట్లనైనా వెనక్కు ఇవ్వాలి... సర్కారు ఖజానానే ఖాళీగా ఉంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితిలో లేదు... ఈ పరిస్థితిలో అప్పు చేయడం మినహా మరో మార్గం ఉండకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండడం కోసం రివ్యూ పీటిషన్ కూడా వేస్తామని అధికారులు అంటున్నారు. అలాగే డివిజన్ బెంచ్‌కు వెళ్లే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.

కొసమెరుపు: ఘోరంగా ఓడిపోయిన ఈ కేసులో హెచ్ఎండీఏ లాయర్లకు ఇవ్వడానికి ఒప్పుకున్న ఫీజు అక్షరాల రూ.1.33కోట్లు. కాగా ఇప్పటి వరకు చెల్లించింది రూ.70 లక్షలు. వాస్తవంగా రూపొందించుకున్న నిబం ధనల ప్రకారం ఒక కేసుకు రూ.10వేలు మాత్రమే ఇవ్వాలని ఉంది.