
పాత కన్సార్టియంకే రాజీవ్ రహదారి విస్తరణ పనులు
టెండర్ల రద్దుకు సర్కారు ససేమిరా
చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు
హైదరాబాద్ - న్యూస్‌టుడే

రాష్ట్రంలో మూడు ప్రధాన రహదారులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద నాలుగు వరుసలుగా విస్తరించాలని గత ఏడాదే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఒకటైన హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రాజీవ్ రహదారి కోసం రూ.1358 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. సర్దుబాటు నిధి కింద రూ.177.07 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. టెండర్లను దాఖలు చేసిన డీఎల్‌ఎఫ్-గాయత్రి కన్సార్టియం రూ.529 కోట్ల మేర సర్దుబాటు నిధి కావాలంటూ టెండర్లను వేసింది. అంచనాలు ఎక్కువగా ఉండడం, రాష్ట్ర ఖజానాపై సర్దుబాటు నిధుల భారం పడనుండడంపై 'ఈనాడు' అప్పట్లో వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపిన కన్సార్టియం కేవలం రూ.9 కోట్లు మాత్రమే తగ్గించడానికి ముందుకు వచ్చింది. ఈ తగ్గింపుతో కాంట్రాక్టును ఆమోదిస్తే కేంద్రమిచ్చే సర్దుబాటు నిధి కాకుండా ప్రభుత్వ ఖజానాకు రూ.343 కోట్ల మేర గండిపడే అవకాశం ఉంది. దీనిపై మరోసారి 'ఈనాడు'లో కథనం వచ్చింది. దీంతో సంబంధిత కన్సార్టియంతో మరోసారి అధికారులు చర్చలు జరపగా రూ.70 కోట్లను తగ్గించడానికి అంగీకరించింది. టెండర్లు పిలిచినపుడు ఏ నిబంధనలకు అంగీకరించిందో అవే నిబంధనలకు అనుగుణంగానే పనులు చేయడానికి అంగీకరించడంతో కాంట్రాక్టును కట్టబెడుతూ ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారధి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.281.93 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
అంచనాలను పెంచి చూపించడమే కాకుండా వాహనాల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపించారని ఆరోపణలున్నాయి. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వ ఖజానాకు భారం పడుతుండగా టోల్ వసూళ్ల రూపేణా కాంట్రాక్టు సంస్థలు అధికంగా లబ్ధి పొందనున్నాయి. నిబంధనల్లో ఎటువంటి మార్పులు లేకుండా రూ.70 కోట్లను తగ్గించడానికి అంగీకరించారంటే మొత్తం అంచానాల్లో ఏ మేరకు మతలబులు జరిగాయో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.