Friday, April 23, 2010

'ఫోర్బ్స్ 2000' జాబితాలో 56 భారత కంపెనీలు

ఆర్ఐఎల్‌కు 126.., ఎస్‌బిఐకి 130వ స్థానం

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన అత్యంత శక్తివంతమైన కంపెనీల జాబితాలో భారత్‌కు చెందిన 56 కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాను అమెరికాకు చెందిన ప్రముఖ వాణిజ్య పత్రిక ఫోర్బ్స్ రూపొందించింది. 'గ్లోబల్ 2000' పేరుతో ప్రపంచంలోని రెండు వేల కంపెనీలకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ఈ జాబితాలో అమెరికాకు చెందిన బ్యాంకింగ్ దిగ్గజం జెపి మోర్గాన్ చేస్‌కు అగ్రస్థానం దక్కింది. తరువాతి స్థానాల్లో జెనరల్ ఎలక్ట్రిక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎక్సాన్ మొబిల్‌లు నిలిచాయి.

భారత్ నుంచి ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న కంపెనీల్లో ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (126 స్థానం) ముందంజలో ఉంది. కాగా ఈ జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (130), ఒఎన్‌జిసి (155), ఐసిఐసిఐ బ్యాంక్ (282), ఇండియన్ ఆయిల్ (313), ఎన్‌టిపిసి (341), టాటా స్టీల్ (345), భారతి ఎయిర్‌టెల్ (471), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (502), లార్సెన్ అండ్ టూబ్రో (548), హె చ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (632), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (695), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (741), హెచ్‌డిఎఫ్‌సి (783), డిఎల్ఎఫ్ (923), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (742), హీరోహోండా (1,571), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ( 1,702) స్థానాలను దక్కించుకున్నాయి.

స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ప్రపంచంలోని భారీ కంపెనీల అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ఫోర్బ్స్ కంపెనీలకు ర్యాంకులు కేటాయించింది. ఈ జాబితాలో 62 దేశాల కంపెనీలు ఉన్నాయి. 515 కంపెనీలు అమెరికా నుంచి 210 కంపెనీలు జపాన్ నుంచి స్థానాలను కైవసం చేసుకుని తమ శక్తిని చాటుకున్నాయి. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కంపెనీల సంఖ్య కూడా ఈ జాబితాలో వేగంగా పెరుగుతుండటం విశేషం. ఈ ఏడాదిలో ఫోర్బ్స్ జాబితాలో చైనా (113 కంపెనీలు), కెనడా (62 కంపెనీలు), భారత్ (56 కంపెనీలు) కంపెనీలు ఎక్కువగానే ఉన్నాయి.

ఫోర్బ్స్ లెక్క ప్రకారం తమ జాబితాలోని ప్రపంచవ్యాప్త 2000 కంపెనీల మొత్తం రాబడి 30 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. వీటి లాభాలు 1.4 లక్షల కోట్ల డాలర్లు. ఆస్తుల విలువ 124 లక్షల కోట్ల డాలర్లు, మార్కెట్ విలువ 31 లక్షల కోట్ల డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ పేర్కొంది.